తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యవసాయేతర ఆస్తుల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. వ్యవసాయేతర ఆస్తులు కలిగి ఉన్న ప్రజలకు మెరూన్ రంగు పాస్ బుక్ ఇవ్వనున్నారు. సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాలను వెల్లడించారు. దేశంలో వ్యవసాయేతర ఆస్తులకు ఈ తరహా పాస్ బుక్ లు ఇస్తున్న తొలి రాష్ట్రం తెలంగాణనే కావడం గమనార్హం. పేద, మధ్యతరగతి వర్గాల ప్రజల ఆస్తులకు పూర్తిగా రక్షణ కల్పించడానికే విప్లవాత్మక రెవెన్యూ చట్టాన్ని తెచ్చామని సీఎం కేసీఆర్ చెప్పారు.
Also Read : ఏపీలో పదో తరగతి చదివిన విద్యార్థులకు జగన్ సర్కార్ శుభవార్త..!
ప్రభుత్వం ఇచ్చే పట్టాల వల్ల ప్రజలకు దీర్ఘకాలిక ప్రయోజనాలు కలుగుతాయని పేర్కొన్నారు. నిన్న సీఎం కేసీఆర్ ధరణి వెబ్ పోర్టల్ లో వ్యవసాయేతర ఆస్తుల నమోదు, రెవెన్యూ చట్టం అమలు గురించి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ప్రజలు ఇళ్లు, ప్లాట్లు, ఫామ్ హౌజ్ లను ఒక్క పైసా కూడా చెల్లించకుండా ఆన్ లైన్ లో మ్యుటేషన్ చేయించుకోవాలని కోరారు. ఈ పాస్ పుస్తకాల జారీ ద్వారా ప్రజలకు అనేక ప్రయోజనాలు కలుగుతాయని కేసీఆర్ వెల్లడించారు.
ఆస్తులకు పక్కా హక్కులు కల్పించబడటంతో పాటు ప్రజలను భూవివాదాలు, ఘర్షణల నుంచి రక్షించవచ్చని తెలిపారు. వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ధరణి పోర్టల్ ప్రారంభమైన తరువాతే జరుగుతుందని వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లో భూముల కొనుగోళ్ల పరస్పర మార్పిడికి సంబంధించిన సాదాబైనామాలను ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయించుకునే అవకాశం కల్పిస్తున్నామని పేర్కొన్నారు.
పేద ప్రజల ఇళ్ల స్థలాలకు రక్షణ కల్పిస్తామని కేసీఆర్ అన్నారు. పేదల ఇళ్లను రెగ్యులరైజ్ చేస్తామని దీంతో వారు భవిష్యత్తులో సులభంగా బ్యాంక్ రుణాలు పొందగలరని అన్నారు. వ్యవసాయ భూముల్లో ఉన్న ఆస్తులను వ్యవసాయ కేటగిరీ నుంచి తొలగించడానికి ప్రజాప్రతినిధులు కృషి చేయాలని అన్నారు. ఆస్తులను ఇప్పుడు మ్యుటేషన్ చేయించుకోని వారు భవిష్యత్తులో ఇబ్బందులు పడాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
Also Read : టీడీపీకి షాక్ తగలనుందా..?