తెలంగాణ సీఎం కేసీఆర్ మరో భారీ పథకానికి శ్రీకారం చుట్టారు. తెలంగాణలోని దళితులపై ఫోకస్ పెట్టారు. ‘దళిత బంధు’ను ప్రవేశపెట్టారు. ఈ పథకానికి విపరీతమైన ప్రచారం కల్పించారు. అయితే క్షేత్ర స్థాయిలో మాత్రం భిన్నమైన వాదన వినిపిస్తోంది.
ఈ పథకం కింద అంత పెద్ద నియోజకవర్గానికి 100 కుటుంబాలకే లబ్ధి అని చెప్పడంతో మెజార్టీ దళితుల్లో అసంతృప్తి జ్వాల ఎగిసిపడుతోంది. అదే ఆయన పథకానికి మైనస్ గా మారింది.
ఈ క్రమంలోనే కేసీఆర్ వెంటనే వ్యూహం మార్చారు. ప్రతి దళిత కుటుంబానికి ఇస్తామని మాట మార్చేశారు. ముందుగా హుజూరాబాద్ నుంచే ప్రారంభించబోతున్నట్లుగా ప్రకటించారు. హుజూరాబాద్ లో పేదరికం అనుభవిస్తున్న ప్రతి దళిత కుటుంబానికి రూ.10 లక్షలు ఇస్తామని ప్రకటించారు. అందుకోసం అర్హుల ఎంపిక ప్రారంభించబోతున్నారు. అయితే ఇది హుజూరాబాద్ ఎన్నికల పథకం అని.. హుజూరాబాద్ వారికే లబ్ధి చేకూరుస్తారా? అన్న విమర్శలు వినిపించాయి.
దీంతో కేసీఆర్ రాష్ట్రమంతటా దీన్ని విస్తరించి లక్ష కోట్లు దళిత బంధు కోసం కేటాయిస్తున్నట్టు భారీ ప్రకటన చేశారు. తెలంగాణలో ఉన్న దళిత కుటుంబాలన్నింటికి రూ.10 లక్షల నగదు బదిలీ చేయాలంటే కనీసం రూ.లక్షన్నర కోట్లు కావాలని తేల్చేశారు. ఈ క్రమంలోనే లక్ష కోట్లు కేటాయిస్తున్నట్టు కేసీఆర్ ప్రకటించారు.
అయితే ఇప్పటికే దళితులకు మూడు ఎకరాల భూమి పథకాన్ని కేసీఆర్ ప్రకటించి మరీ అమలు చేయలేదు. ఇక నిరుద్యోగ భృతిని గత ఎన్నికల వేళ ప్రకటించి అమలు చేయలేదు. రైతు రుణమాఫీ వంటి పథకాలను అమలు చేయలేకపోయారు. వాటిపైన ప్రజల్లో అసంతృప్తి నెలకొంది. ఇప్పుడు లక్ష కోట్ల దళిత బందును అయినా అమలు చేస్తారా? కేవలం హుజూరాబాద్ లో అమలు చేసి మమ అనిపిస్తారా? అన్న సందేహాలు అందరిలోనూ నెలకొన్నాయి.