తెలంగాణలో అధికారంలో ఉన్న కేసీఆర్ సర్కార్ రాష్ట్ర ప్రజలకు శుభవార్త చెప్పింది. పేదల సంక్షేమం దృష్టిలో ఉంచుకుని ఆరోగ్య శ్రీ స్కీమ్ మరింత పకడ్బందీగా అమలయ్యేలా చర్యలు చేపడుతోంది. ఇందుకోసం ఆరోగ్య శ్రీ పథకంలో కీలక మార్పులు చేయడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే రాష్ట్రంలో ఆరోగ్య శ్రీ పథకం అమలవుతున్న సంగతి విదితమే. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాలను వెల్లడించారు.
రాష్ట్రంలో ఇకపై ఆరోగ్య శ్రీ పథకం ప్రజలకు మరింత చేరువయ్యే విధంగా ఉండబోతుందని మంత్రి చెప్పారు. ప్రజలకు ఆరోగ్య శ్రీ స్కీమ్ విషయంలో ఎలాంటి సందేహాలు అవసరం లేదని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ఇప్పటికే ఆరోగ్య శ్రీ పథకంలో మార్పులకు సంబంధించి కీలక సూచనలు చేశారని వెల్లడించారు. ఒప్పందం కుదుర్చుకున్న ఆరోగ్య శ్రీ ఆస్పత్రుల యాజమాన్యాలతో, సంబంధిత అధికారులతో ఆరోగ్య శ్రీ సమస్యల గురించి చర్చిస్తామని అన్నారు.
ఆరోగ్య శ్రీ పథకానికి అర్హులైన వారందరికీ అదనంగా ఒక్క రూపాయి కూడా భారం పడకుండా చర్యలు చేపడుతున్నామని.. ఇకపై కార్పొరేట్ ఆస్పత్రికి వెళ్లిన ఒక్క రోగి కూడా బయటకు వెళ్లాల్సిన అవసరం రాదని.. ఇందుకోసం ప్రణాళికను సిద్ధం చేస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలో గతంతో పోలిస్తే కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టిందని వెల్లడించారు. కరోనా కేసులు తగ్గుతున్నా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు.
దసరా, బతుకమ్మ పండగల నేపథ్యంలో వైరస్ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వెల్లడించారు. పండగల సమయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే వైరస్ వ్యాప్తి పెరుగుతుందని అందుకు కేరళ రాష్ట్రమే సాక్ష్యమని అన్నారు. ఓనమ్ పండగ వేడుకల్లో ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొనడం వల్లే అక్కడ కేసుల సంఖ్య పెరిగిందని వెల్లడించారు. ప్రభుత్వం సూచనలను పాటించి పండుగలను జరుపుకోవాలని తెలిపారు.