Chandrababu On Revanth Reddy: చంద్రబాబు విషయంలో సీన్ మారుతోంది. ఇన్నాళ్లు ఆయన ఎవరితో శత్రువు అనిపించుకున్నారో.. ఎవరైతే విమర్శలు చేశారో.. వారే ఇప్పుడు పొగుడుతున్నారు. ఆయన కోసం పరితపిస్తున్నారు. ఏ ప్రాంతంలో చంద్రబాబు అంటే వ్యతిరేక భావన ఉందో.. ఇప్పుడు అదే ప్రాంతంలో చంద్రబాబు ప్రస్తావన వస్తోంది. ఎన్నికల ముంగిట చంద్రబాబుకు ఇదొక సానుకూల అంశమే. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అంటే ఒక్కటే కాదని.. అందులో టిడిపి సైతం ఉందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఏకంగా చంద్రబాబును ఆకాశానికి ఎత్తేశారు. మరోవైపు తెలంగాణలో రాజకీయాలు చేసి ఏపీ వైపు వచ్చిన షర్మిల సైతం.. చంద్రబాబును సీఎం కుర్చీలో కూర్చోబెట్టే వరకు ఊరుకునేలా కనిపించడం లేదు.
మొన్నటి వరకు ఏపీ, తెలంగాణలో స్నేహపూర్వక ప్రభుత్వాలు నడిచాయి. ఏపీలో జగన్, తెలంగాణలో కేసీఆర్ స్నేహితులుగా మెలిగారు. అయితే అవి రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదన్నట్టు.. రాజకీయ ప్రయోజనాల కోసమే అవునన్నట్టు వారి స్నేహం నడిచింది. ఇప్పుడు కృష్ణా నది జలాల వివాదం పుణ్యమా అని వారి స్నేహాన్ని కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఎండగడుతోంది. ఏకంగా అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేదాకా పరిస్థితి వచ్చింది. అయితే ఈ మొత్తం ఎపిసోడ్లో కెసిఆర్, జగన్ లను విలన్లుగా చూపించే ప్రయత్నం జరుగుతోంది. చంద్రబాబుకు ప్రయోజనం చేకూర్చేలా వ్యవహారం నడుస్తోంది. మంత్రి జూపల్లి కృష్ణారావు అయితే కెసిఆర్, జగన్ ల మధ్య స్ట్రాంగ్ బంధం ఉందని.. కానీ అది రాష్ట్ర ప్రయోజనాలకు కాదని తేల్చి చెప్పారు. ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఏపీలో కలిపినప్పుడు కేసీఆర్ మౌనం పాటించారని.. కృష్ణా జలాల సాధనలో కచ్చితంగా వ్యవహరించకుండా కేంద్రం ముందు మోకరిల్లారని ఆరోపణలు చేశారు. చంద్రబాబు అంటే కెసిఆర్ కు రాజకీయంగా పడదని.. ఆయన రెండోసారి సీఎం కాకూడదని కేసీఆర్ కోరుకున్నారని.. అందుకే జగన్ కు ఎన్నికల్లో సహకరించిన విషయాన్ని జూపల్లి ప్రస్తావించడం విశేషం.
అయితే తెలంగాణలో రాజకీయ పరిస్థితులు మారాయి. ఏ చంద్రబాబును బూచిగా చూపించి రెండుసార్లు కెసిఆర్ అధికారంలోకి రాగలిగారు. తెలంగాణ సమాజంలో చంద్రబాబు పేరు లేకుండా చేయాలని చూశారు. అయితే కెసిఆర్ కు శత్రువుగా భావిస్తున్న కాంగ్రెస్.. చంద్రబాబును భుజాలకు ఎత్తుకోవడం విశేషం. రేవంత్ రెడ్డి సీఎం కావడం వెనుక చంద్రబాబు ఉన్నారన్న ఆరోపణల నేపథ్యంలో.. ఇప్పుడు ఆయన క్యాబినెట్ లోని మంత్రులు సైతం చంద్రబాబు పేరు ప్రస్తావిస్తుండడం విశేషం. ఒకవైపు ఏపీలో కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల జగన్ పై నేరుగా విమర్శలు చేస్తూ రాజకీయంగా దెబ్బతీస్తున్నారు. చంద్రబాబుకు అవకాశం కల్పిస్తున్నారు. ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ లో సైతం అదే పరిస్థితి కనిపిస్తుండడం విశేషం. అసలు తెలంగాణలో చంద్రబాబుకు పని ఏంటన్న తెలంగాణ వాదులే.. ఇప్పుడు ఆయనను పరోక్షంగా కీర్తిస్తుండడం.. చంద్రబాబు ప్రత్యర్థులను టార్గెట్ చేస్తుండడం.. మారిన రాజకీయ పరిస్థితులకు అద్దం పడుతోంది.