
కరోనా వైరస్ కట్టడిలో కేంద్రంకు సహకరిస్తూ క్రియాశీలకంగా పనిచేస్తున్న ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలపై కేంద్రం వివక్షాపూర్వకంగా వ్యవహరిస్తున్నదనే విమర్శలు చెలరేగుతున్నాయి.
ముఖ్యంగా కరోనా కట్టడిలో ముందుంటున్న వైద్యులు, వైద్య సిబ్బందిపై దాడులు జరుగుతున్న ప్రాంతాలకు అనే పేరుతో ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలకు కేంద్ర బృందాలను పంపాలనే ప్రయత్నాల పట్ల తీవ్ర నిరసన వ్యక్తం అవుతున్నది.
రాజస్థాన్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో లాక్‌డౌన్ ఉల్లంఘనలు, వైద్య సిబ్బందిపై దాడులకు సంబంధించి పరిస్థితిని స్వయంగా సమీక్షించేందుకు ఆరు కేంద్ర బృందాలను కేంద్ర హోం శాఖ ఆ రాష్ట్రాలకు పంపేందుకు రంగం సిద్ధం చేయడం పట్ల ఆగ్రవేశాలు వ్యక్తం అవుతున్నాయి.
కేవలం ప్రతిపక్ష ప్రభుత్వాలున్న రాష్ట్రాలను ఎంపిక చేశారని, బీజేపీ, దాని మిత్రపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల గురించి పట్టించుకోవడం లేదని విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
పశ్చిమ బెంగాల్‌కు కేంద్ర బృందాలను పంపాలన్న హోం శాఖ నిర్ణయంపై సీఎం మమత బెనర్జీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కరోనా కట్టడికి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న మద్దతును, సలహాలను స్వాగతిస్తున్నామని.. అయితే కేంద్ర బృందాలను ఎందుకు పంపాలని కేంద్రం భావిస్తుందో సరైన కారణాలు తెలియజేయాలని ఆమె నిలదీశారు.
సరైన కారణాలు లేకుండా తాను రాష్ట్రంలోకి కేంద్ర బృందాలను అనుమతించినట్లయితే సమాఖ్య స్ఫూర్తికి తూట్లు పొడిచినట్లవుతుందని స్పష్టం చేస్తూ మమత ట్వీట్ చేశారు.
కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో పోలీస్ శాఖ ఉన్న ఢిల్లీలోనే తబ్లీఘి జమాత్ ద్వారా దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి చెందితే ఏమి చర్య తీసుకున్నారని ఈ సందర్భంగా ప్రశ్నలు తెలెత్తుతున్నాయి.
విధినిర్వహణలో ఉన్న వైద్యులు, వైద్య సిబ్బందిపై దాడులు జరిపినవారిపై జైలు శిక్షతో సహా కఠిన చర్యలు తీసుకోవడానికి వీలుగా గత ఏడాది కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక బిల్ ను తయారు చేస్తే అది అవసరం లేదని అంటూ అమిత్ షా పక్కన పడవేయడాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు.
ఆ బిల్లుకు ఇప్పుడైనా చట్ట రూపం కల్పించమని కోరుతూ ఢిల్లీ ఎయిమ్స్ రెసిడెంట్ వైద్యుల సంఘం ఒక లేఖలో అమిత్ షా ను కోరడం గమనార్హం.
బీజేపీలో అధికారంలో ఉన్న కర్ణాటక, ఆ పార్టీ మిత్రపక్షం అధికారంలో ఉన్న తమిళనాడుతో పాటు బిజెపికి సహకారం అందిస్తున్న ప్రభుత్వం ఉన్న తెలంగాణలో సహితం ఇటువంటి దాడులు జరగడం గమనార్హం.
కరోనా కట్టడికి కట్టుదిట్టంగా చర్యలు తీసుకోవడం లేదని రెండు తెలుగు రాష్ట్రాలలోని బిజెపి నేతలు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలపై విమర్శలు గుప్పిస్తున్నా కేంద్రం స్పందించడం లేదు.
కరొనపై పోరాటంలో ముందుండి, మానవ వనరులను, ఆర్ధిక వనరులను పెద్ద ఎత్తున ఖర్చు చేస్తున్న రాష్ట్రాలకు ఎటువంటి సహాయం చేయకుండా కేంద్రం పెత్తనం చేస్తూ, రాజకీయాలు చేసే ప్రయత్నాలు చేస్తున్నట్లు ఈ సందర్భంగా విమర్శలు చెలరేగుతున్నాయి.