
ఈ మధ్య కాలంలో రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల కోసం సరికొత్త పథకాలను అమలు చేస్తున్నాయి. పథకం ఏదైనా పేద ప్రజల సంక్షేమమే ప్రధానంగా ముందుకెళుతున్నాయి. ప్రజలు తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనం పొందే దిశగా ముందుకెళుతున్నాయి. తాజాగా జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ సంచలన నిర్ణయం తీసుకుని ఆ రాష్ట్ర ప్రజలకు ప్రయోజనం కలిగేలా చేశారు. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు అదిరిపోయే శుభవార్త చెప్పారు.
కేవలం పది రూపాయలకే ధోతి లేదా లుంగీ లేదా పది రూపాయలకే చీర ప్రజలు పొందేలా కొత్త స్కీమ్ ను ప్రవేశపెట్టారు. జార్ఖండ్ ఎన్నికలకు ముందు హేమంత్ సోరెన్ తమ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలకు ధోతీలు, చీరలు ఇస్తామని హామీ ఇచ్చారు. ప్రజలు తనను సీఎం చేయడంతో ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ తాజాగా రూ.10కే ధోతి, చీర స్కీమ్ ను అమలు చేస్తున్నట్టు చెప్పారు.
సీఎం కేబినేట్ సమావేశం నిర్వహించి ఈ స్కీమ్ కు ఆమోద ముద్ర వేశారు. జాతీయ ఆహార భద్రతా చట్టం పరిధిలోకి వచ్చే కుటుంబాలు, అంత్యోదయ అన్నా యోజన కింద అర్హత పొందిన కుటుంబాలు ఈ స్కీమ్ ద్వారా ధోతి, చీర పొందడానికి అర్హులు. పురుషులు ధోతీ వద్దనుకుంటే అంతే మొత్తంతో లుంగీని కొనుగోలు చేయవచ్చు. జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉంది.
పేదల కోసం సరికొత్త పథకాన్ని అమలు చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేయడంపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. అర్హత సాధించిన వారికి ఏడాదికి రెండుసార్లు ధోతి, చీర పంపిణీ చేయనున్నారు. పేద ప్రజలకు మంచి వస్త్రాలు ఉండాలనే సదుద్దేశంతో హేమంత్ సోరెన్ ఈ స్కీమ్ ను అమలు చేస్తున్నారు.