CM Revanth Reddy: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు అసెంబ్లీ వేదికగా చంద్రబాబు నాయుడు వైయస్ రాజశేఖర్ రెడ్డి పోటాపోటీగా విమర్శలు చేసుకునేవారు.. ఏదైనా ఉమ్మడి కార్యక్రమం ఉంటే ఒకరిని ఒకరు పలకరించుకునేవారు. కుశల ప్రశ్నలు వేసుకునేవారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఒకటి రెండు మినహా ఆ స్థాయిలో సంఘటనలు చోటు చేసుకోలేదు. అసలు కేసీఆర్ ప్రతిపక్షాలకు కనీసం విలువ ఇచ్చేవాడు కాదు. తన అవసరాలకు అనుగుణంగా భట్టి విక్రమార్క తో (ఈ ఇద్దరి మధ్య ఉన్న వ్యవహారం వేరే) మాత్రమే మాట్లాడేవాడు. అప్పుడప్పుడు ఈ జాబితాలో ఉత్తం కుమార్ రెడ్డి చేరేవాడు. కనీసం శాసనసభలో గానీ, బయటి ప్రపంచంలో గాని తనకు ఎదురు ప్రశ్న ఉండకూడదనే టైప్. అయితే అలాంటి కెసిఆర్ ఇప్పుడు ప్రతిపక్షానికి పరిమితం అయిపోయాడు. ప్రతిపక్ష పాత్రను నిర్వర్తించే క్రమంలో కాలుజారి కిందపడ్డాడు. తుంటి ఎముక విరిగి యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇలాంటి సందర్భంలోనే తనకు తగిన శాస్తి జరిగింది అనుకోక రేవంత్ రెడ్డి తెరపైకి వచ్చాడు. ట్విట్టర్ ద్వారా పరామర్శ వ్యక్తం చేశాడు. ఆదివారం ఉదయం యశోద ఆసుపత్రికి వెళ్లి కేసీఆర్ ను పరామర్శించాడు. సరే ఇందులో రాజకీయ కోణం, ఏదైనా ఉండని.. రేవంత్ వెళ్ళాడు, పరామర్శించాడు. ఆ లెక్కన చూస్తే ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నప్పుడు ఎంతోమంది ఆయనను వాడుకున్నారు. ఈ సమయంలో ఆయన చుట్టూ ఎంతమంది ఉన్నారు? ఈ లెక్కన రేవంత్ రెడ్డి మంచి పని చేసినట్టే కదా.. తెలంగాణ సమాజం కోరుకుంటుంది.. తెలంగాణ సమాజం ఆశిస్తున్నది ఇలాంటి రాజకీయాలనే.
ఇదే అసలు సిసలైన పరిణితి
విమర్శలు ప్రతి విమర్శలు ఎన్నైనా ఉండవచ్చును గాక.. రాజకీయ ప్రత్యర్థి మంచంలో పాల్గొన్నప్పుడు పరామర్శించడమే అసలు సిసలైన రాజకీయ పరిణతి. ఇదే కేసీఆర్ రేవంత్ రెడ్డి విషయంలో ఎంతటి కక్ష ప్రదర్శించాడు తెలంగాణ సమాజం మొత్తం చూసింది. తనను సెక్రటేరియట్ కి కూడా పిలవలేదు. కొడంగల్ అసెంబ్లీ స్థానంలో పోటీ చేస్తుంటే పట్నం నరేందర్ రెడ్డిని బరిలోకి దింపి ఎంత ఇబ్బంది పెట్టాలో అంత ఇబ్బంది పెట్టాడు. నరకం చూపించాడు. హేళన చేశాడు. ఇదే రేవంత్ రెడ్డి ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కెసిఆర్ ఎలాంటి మాటలు అన్నాడో తెలుసు.
ఓటుకు నోటు కేసులో..
ఓటుకు నోటు విషయంలో ఎర్రబెల్లి దయాకర్ రావు ద్వారా ఎలాంటి స్క్రీన్ ప్లే రచించాడో తెలుసు. చివరికి తన సొంత కూతురు పెళ్లి రోజు కూడా గంట సమయం ఇవ్వకుండా వేధించాడు. ఎన్నికలకు ముందు కూడా సొంత మీడియాలో ఎంత విషం చిమ్మాలో అంత విషం చిమ్మాడు. కానీ తెలంగాణ ప్రజానీకం వీటన్నిటిని చూస్తూ ఉండలేదు. కెసిఆర్ కు తగిన గుణపాఠం చెప్పారు. ప్రతిపక్షమని చిన్న చూపు చూడలేదు. గౌరవప్రదమైన సీట్లే ఇచ్చారు. అసెంబ్లీ ఏర్పాటుకు ముందు జారిపడ్డాడు. వయసులో పెద్దవాడు. తన తండ్రి లాంటివాడు.. అందుకే రేవంత్ ముందుకు వచ్చాడు. పరామర్శించాడు. తనను తిట్టిన కేటీఆర్ ని కూడా భుజం తట్టాడు. మెరుగైన వైద్యం ఉండేలా చూడాలని అక్కడి వైద్యులను ఆదేశించాడు. కానీ ఈ నాటికి కేసీఆర్ ఓటమిని ఒప్పుకోవడం లేదు. రాజీనామా లేఖను గవర్నర్ కు నేరుగా కాకుండా తన ఓఎస్డి ద్వారా పంపాడు. కొత్త ప్రభుత్వానికి కనీసం శుభాకాంక్షలు కూడా చెప్పలేదు. అంటే తెలంగాణను తన సొంత ఆస్తులాగా ఈనాటికి కేసీఆర్ భావిస్తున్నాడు. ఇదే సమయంలో రేవంత్ రెడ్డి రాజకీయ పరిణతని ప్రదర్శిస్తున్నాడు. ఇలాంటి రాజకీయాన్నే ఇప్పుడు తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు.