TSRTC Merger KCR: తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్.. ముఖ్యమైన మంత్రి కేటీఆర్.. ఇద్దరూ తండ్రీ కొడుకులే.. కానీ.. కొన్ని సందర్భాల్లో తలోమాట మాట్లాడుతూ ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఏడాది క్రితం రాజ్యాంగాన్ని మార్చాలని కేసీఆర్ అంటే.. రాజ్యాంగమే మనకు శ్రీరామ రక్ష.. ఆ రాజ్యాంగంతోనే తెలంగాణ సాధించుకున్నాం.. రాజ్యాంగాన్ని మార్చేందుకు కొన్ని దుష్టశక్తులు ప్రయత్నిస్తున్నాయని స్టేట్‌మెంట్ ఇచ్చారు. తాజాగా ఆర్టీసీ విషయంలోనూ అదే జరిగింది. ప్రభుత్వంలో విలీనం అసంబంద్ధం అసంభంవం అని కేసీఆర్ అంటే.. ప్రజారవాణా పటిష్టం కోసం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనుకుంటున్నాం.. ఇందుకు కమిటీ ఏర్పాటు చేస్తున్నామని కేటీఆర్ ప్రకటించారు.
– 2019లో ముఖ్యమంత్రి ఇలా..
తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత ఆర్టీసీతోపాటు కార్పొరేషన్లను ప్రభుత్వంలో విలీనం చేస్తామని నాటి ఉద్యమనేతగా కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. దీంతో ఆర్టీసీ కార్మికులు కూడా ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో కీలకంగా వ్యవహరించారు. 2014లో తెలంగాణ వచ్చింది. ఎన్నికల్లో టీఆర్‌ఎస్ గెలిచి కేసీఆర్ ముఖ్యమంత్రి కూడా అయ్యాడు. కానీ ఉద్యమ సమయంలో ఇచ్చిన హామీని అమలు చేయలేదు. దీంతో 2018లో ఆర్టీసీ కార్మికులు సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయాలని, సమస్యలు పరిష్కరించాలని 50 రోజులకుపైగా సమ్మె చేశారు. చర్చలకు పిలిచినా కార్మికులు రాకపోవడంతో చిరెత్తుకొచ్చిన కేసీఆర్.. ప్రెస్‌మీట్ పెట్టి ఎడాపెడా వాయించారు. కార్మిక సంఘాలనే రద్దు చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనడం గొంతెమ్మ కోరికగా పేర్కొన్నారు. అది అసంబద్ధమైనదని, అసంభవమైనదని ప్రకటించారు. అర్థంలేని డిమాండ్‌గా కొట్టిపారేశారు. రాష్ట్రంలో 57 కార్పొరేషన్లు ఉన్నాయని, ఎవడు పడితే వాడు గవర్నమెంట్‌లో కలుపమంటే కలుపుతమా అన్ని ఎదురు ప్రశ్నించారు.
– 2023లో ముఖ్యమైన మంత్రి ఇలా..
ఇక తాజాగా జూలై 31న తెలంగాణ క్యాబినెట్ సమావేశం జరిగింది. సుదీర్ఘంగా 6 గంటల పాటు జరిగిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎన్నికలకు మరో నాలుగు నెలలే గడువు ఉండడంతో పోల్ పాలిటిక్స్‌లో భాగంగా కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోదముద్ర కూడా వేసింది. అనంతరం నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ముఖ్యమైన మంత్రి కేటీఆర్ మాట్లాడారు. ఆర్టీసీ గురించి ప్రస్తావిస్తూ.. ‘‘ఆర్టీసీని కాపాడేందుకు, ప్రజారవాణా వ్యవస్థను పటిష్టం చేసేందుకు సామాజిక బాధ్యతగా ప్రజారవాణాను పటిష్టం చేసి ఇంకా విస్తృతపర్చడానికి టీఎస్‌ఆర్టీసీని, ఆశాఖలో పనిచేస్తున్న ఉద్యోగులందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ.. దానికి సబంధించిన విధివిధానాలు, నిబంధనలు రూపొందించడానికి అధికారులతో కూడిన సబ్‌కమిటీని ఏర్పాటు చేస్తున్నాం’’ అని ప్రకటించారు.
– సోషల్ మీడియాలో వైరల్..
నాడు కేసీఆర్.. నేడు కేటీఆర్ ఆర్టీసీ గురించి మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నాటి గొంతెమ్మ కోరిక నేడు న్యాయమైన డిమాండ్ ఎలా అయింది.. అసంబద్ధం.. అసంభవం అన్న మాటలు.. ఇప్పుడెలా సంభవం అయ్యాయి. వీలీనం డిమాండ్ ఎలా సంబద్ధం అయింది.. తెలువి తక్కువ కోరిక.. ఇప్పుడు తెలివిగల కోరిక ఎలా అయింది.. నాడు అడిగితే ఇవ్వలేదు.. నేడు అడగకున్నా ఎందుకు చేశారు అని నెటిజన్లు ముఖ్యమంత్రి, ముఖ్యమైన మంత్రికి కామెంట్లు పెడుతున్నారు.
View this post on Instagram