New Secretariat – CM KCR : “పాత సచివాలయం బాగోలేదన్నారు. వాస్తు కుదరలేదు. అందులో నుంచి పాలన సాగిస్తే అరిష్టం. అది పాలకుడికి ఇబ్బందికరం” ఇలాంటి ఆరోపణలతోనే కదా రాత్రికి రాత్రి, అంతటి కరోనా సమయంలో వేల మంది ఉత్తరాది కార్మికులను పెట్టి దాన్ని నేలమట్టం చేసింది. కనీసం మీడియా కూడా అనుమతి ఇవ్వకుండా రాత్రికి రాత్రే శిధిలాలు తరలించింది.. ఇప్పుడు ఆ స్థానంలో వందల కోట్ల ఖర్చుతో, నిజాం పాలన తాలూకు గుమ్మటాలతో తెలంగాణ కొత్త సచివాలయం కొలువుదిరింది. ఆదివారం ఉదయం ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభం కానుంది. ఇదంతా సరే కానీ.. మరి కొత్త సచివాలయం కైనా ముఖ్యమంత్రి వస్తారా? పాలన సాగిస్తారా? ఇప్పుడు అందరి మెదళ్ళను తొలుస్తున్న ప్రశ్న ఇది.
1200 కోట్లతో
తెలంగాణ కొత్త సచివాలయాన్ని 1200 కోట్లతో నిర్మించారు. వాస్తవానికి సచివాలయం అంటే ప్రభుత్వ పరిపాలనకు గుండెకాయల లాంటిది. ముఖ్యమంత్రి అంటే పరిపాలన కేంద్రానికి ఇరుసు లాంటివాడు. అందుకే పాలన కేంద్రమైన సచివాలయానికి.. పాలనకు కేంద్రమైన ముఖ్యమంత్రి రావడం, అక్కడ అందుబాటులో ఉండడం ఆనవాయితీ. గతంలో అనేకమంది ముఖ్యమంత్రులు ఇలానే చేశారు.. దూరంగా చెప్పాలంటే సచివాలయం కేంద్రంగానే రాష్ట్ర పరిపాలన సాగాలు. అక్కడే మంత్రులు, ఉన్నతాధికారులు సమస్యలతో వచ్చే ప్రజలకు అందుబాటులో ఉంటారు. వారి సమస్యకు ఒక పరిష్కారం మాత్రం చూపిస్తారు. అప్పుడే పాలనపై ప్రజలకు నమ్మకం పెరుగుతుంది. పాలనలో వేగం పెరుగుతుంది.. అదే సమయంలో ప్రజలకు ఉపయోగపడే ఏ నిర్ణయమైనా తీసుకునే అవకాశం ఉంటుంది.
ఇందుకు విరుద్ధం
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవహార శైలి పైన చెప్పిన విషయాలన్నింటికీ పూర్తి విరుద్ధం. 2014 జూన్ లో తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కేసీఆర్.. కొద్దిరోజుల పాటు మాత్రమే ఉమ్మడి రాష్ట్రంలో నిర్మించిన సచివాలయానికి వచ్చారు. 2016 నవంబర్ చివరి వారం తర్వాత సచివాలయానికి రావడం పూర్తిగా మానేశారు. ఆ భవనానికి వాస్తు దోషం ఉందంటూ కరోనా సమయంలో పూర్తిగా కూల్చేశారు. ఆ భవన నిర్మాణానికి సంబంధించిన శంకుస్థాపనకు మాత్రం 2019లో జూన్లో వెళ్లారు. ఇక పాత సచివాలయం కూల్చివేతతో పక్కనే ఉన్న బూర్గుల రామకృష్ణ భవన్ ను తాత్కాలిక సచివాలయంగా మార్చారు. ఈ సచివాలయం వైపు కూడా కేసీఆర్ ఒక్కసారి కన్నెత్తి చూడలేదు. మరోవైపు మంత్రులు కూడా కెసిఆర్ బాటనే అనుసరించారు. ఇందులో హరీష్ రావు మాత్రమే బి ఆర్ కే భవన్ వెళ్లి తన శాఖల పనితీరు పర్యవేక్షించేవారు.. కొంతమంది మంత్రులు తమకు చాంబర్లు లేవనే కారణంతో బి ఆర్ కే భవన్ వెళ్లడం మానేశారు.
ఇంతటి ఖర్చా?
దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా 1200 కోట్లతో సచివాలయం నిర్మించామని ప్రభుత్వం గొప్పలు చెప్పుకోవచ్చు. కానీ ఇంతటి ఘనమైన సచివాలయానికి ముఖ్యమంత్రి వస్తారా అనే సందేహాలు ప్రజల వ్యక్తం అవుతున్నాయి.. ముఖ్యమంత్రి రాకపోతే అది ఘనమైన భవంతి గానే మిగులుతుంది తప్ప.. దానివల్ల తమకు ఎటువంటి ప్రయోజనం ఉండదని ప్రజలు వాపోతున్నారు.. ముఖ్యమంత్రి, మంత్రులు ఒకేచోట ఉంటే అత్యవసర సమయాల్లో సమావేశమయ్యేందుకు వీలు ఉంటుంది.. మరి కొత్త సచివాలయంలో ఆ పరిస్థితి కనిపిస్తుందా అంటే ఆలోచించాల్సిన అవసరం ఏర్పడుతోంది..
ఎరవల్లి క్షేత్రంలో …
ఎక్కువకాలం సచివాలయంలో గడపని ముఖ్యమంత్రిగా కేసీఆర్ రికార్డ్ సృష్టించారు. అంతేకాదు ప్రగతి భవన్, ఎర్రవల్లి క్షేత్రంలో మాత్రమే ఆయన ఎక్కువ సమయం ఉన్నారు. ఒకానొక దశలో తన ఫామ్ హౌస్ లో మంత్రులతో కెసిఆర్ సమీక్షకు నిర్వహించారు. ఆ సమయంలో అధికారులు వివిధ రకాల ఫైల్స్ పట్టుకుని అక్కడికే వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.. ఇక మునుగోడు ఉప ఎన్నిక తర్వాత ముఖ్యమంత్రి ప్రగతి భవన్ కు మారారు. అయినప్పటికీ దానిని ప్రెస్ మీట్ లకు వాడుకుందే ఎక్కువ. మొయినాబాద్ ఫామ్ హౌస్ డీల్ కేసు లో మీడియా కు లీకులు ఇచ్చేందుకు మాత్రమే కేసీఆర్ దాన్ని వాడుకున్నారు. ఆ కేసు ఎదురు తన్నడంతో తర్వాత ఆయన ప్రగతి భవన్ లో ప్రెస్ మీట్లు నిర్వహించడం కూడా మానేశారు.