Chandrababu Arrest: బాబు అరెస్టుపై తలో మాట.. కమలనాధులు ఏం సంకేతాలు ఇస్తున్నట్టు?

తెలంగాణ అధ్యక్ష పదవి నుంచి అధిష్టానం తొలగించి.. జాతీయస్థాయి కార్యదర్శి పదవి కట్టబెట్టడం, ఏపి ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించడంతో బండి సంజయ్ స్పందించారు.

Written By: Rocky, Updated On : September 15, 2023 1:08 pm

Chandrababu Arrest

Follow us on

Chandrababu Arrest: స్కిల్ పథకానికి సంబంధించి జరిగిన అవకతవకలలో ఏపీ మాజీ ముఖ్యమంత్రిని అక్కడి ప్రభుత్వం అరెస్టు చేసింది. సిఐడి చార్జ్ షీట్ దాఖలు చేయడంతో ఏపీ ఏసీబీకోర్టు చంద్రబాబు నాయుడుని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించింది. ఈ క్రమంలో చంద్రబాబు నాయుడునాయుడిని విడుదల చేయాలంటూ డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. రాజకీయ పక్షాలు కూడా అరెస్టు పట్ల నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ఏపీ ప్రభుత్వ తీరును తప్పు పడుతున్నాయి.. అయితే మరికొన్ని రాజకీయ పక్షాలు చంద్రబాబు నాయుడు అరెస్టును సమర్థిస్తున్నాయి. తెలంగాణలో అధికార భారత రాష్ట్ర సమితి నేతలు చంద్రబాబు అరెస్టుపై రకరకాలుగా స్పందిస్తున్నారు. ముఖ్యంగా ఆంధ్ర సరిహద్దు ప్రాంతమైన ఖమ్మం జిల్లాలో భారత రాష్ట్ర సమితి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చంద్రబాబు నాయుడు అరెస్టును ఖండించారు. అయితే చంద్రబాబు నాయుడు అరెస్టుకు సంబంధించి తెర వెనుక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉన్నారని రకరకాల ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే భారతీయ జనతా పార్టీ నాయకులు స్పందించారు.

తెలంగాణ అధ్యక్ష పదవి నుంచి అధిష్టానం తొలగించి.. జాతీయస్థాయి కార్యదర్శి పదవి కట్టబెట్టడం, ఏపి ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించడంతో బండి సంజయ్ స్పందించారు. చంద్రబాబు నాయుడు అరెస్టు సరికాదు అంటూ అక్కడి ప్రభుత్వాన్ని విమర్శించారు.. ఎన్నికల ముందు ఇష్టానుసారంగా అరెస్టు చేయడం వల్ల అది అంతిమంగా చంద్రబాబు నాయుడుకే లబ్ధి చేకూర్చుతుందని బండి సంజయ్ అభిప్రాయపడ్డారు. బండి సంజయ్ వ్యాఖ్యలు చేసిన కొద్దిసేపటికి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కూడా చంద్రబాబు నాయుడు అరెస్టు పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ ప్రభుత్వం తీరును ఖండించారు. చంద్రబాబు నాయుడు అరెస్టు తర్వాత రెండు రాష్ట్రాల్లో రెడ్డి సామాజిక వర్గం ఆచితూచి వ్యవహరిస్తోంది. తెలంగాణలో స్థిరపడ్డ కమ్మ సామాజిక వర్గం వారు చంద్రబాబు నాయుడు అరెస్టు పట్ల అధికార భారత రాష్ట్ర సమితి వైఖరి చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే అధికార పార్టీ లోని కొంతమంది కమ్మ సామాజిక వర్గం వారు మాత్రం చంద్రబాబు నాయుడు పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే వీరంతా ఆంధ్ర సరిహద్దు ప్రాంతంలో ఉన్న నేతలు కావడం విశేషం. చంద్ర బాబు నాయుడు ఆగస్టు జరిగినప్పుడు స్పందించని ఆ సామాజిక వర్గానికి చెందిన నాయకులు.. ఇప్పుడు తెలంగాణలో ఎన్నికలు ఉండటం, కొన్ని ప్రాంతంలో టిడిపి ఓటు బ్యాంకు ఉండడంతో.. చంద్రబాబు నాయుడికి అనుకూలంగా వ్యాఖ్యలు చేశారు.

ఇక బండి సంజయ్, కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చంద్రబాబు నాయుడు అరెస్టు పట్ల సంఘీభావం తెలిపితే.. మరి కొంతమంది చేస్తున్న వ్యాఖ్యలు వేరే విధంగా ఉన్నాయి. ముఖ్యంగా ఏపీలోని కొంతమంది బిజెపి నాయకులు చంద్రబాబు నాయుడు అరెస్టును సమర్థిస్తూ ఉండడం విశేషం. అయితే గతంలో చంద్రబాబు నాయుడు భారతీయ జనతా పార్టీకి ఏ విధంగా నష్టం చేకూర్చింది, ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఏ విధంగా తిట్టింది వారు ఉదహరిస్తున్నారు. ఒకవేళ బిజెపి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ని అరెస్టు చేసేది ఉంటే ఆ రోజే ఆ పని చేసేదని, వ్యక్తిగత కక్ష్యలు పెట్టుకునేంత స్థితిలో భారతీయ జనతా పార్టీ లేదని వారు గుర్తు చేస్తున్నారు. మరోవైపు బండి సంజయ్, కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వారి సొంత అభిప్రాయాలుగా తమ పరిగణిస్తున్నామని వారు చెబుతున్నారు. ఏది ఏమైనప్పటికీ చంద్రబాబు విషయంలో జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరుకు వారు అంతర్గతంగా మద్దతు తెలుపుతున్నట్టు తెలుస్తోంది. అయితే చంద్రబాబు అరెస్టు పట్ల కమలం పార్టీలోనే కొంతమంది ఒకరకంగా, ఇంకొంతమంది ఇంకొక రకంగా స్పందించడం అంతుపట్టకుండా ఉంది. కాగా ఇటీవల హైదరాబాద్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కేటీఆర్ ఎదుట చంద్రబాబు అరెస్టును ప్రస్తావించగా…ఆయన కూడా సమాధానాన్ని దాటవేయడం విశేషం. తెలంగాణలో కమ్మ సామాజిక వర్గం ఓట్ల కంటే రెడ్డి సామాజిక వర్గం వారి ఓట్లు ఎక్కువ ఉన్న నేపథ్యంలో అధికార భారత రాష్ట్ర సమితి ఎటువంటి వ్యాఖ్యలు చేయడం లేదని తెలుస్తోంది.