Actor Suman: ప్రస్తుతం మీడియా ఫోకస్ అంతా తెలుగు చిత్ర పరిశ్రమ పైనే ఉంది. ఇందుకు తగ్గట్టుగానే టాలీవుడ్ లో జరుగుతున్న పరిణామాలు కూడా అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. నిన్ననే చిత్ర పరిశ్రమకు పెద్దగా తాను ఉండనని. పెద్దరికం తాను వహించను అని, ఇద్దరు గొడవలు పెట్టుకుంటే పంచాయితీ చేసే పెద్దరికం తనకు వద్దని, ఎప్పుడు ఎవరికి ఏ అవసరం వచ్చినా కూడా సాయపడేందుకు ముందుంటానని మెగాస్టార్ చిరంజీవి చెప్పడం సంచలనంగా మారింది. ఆ వెంటనే సీనియర్ హీరో మెహన్ బాబు రాసిన బహిరంగ లేఖ అందరిని ఆశ్చర్యపరిచింది. ఈ క్రమంలో తాజాగా సుమన్ మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ మేరకు సుమన్ మాట్లాడుతూ… తాను సినిమాల్లోకి వచ్చి 44 ఏళ్ళు కావస్తోందని దాదాపు 10 భాషల్లో 600 సినిమాల్లో నటించానని తెలిపారు. తనకు ఎలాంటి సపోర్ట్ అందలేదని… స్వయంకృషితో మాత్రమే ఈ స్థాయిలో ఉన్నానని అన్నారు. సినిమా టిక్కెట్ల సమస్యను అన్ని వర్గాలను దృష్టిలో పెట్టుకొని పరిష్కరించాలని అన్నారు. సినిమా రంగంలో ఐక్యత లేదనడం వాస్తవం కాదని, కృష్ణ, కృష్ణంరాజు, మురళీమోహన్ లాంటి సీనియర్ల సలహా తీసుకోవాలని సూచించారు. ఇండస్ట్రీలో ఏ ఒక్కరికో పెద్దరికం ఇవ్వడం సరికాదని, రాజకీయాలు ఇప్పుడు నేను మాట్లాడనని సుమన్ తెలిపారు.
చిత్ర పరిశ్రమలో ఐకమత్యం లేదనడం నిజం కాదని సుమన్ స్పష్టం చేశాడు. ఇండస్ట్రీలో ఇగోలు అనేవి ఉంటాయని అందరికీ తెలిసిందే. కరోనా వల్లే ఈ సమస్యలన్నీ ఏర్పడ్డాయి. ఎకానమీ దెబ్బతింది, డిసెంబర్ నెలలో అఖండ, పుష్ప సినిమాలు హిట్ అయ్యాయి. అలా సినిమాలు హిట్ అయి మళ్లీ సాధారణ పరిస్థితులు వస్తే ఈ వివాదాలన్నీ కనిపించవని సుమన్ అభిప్రాయపడ్డారు.