https://oktelugu.com/

CM KCR On BRS: సర్కార్ వారి సొమ్ము.. కేసీఆర్ ప్రచారానికి రూ.1000 కోట్లు?

రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఐఅండ్‌పీఆర్‌ డిపార్ట్‌మెంట్‌పై రివ్యూ నిర్వహించిన కేసీఆర్‌.. ఈ మధ్య వరుసగా సమీక్షలు నిర్వహిస్తున్నారు.

Written By: , Updated On : May 11, 2023 / 04:11 PM IST
CM KCR On BRS

CM KCR On BRS

Follow us on

CM KCR On BRS: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు గడువు సమీపిస్తుంది. అక్టోబర్‌లో ఎన్నికల కోడ్‌ వచ్చే చాన్స్‌ ఉండటంతో ఆలోపే భారీగా నిధులు ఖర్చు చేయాలని భావిస్తున్నారు. అయితే ఈ ఖర్చు ప్రజా సంక్షేమం, అభివృద్ధి కోసం కాదు.. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బీఆర్‌ఎస్‌కు అనుకూలంగా ప్రభుత్వ పథకాల ప్రచారం కోసం వెచ్చించనున్నట్టుతెలుస్తోంది. తెలంగాణలోనే కాకుండా జాతీయ స్థాయిలోనూ భారీగా ప్రకటనలతో అక్కడి ప్రజలను ఆకట్టుకోవాలని భావిస్తున్నారు. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత సమాచార పౌర సంబంధాల శాఖపై రివ్యూ నిర్వహించిన కేసీఆర్‌ ఖర్చు గురించి చర్చించినట్లు తెలుస్తోంది.

బడ్జెట్‌లో కేటాయింపు..
2023–24 వార్షిక బడ్జెట్‌లో రాష్ట్ర ప్రభుత్వం సమాచార, పౌర సంబంధాల శాఖకు రూ.1000 కోట్లు కేటాయించింది. ఈ నిధులను ఎన్నికల షెడ్యూల్‌ వచ్చేలోపు ఖర్చు చేయాలని భావిస్తోంది. ఈమేరకు కసరత్తు ప్రారంభించింది. నాలుగు నెలల్లో ఎలా ఖర్చు చేయాలో ప్రణాళిక రూపొందిస్తోంది. కానీ వాటిని ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం కాకుండా.. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ప్రచారం కోసం ఖర్చు చేయబోతుంది. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీ కోసం ప్రభుత్వం తరఫున చేస్తున్న ఖర్చుగా దీనిని భావించవచ్చనే అభిప్రాయాలు వ్యక్త మవుతున్నాయి.

వరుస సమీక్షలు..

రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఐఅండ్‌పీఆర్‌ డిపార్ట్‌మెంట్‌పై రివ్యూ నిర్వహించిన కేసీఆర్‌.. ఈ మధ్య వరుసగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు ప్రజలకు అర్థమయ్యే తీరుగా ప్రచారం చేయాలని అధికారులను ఆయన ఆదేశించినట్టు సమాచారం. ఆ ప్రచారం అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీ గెలుపు కోసం ఉపయోగపడే విధంగా డిజైన్‌ చేయాలని సూచించినట్టు తెలిసింది. అందుకోసం ఏ పద్దతిని ఎంచుకోవాలి? ఐఅండ్‌పీఆర్‌ డిపార్ట్‌ మెంట్‌ ఏం చేయాలి? అనే అంశాలపై ఆయన సలహాలు ఇచ్చినట్టు అధికార వర్గాల సమాచారం.

ఎన్నికల షెడ్యూలు వచ్చేలోపే..

రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు అక్టోబరులో షెడ్యూలు వచ్చే చాన్స్‌ ఉంది. ఈలోపు ప్రభుత్వం తరుపున ప్రకటనల రూపంలో ఈ వెయ్యి కోట్లను ఖర్చు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. వాటిని ఎలా ఖర్చు చేయాలి? ఏయే రాష్ట్రాల్లో ఖర్చు చేయాలి? అనే అంశాలపై సీఎం కేసీఆర్‌ కసరత్తు చేస్తున్నారు. ఎన్నికల షెడ్యూలు వస్తే ఎన్నికల కోడ్‌ అమల్లోకి వస్తుంది. దీంతో ప్రభుత్వం నుంచి ప్రకటనలకు ఒక్క పైసా కూడా ఖర్చు చేసే చాన్స్‌ ఉండదు. అందుకే షెడ్యూల్‌ కన్నా ముందే వాటిని ఖర్చు చేయాలని కేసీఆర్‌ ప్లాన్‌ వేస్తున్నారు. తాము చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలపై హోర్డింగ్స్, బస్సులు, ఆటోలపై, సినిమా థియేటర్స్, టీవీ, పేపర్లో ప్రకటనలు ఇచ్చేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నారు.

సోషల్‌ మీడియాలో ప్రకటనలు..
సోషల్‌ మీడియా కోసం ప్రత్యేకంగా రకరకాల ప్రకటనలు రూపొందించేందుకు సిద్ధమవుతున్నారు. 2018 నుంచి ఇప్పటివరకు ఐఅండ్‌పీఆర్‌ శాఖకు పూర్తి స్థాయి కమిషనర్‌ లేరు. ఇన్చార్జీలు మాత్రమే పనిచేశారు. కానీ ఈ మధ్యే ఐఏఎస్‌ను నియమించారు.

జాతీయస్థాయిలోనూ భారీ ప్రకటనలు..
జాతీయ రాజకీయాల్లో బీఆర్‌ఎస్‌ కీలకంగా మారుతున్నదని భావిస్తున్న కేసీఆర్‌.. తెలంగాణ పథకాలను దేశ వ్యాప్తంగా ప్రచారం చేసేందుకురెడీ అవుతున్నారు. ముఖ్యంగా మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీ రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని భావిస్తున్నారు. ఢిల్లీ కేంద్రంగానూ పబ్లిసిటీకి ప్లాన్‌ చేస్తున్నారు. అక్కడ ఏ విధంగా ప్రచారం చేయాలి? అందుకోసం ఏయే సంస్థల సహకారం తీసుకో వాలి? అక్కడ సోషల్‌ మీడియా ప్రచారం కోసం ఏ ఎజెన్సీలను ఆశ్రయించాలి? అనే అంశాలపై కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తుంది.