Homeజాతీయ వార్తలుBRS: ఎన్నికలకు ముందు ‘కారు’చిచ్చు!

BRS: ఎన్నికలకు ముందు ‘కారు’చిచ్చు!

BRS: బీఆర్‌ఎస్ లో కుమ్ములాటలు తారాస్థాయికి చేరాయి. ‘మా ఎమ్మెల్యేకు టికెట్‌ ఇవ్వొద్దంటూ’ నేతలు చేస్తున్న నినాదాలు మిన్నంటుతున్నాయి. నిన్న మొన్నటి వరకు నియోజకవర్గాల్లోనే అసంతృప్తి వ్యక్తం చేసిన బీఆర్‌ఎస్‌ అసమ్మతి నేతలు ఇప్పుడు హైదరాబాద్‌ బాట పడుతున్నారు. పార్టీలోని పలువురు కీలక నేతలను కలిసి, ఈసారి సిట్టింగ్‌ ఎమ్మెల్యేకు టికెట్‌ ఇవ్వొద్దని వినతి పత్రాలు ఇస్తున్నారు. నల్లగొండ జిల్లా దేవరకొండ ఎమ్మెల్యే రమావత్‌ రవీంద్ర కుమార్‌కు టికెట్‌ ఇవ్వొద్దంటూ ఆ పార్టీలోని అసమ్మతి నేతలు మంత్రి హరీశ్‌రావుతో పాటు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డిని కలిసి వినతి పత్రాలు అందజేశారు. దేవరకొండ మునిసిపల్‌ చైర్మన్‌ ఆలంపల్లి నర్సింహ, దేవరకొండ ఎంపీపీ నల్లగాసు జాన్‌యాదవ్‌, మునిసిపల్‌ మాజీ చైర్మన్‌ వడ్త్య దేవేందర్‌నాయక్‌ దేవరకొండ నియోజకవర్గానికి చెందిన బీఆర్‌ఎస్‌ ప్రజా ప్రతినిధులు, ముఖ్యనేతలు హైదరాబాద్‌ వెళ్లారు. శాసన మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి అనుచరుడిగా పేరున్న దేవరకొండ మునిసిపల్‌ మాజీ చైర్మన్‌ దేవేందర్‌ నాయక్‌ బీఆర్‌ఎస్‌ టికెట్‌ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.

అసమ్మతి నేతల సమావేశం

ఇక భద్రాద్రి జిల్లా ఇల్లెందు ఎమ్మెల్యే బానోతు హరిప్రియకు టికెట్‌ ఇవ్వొదంటూ ఇల్లెందు మునిసిపల్‌ చైర్మన్‌ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు ఇంట్లో అసమ్మతి నేతలు శనివారం రాత్రి సమావేశమయ్యారు. నియోజవర్గంలో ఎమ్మెల్యే హరిప్రియ, ఆమె భర్త హరిసింగ్‌లు ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ బీఆర్‌ఎ్‌సను భ్రష్టు పట్టించారన్నారు. కాంట్రాక్టర్లతో కుమ్మక్కై తమ స్వలాభాల కోసం పనులు చేస్తున్నారని ఆరోపించారు. ఇల్లెందు మునిసిపాలిటీలో పాలకవర్గానికి సంబంధం లేకుండా రూ.20కోట్ల నిధులను సంబంధంలేని పంచాయతీరాజ్‌ విభాగానికి బదలాయించారని ఆరోపించారు.

జనగామ జిల్లాలో టికెట్ల లొల్లి..

