ఇప్పటికే తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. ఏ లీడర్ ఎటు వైపు ఉంటాడో ఎవరికీ తెలియదు. కానీ.. నల్గొండ జిల్లా పర్యటనలో కాంగ్రెస్ సీనియర్ నేతలంతా ఒక్కటై కనిపించారు. సాగర్ ఉపఎన్నిక, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సత్తా చాటడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. వివిధ కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్తూ పార్టీ కేడర్‌లో జోష్ నింపుతున్నారు. నేతల ఐక్యతారాగంపై తెలంగాణ కాంగ్రెస్‌లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. త్వరలో జరగబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలతోపాటు నాగార్జునసాగర్ ఉప ఎన్నిక నేపథ్యంలో… నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీలో జోష్ మొదలైంది.
Also Read: జనసేనతో జతకట్టేందుకు టీడీపీ కొత్త స్కెచ్
టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తంకుమార్ రెడ్డి, సీఎల్పీ నేత విక్రమార్క, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సీనియర్ నేతలు జానారెడ్డి, వీహెచ్ సహా పలువురు నేతలు ఉమ్మడి జిల్లాలో ఏకతాటిపైకి వచ్చి పలు కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్తున్నారు. నాగార్జునసాగర్ ఉప ఎన్నిక బరిలో ఉన్న జానారెడ్డి నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేస్తున్నారు. పార్టీ కార్యకర్తలకు, ప్రజలకు అందుబాటులో ఉంటూ మనోధైర్యం ఇస్తున్నారు. ఇక, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా… పొలంబాట- పోరు బాట పేరుతో రైతులతో ముఖాముఖి నిర్వహించారు.
అదే టైమ్‌లో ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి శ్రీశైలం ఎడమ గట్టు కాలువ సొరంగం పనులు, బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టుల పూర్తి కోసం నార్కట్ పల్లి నుంచి హైదరాబాద్ వరకు పాదయాత్ర తలపెట్టారు. అయితే.. పాతిక మందికి మాత్రమే అనుమతి ఇవ్వడంతో ఎమ్మెల్సీ ఎన్నిక నేపథ్యంలో పాదయాత్రపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
Also Read: పోలవరాన్ని కుదిస్తున్నారా.. ఏం జరగబోతోంది?
ఇక నల్లగొండ-–ఖమ్మం– వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా రాములు నాయక్ నామినేషన్ కార్యక్రమానికి ముఖ్య నాయకులంతా హాజరయ్యారు. ఎమ్మెల్సీతోపాటు సాగర్ బై పోల్‌లో కాంగ్రెస్‌దే విజయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు హస్తం నేతలు. సీనియర్ నేతలంతా ఒక్కటవ్వడంతో కాంగ్రెస్ కేడర్ కూడా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఫుల్ జోష్ లో ఉంది. మరి ఈ ఐక్యత ఎన్నికలు ముగిసేంతవరకు కొనసాగిస్తారా అనే అనుమానాలు కూడా కనిపిస్తున్నాయి.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్