CM Jagan- YSR Jayanthi: సంక్షేమ పాలనకు చిరునామాగా నిలిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డికి తెలుగు ప్రజలు గుండెల్లో గుడికట్టారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రతీ ఇంటికి లబ్ధి చేకూరేలా తీసుకువచ్చిన పథకాలు రాజన్న అని ముద్దుగా పిలుచుకునేలా చేశాయి. రాజశేఖరరెడ్డి మరణించి దశాబ్దం దాటినా… ఇప్పటికీ ఆయన సంక్షేమ సంతకం తెలుగు ప్రజల గుండపై చెదిరిపోలేదు. చెరిపే సాహసం కూడా ఏ రాజకీయ పార్టీ చేయడం లేదు. అందుకు దూరదృష్టి.. పేదల గురించి వైఎస్సార్ ఆలోచన చేసిన తీరే నిదర్శనం. అందుకే ఆయన చనిపోయినా ప్రజల గుండెల్లో బతికే ఉన్నారు.
తండ్రిని మించిన తనయుడిగా..
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి.. రాజశేఖరరెడ్డి ఉన్నప్పుడే రాజకీయాల్లోకి వచ్చారు. తండ్రి ప్రోత్సాహంతో కడప ఎంపీగా ఎన్నికయ్యారు. దేవుడి ఉద్దేశమో.. వైఎస్సార్ సంకల్పమో తెలియదు కానీ.. జగన్‌ను రాజకీయాల్లోకి వచ్చేలా చేశాయి. తండ్రి మరణానంతరం ఆయన రాజకీయ వారత్వాన్ని కూడా పునికిపుచ్చుకున్నాడు జగన్. తండ్రిని మించిన తనయుడిగా తనను తాను మలచుకున్నాడు. వైఎస్‌ఆర్‌లోని పట్టుదల, సేవాగుణం , పాలనాదక్షత జగన్‌కు వచ్చాయి.
తండ్రి బాటలో నడిచి..
తండ్రి వైఎస్‌ఆర్ బాటలోనే జగన్ రాష్ట్రమంతా పాదయాత్ర చేశారు. వైఎస్సార్ మరణం తట్టుకోలేక గుండెలు పగిలి మృతిచెందిన ప్రతీ ఇంటికి వెళ్లారు. ఓదార్చారు. తర్వాత ప్రజావ్యతిరేక పాలనను అంతం చేయడానికి మరో ప్రజాప్రస్థానం పేరుతో రాష్ట్రంలో పాదయాత్ర చేశారు. వైఎస్సార్ లాగానే పాదయాత్ర జగన్‌ను కూడా అధికారంలోకి తెచ్చింది. వైఎస్ పథకాలను ఫాలో అవుతూ అంతకుమించిన ‘నవరత్నాల’తో ప్రజలకు డబ్బులు, సంక్షేమం పంచుతూ ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేశారు. అందుకే ఏపీ చరిత్రలోనే అత్యధికంగా 151 సీట్లు సాధించారు. వచ్చేసారి కూడా జగన్ 25కు 25 సీట్లు సాధిస్తాడని సర్వేలు చెబుతున్నాయి. సో సంక్షేమం, అభివృద్ధితో రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసిన వైఎస్సార్, ఇప్పటి జగన్ ఆంధ్రకు రెండు కళ్లుగా చెప్పొచ్చు. నాటి వైఎస్‌ఆర్ ఆశయాలను నిజం చేస్తూ జగన్ ఆయన వారసత్వాన్ని కొనసాగిస్తూ ప్రజల మదిలో చిరస్థాయిగా నిలిచిపోతున్నారు.
జగన్ ట్వీట్..
దివంగత ముఖ్యమంత్రి, సంక్షేమ సారథి. జలయజ్ఞప్రదాత, అపర భగీరథుడు.. వైఎస్సార్ జయంతి సందర్భంగా ఆయన తనయుడు, ప్రస్తుత ఏపీ సీఎం జగన్ ట్వీట్ చేశారు. ‘ప్రజల జీవన ప్రమాణాలు పెరగాలని, ప్రతీ ఇంట్లో గొప్ప చదువులు చదవాలని, సుఖసంతోషాలతో ప్రతి ఒక్కరూ ఉండాలని మీరు నిరంతరం తపించారు నాన్నా. అదే ప్రజలందరి హృదయాల్లో మీ స్థానాన్ని సుస్థిరంచేసింది. ఆ ఆశయాల సాధనలో మీ స్ఫూర్తి నన్ను ప్రతిక్షణం చేయిపట్టి నడిపిస్తోంది. మీ జయంతి మాకందరికీ ఒక పండుగ రోజు’ అని పేర్కొన్నారు. దీనికి వైఎస్సార్‌తో తాను ముచ్చటిస్తున్న ఫొటో జోడించారు.