తెలంగాణలో లాక్డౌన్ నేపథ్యంలో నిన్నటి వరకు ప్రభుత్వ యంత్రాంగం ప్రజలకు దండాలుపెట్టి స్వీయనియంత్రణ పాటించాలని సూచించిందని సీఎం కేసీఆర్ తెలిపారు. అయితే కొందరు ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా తమకేమీ కాదనే అత్యుత్సాహంతో రోడ్లపైకి వస్తున్నారని వీరికి దండనలు తప్పవని ఆయన హెచ్చరించారు. తెలంగాణలో ప్రస్తుత కర్ఫ్యూ కొనసాగుతుందని దీనిని గుర్తేరిగి ప్రజలు స్వీయనియంత్రణ పాటించాలని సీఎం కేసీఆర్ విజ్ఞప్తి చేశారు.
సీఎం కేసీఆర్ కీలక నిర్ణయాలు..
స్థానిక సంస్థల ప్రతినిధులంతా తక్షణం పోలీసులతోపాటు పౌర బాధ్యతలు చేపట్టాలన్నారు. వార్డుమెంబర్లు, సర్పంచ్ లు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, మున్సిపల్ చైర్మన్లు, ఎమ్మెల్యేలు ఇలా ప్రతిఒక్కరు కరోనా నివారణకు సహకరించాలన్నారు. రైతులకు సంబంధించిన పంటలను రైతు బంధు సమితిల ద్వారా కొనుగోలు చేయడం జరుగుతుందని అన్నారు. రైతులు పంట దిగుబడులను మార్కెట్ యార్డులను తీసుకురావద్దని సూచించారు. రోడ్లపై ప్రజలు అనవసరం రావద్దని సూచించారు. ఎక్కడిక్కడ పోలీసులు చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు.
పోలీసులు మన కోసమే పని చేస్తున్నారని వారికి ప్రజలంతా సహకరించాలని కోరారు. కొన్ని గ్రామాల్లో ప్రజలు తమ గ్రామానికి ఎవరూ రాకుండా కంచెలు ఏర్పాటు చేసుకుంటున్నారని తెలిపారు. కొన్నిరోజులపాటు ఇలాంటి స్ఫూర్తిని ప్రజలంతా కనబర్చి స్వీయనియంత్రణ పాటించాలన్నారు. ఇప్పటికే అన్ని రాష్ట్రాల్లో లాక్డౌన్ చేశాయని ఇలాంటప్పుడు ఎవరూ ఎటూ పోలేరని అనవసరంగా బయటికి వచ్చి ఇబ్బందులు పడొద్దన్నారు.
నిత్యావసర సరుకులను ప్రజలు మూడు కిలోల మీటర్ల పరిధిలోని దుకాణాల్లో కొనుగోలు చేసుకోవాలని సూచించారు. రాత్రి 7గంటల తర్వాత షాపుల ఎట్టిపరిస్థితిల్లో తెరిచి ఉంచొద్దని తెలిపారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. నిత్యవాసర సరుకులను అధికంగా అమ్మితే ట్రేడ్ లైసెన్సులు కాన్సిల్ చేస్తామన్నారు. ఎట్టి పరిస్థితుల్లో తిరిగి ఇవ్వబడదని హెచ్చరించారు. అలాగే క్వారంటైన్లో ఉండే ఎన్ఆర్ఐలు ప్రభుత్వ యంత్రాంగానికి సహకరించాలని లేకుంటే వారి పాస్ పాస్ పోర్టులు సీజ్ చేస్తామన్నారు. అయినా వినకపోతే పాస్ పోర్టులను సస్పెండ్ చేసేలా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
రాష్ట్రంలో కరోనా పరిస్థితి కంట్రోల్లో ఉందన్నారు. తెలంగాణలో 36మందికి కరోనా పాజిటివ్ వచ్చిందని అందులో ఒకరికి పూర్తిగా నయమైందని తెలిపారు. ప్రస్తుతం 35మంది కరోనా పాజిటివ్ కేసులు ఉన్నాయని తెలిపారు. వీరంతా ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నారని త్వరలోనే వీరంతా కోలుకుంటారని అప్పుడు వారిని ఇళ్లకు పంపించడం జరుగుతుందని తెలిపారు. ప్రజలు ప్రభుత్వానికి సహకరించాలని దండం పెట్టి చెబుతున్నానని తెలిపారు. లేనట్లయితే మరింత కఠిన చర్యలు ఉంటాయని తెలిపారు.
అవసరమైతే షూట్ ఏ సైడ్ ఆర్డర్ కు వెనకడబోమని, ఆర్మీని కూడా దించుతామని తెలిపారు. అంతవరకు తెలంగాణ సమాజం తెచ్చుకోవద్దని విజ్ఞప్తి చేశారు. ఎవరికైనా అత్యవసర పరిస్థితుంటే డయల్ 100కు ఫోన్ చేయాలన్నారు. వారికి అవసరమైన పనులను అధికారులే సమకూరుస్తారని తెలిపారు. ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం పని చేస్తుందన్నారు. లాక్డౌన్ వంటి చర్యలు వల్ల ప్రభుత్వానికి రోజుకు కోట్లలో నష్టం వస్తుందని అయినప్పటికీ ప్రజా సంక్షేమం దృష్ట్యా కొన్ని కఠిన చర్యలు తీసుకోక తప్పదని లేదని తెలిపారు.