KCR: సెంటిమెంట్ అస్త్రాలను వదులుతున్న కేసీఆర్

సాధారణంగా ప్రత్యర్థి పై కేసీఆర్ దూకుడు స్వభావాన్ని ప్రదర్శిస్తుంటారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీపై ఆయన ఒంటి కాలు మీద లేచారు. ప్రతిపక్షాలకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా దూకుడు కొనసాగించారు..

Written By: Anabothula Bhaskar, Updated On : November 27, 2023 5:24 pm
Follow us on

KCR: పోలింగ్ కు ఇంకా రెండు రోజులు మాత్రమే సమయం ఉంది. ప్రచారానికి ఒక్కరోజు మాత్రమే గడువు ఉంది. తెలంగాణ వ్యాప్తంగా ఎన్నికల వాతావరణం తారాస్థాయికి చేరింది. భారతీయ జనతా పార్టీ నుంచి జాతీయస్థాయి నాయకులు ప్రచారంలో దూకుడు కొనసాగిస్తున్నారు. కాంగ్రెస్ కూడా అదే స్థాయిలో అడుగులు వేస్తోంది. అధికారంలో ఉన్న భారత రాష్ట్ర సమితి కూడా తామేం తక్కువ కాదు అని ప్రచారంలో జోరు చూపిస్తోంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొంటున్న ప్రజా ఆశీర్వాద సభలో మాట్లాడుతున్న ప్రసంగాలు మరొక ఎత్తు. గతంలో ఎన్నడూ లేనివిధంగా కేసీఆర్ ప్రసంగిస్తుండడం తెలంగాణ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

తెలంగాణ తెచ్చిన ఘనత చాలు

సాధారణంగా ప్రత్యర్థి పై కేసీఆర్ దూకుడు స్వభావాన్ని ప్రదర్శిస్తుంటారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీపై ఆయన ఒంటి కాలు మీద లేచారు. ప్రతిపక్షాలకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా దూకుడు కొనసాగించారు.. ఈసారి ఎన్నికల్లో మొదట్లో ఆయన అదే ధోరణి ప్రదర్శించారు. తర్వాత కాస్త మెత్తబడ్డారు.. కానీ ఇప్పుడు ఆకస్మాత్తుగా తన ప్రసంగాన్ని మార్చుకుంటున్నారు. నిన్న జరిగిన ఎన్నికల సభల్లో కెసిఆర్ తన సహజ శైలికి భిన్నంగా ప్రసంగాలు చేశారు. “నాకు 70 ఏళ్ళు.. రెండుసార్లు ముఖ్యమంత్రి అయిన. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన చరిత్ర కూడా నాకుంది.. ఈ పదవులు ఉండొచ్చు ఉండకపోవచ్చు. ఎన్నికల్లో ఓడిపోయినా లేదా గెలిచినా తెలంగాణలో నా పేరు శాశ్వతంగా ఉండిపోతుంది” అని కెసిఆర్ ప్రసంగించారు. దీంతో ఒక్కసారిగా తెలంగాణలో చర్చ మొదలైంది.

ఎందుకిలా మాట్లాడుతున్నారు

కెసిఆర్ సాధారణంగా ప్రతిపక్షానికి ఏమాత్రం అవకాశం ఇవ్వరు.. ఎన్నికల ప్రచార సభల్లో అయితే మరింత దూకుడు ప్రదర్శిస్తారు. అయితే ఈసారి ఎన్నికల ప్రచార సభల్లో మొదట్లో కొంత మినహాయిస్తే మిగతా సందర్భాల్లో ఆయన ఒక రకమైన వైరాగ్యాన్ని ప్రదర్శిస్తున్నారు. మహా అయితే ఓడిపోతాం అంతకుమించి ఏం జరుగుతుంది అని ఎదురు ప్రశ్నిస్తున్నారు.. అయితే కేసీఆర్ నుంచి ఇలాంటి మాటలు ఊహించని ఆ పార్టీ శ్రేణులు.. తెర వెనుక ఏదో జరుగుతోంది అనే సందేహంలో పడ్డారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ నాయకులు కేసీఆర్ ఓటమిని ఒప్పుకున్నారు కాబట్టే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారని అంటున్నారు. భారతీయ జనతా పార్టీ కూడా దాదాపుగా ఇలాంటి వ్యాఖ్యలే చేస్తోంది. మరోవైపు కేసీఆర్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వెనక అంతరార్థం వేరే ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అనుకూల పవనాలు వీస్తున్న నేపథ్యంలో ప్రజల్లో సెంటిమెంట్ రగిలించే ప్రయత్నాలు చేస్తున్నారని వారు అంటున్నారు. కెసిఆర్ ఎలాంటి మాటలు మాట్లాడినప్పటికీ ప్రజల నిర్ణయం అంతిమం కాబట్టి నవంబర్ 30 వ తారీఖు వారు ఎవరికి ఓట్లు వేస్తారు అనే దానిపైనే అంతిమ ఫలితం ఆధారపడి ఉంది.