జనగామ జిల్లాలోని జనగామ, స్టేషన్‌ ఘన్‌పూర్‌ నియోజకవర్గాల్లో సిటింగ్‌ ఎమ్మెల్యేలకు మద్దతుగా పార్టీ శ్రేణులు ఆందోళన బాట పట్టాయి. జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే రాజయ్యకు టికెట్‌ దక్కదనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో.. టికెట్‌ను ఆశిస్తున్న పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కడియం శ్రీహరికి వ్యతిరేకంగా.. ఆయా ఎమ్మెల్యేల అనుచర వర్గాలు ఆందోళనకు దిగాయి. జనగామలో పల్లా రాజేశ్వర్‌రెడ్డికి వ్యతిరేకంగా ముత్తిరెడ్డి అనుచరులు భారీ ర్యాలీ నిర్వహించారు. చౌరస్తాలో రెండు గంటలు రాస్తారోకో, మానవ హారం నిర్వహించారు. ఘన్‌పూర్‌ నియోజకవర్గంలో ఎమ్మెల్సీ కడియం శ్రీహరికి వ్యతిరేకంగా ఎమ్మెల్యే రాజయ్య వర్గీయులు నిరసన చేపట్టారు. ఘన్‌పూర్‌ మండలం మీదికొండ, చిలుపూర్‌ మండలం వెంకటాద్రిపేటలో కడియం దిష్టిబొమ్మను దహనం చేశారు. ఘన్‌పూర్‌, జఫర్‌గడ్‌లో కడియం దిష్టిబొమ్మను దహనం చేయడానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.

మండిపడుతున్న ఆశావాహులు

టికెట్‌ ఇస్తామని చెప్పి, పని జేసుకోమన్న అధిష్ఠానం చివరి నిమిషంలో ముఖం చాటేయడంతో ఆశావాహులు మండిపడుతున్నారు. తమను పార్టీ పెద్దలు మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే గత ఎన్నికల సమయంలో పిలిచి, మాట్లాడి బుజ్జగింపులు చేశారు. ఈసారి కనీసం అటువంటిదేమీ కూడా లేదంటున్నారు. ఈ ఎన్నికలతో టీఆర్‌ఎస్ లో ఉద్యమ బ్యాచ్‌ కనుమరుగైపోతుందని పార్టీలో మొదట్నించి ఉన్న మరో సీనియర్‌ నేత అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పాత బ్యాచ్‌ విషయంలో ఎటువంటి సానుభూతి లేదని, నో సెంటిమెంట్‌, నో ఎమోషన్‌ అన్న ధోరణిలో ఉన్నారని మరో కీలక నేత వ్యాఖ్యానించారు. సీఎం ధోరణి చూస్తుంటే గెలుపు, డబ్బు, అధికారం అన్న పాయింట్స్‌ చుట్టూనే తిరుగుతోందని ఆ నేత వెల్లడించారు. ఇంకా చెప్పాలంటే బీఆర్‌ఎస్ లో అసలు పాత ముఖాలు లేకుండా చేస్తారేమోనన్న భయం కలుగుతోందని మరో ఉద్యమ నేత ఆందోళన వ్యక్తం చేశారు.

ఆ సోయి కూడా లేదు

టికెట్‌ రాని వారిని, ఉద్యమకారుల్ని కనీసం పిలిచి మాట్లాడాలన్న సోయి కూడా పార్టీ పెద్దలకు లేకుండా పోయిందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. వారికి టికెట్‌ ఇవ్వకున్నా అటువంటి వారిని కాపాడుకోవాలన్న ధోరణి కూడా పార్టీ అధిష్టానంలో ఏ మాత్రం కనిపించడం లేదని కొందరు సీనియర్‌ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడంతా బీఆర్‌ఎ్‌సలో పవర్‌ పాలిటిక్స్‌ నడుస్తున్నాయని, కష్టపడి పనిజేసే వారికి గుర్తింపు లేకుండా పోయిందని వ్యాఖ్యానిస్తున్నారు. క్షేత్రస్థాయిలో మొదట్నించి ఎవరెవరు పార్టీలో ఉన్నారు? వారికి ఇప్పటివరకు ఏమైనా చేశామా? అన్న విషయాలను జిల్లా మంత్రులు అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లాల్సి ఉండగా వారు తమకేం పట్టనట్లు ఉంటున్నారని, తమకు కనీసం గౌరవం కూడా ఇవ్వడం లేదని సీనియర్‌ నేతలు వాపోతున్నారు. ఇటువంటి గ్యాప్‌ల వల్ల ఉద్యమకారులకు, అధిష్ఠానానికి మధ్య గ్యాప్‌ మరింత పెరిగిందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular