AP Govt OTT: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రచారానికి పెద్దపీట వేయనున్నారు. ప్రభుత్వం నిర్వహించే సంక్షేమ పథకాలపై మీడియా వక్ర కథనాలు ప్రసారం చేస్తోందని భావిస్తున్నారు.దీంతో ప్రభుత్వ పథకాలను ప్రజలకు తీసుకెళ్లే క్రమంలో మరింత ప్రచారం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. దీని కోసం ఆయన సొంతంగా ఓ ఓవర్ ది టాప్ (ఓటీటీ) ప్లాట్ ఫామ్ తీసుకొచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. దీనికి కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ మంత్రి అనురాగ్ ఠాగూర్ తో భేటీ కావాలని నిర్ణయించుకున్నారు.

ప్రభుత్వ సంక్షేమ పథకాలకు విస్తృత ప్రచారం నిర్వహించాలని భావిస్తున్న తరుణంలో ప్లాట్ ఫామ్ నెలకొల్పడానికి కావాల్సిన అనుమతులు మంజూరు చేయాలని కోరనున్నారు.దీంతో ప్లాట్ ఫామ్ రూపురేఖలు తదితర విషయాలపై కేంద్రమంత్రితో చర్చించనున్నట్లు తెలుస్తోంది. కేంద్ర మంత్రి నుంచి దీనికి కావాల్సిన అన్ని మార్గదర్శకాలను తీసుకోవాలని చూస్తున్నట్లు సమాచారం.
ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాల నేపథ్యంలో ప్రభుత్వ కార్యక్రమాలకు సముచిత ప్రాధాన్యం ఇచ్చేందుకు ప్రచారం నిర్వహించాలని భావిస్తున్నారు. ఏపీలో మెజారిటీ మీడియా ప్రభుత్వ పథకాలు పక్కదారి పడుతున్నాయని అసత్య ప్రచారం చేస్తున్నాయని జగన్ కొద్ది రోజులుగా చెబుతున్నారు. దీంతో వాటి ప్రచారాన్ని తిప్పి కొట్టే క్రమంలో ఓటీటీ ఉపయోగపడుతుందని తెలుసుకుని దాన్ని ప్రారంభించే ఏర్పాట్లు చేస్తున్నారు.
ఓటీటీ ప్లాట్ ఫాం తీసుకొస్తే ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి గురించి విస్తృత ప్రచారం జరగనుంది. దీన్ని శాశ్వత ప్రాతిపదికన ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు చేస్తోంది. సరికొత్త వ్యవస్థను తీర్చిదిద్దే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. వ్యతిరేక మీడియాను అడ్డుకునేందుకే జగన్ ఓటీటీని నెలకొల్పాలని భావిస్తున్నారు. దీనికి సంబంధించిన విధి విధానాలు, మార్గదర్శకాలపై మంత్రితో చర్చించనున్నట్లు సమాచారం. ఏదిఏమైనా జగన్ తీసుకున్న నిర్ణయం ప్రభుత్వానికి లాభం చేకూరుస్తుందో లేదో వేచి చూడాల్సిందే.