బాబు స‌వాల్ కు.. జ‌గ‌న్ సై అంటే..?

రాజ‌కీయ వేరు.. వ్య‌క్తిగ‌తం వేరు అంటుంటారు చాలా మంది నేత‌లు. అయితే.. ఏపీ సీఎం జ‌గ‌న్‌, విప‌క్ష నేత చంద్ర‌బాబు విష‌యంలో మాత్రం ఇవి రెండూ క‌లిసిపోయాయి. రాజ‌కీయ వైరం వీరి వ్య‌క్తిగ‌త జీవితంలోకి కూడా వ‌చ్చేసింది. తాను 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ.. జ‌గ‌న్ ఓ పిల్లాడు అన్న‌ది బాబు ఫీలింగ్‌. ఇప్పుడు త‌రం మారింది, బాబు పాత‌కాలం మ‌నిషి అన్న‌ది జ‌గ‌న్ భావ‌న‌. ఈ విష‌యంలో ప్ర‌త్య‌క్షంగానో, ప‌రోక్షంగానో కౌంట‌ర్లు, ఎన్ కౌంట‌ర్లు కూడా జ‌రిగాయి. […]

Written By: Bhaskar, Updated On : July 25, 2021 9:18 am
Follow us on

రాజ‌కీయ వేరు.. వ్య‌క్తిగ‌తం వేరు అంటుంటారు చాలా మంది నేత‌లు. అయితే.. ఏపీ సీఎం జ‌గ‌న్‌, విప‌క్ష నేత చంద్ర‌బాబు విష‌యంలో మాత్రం ఇవి రెండూ క‌లిసిపోయాయి. రాజ‌కీయ వైరం వీరి వ్య‌క్తిగ‌త జీవితంలోకి కూడా వ‌చ్చేసింది. తాను 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ.. జ‌గ‌న్ ఓ పిల్లాడు అన్న‌ది బాబు ఫీలింగ్‌. ఇప్పుడు త‌రం మారింది, బాబు పాత‌కాలం మ‌నిషి అన్న‌ది జ‌గ‌న్ భావ‌న‌. ఈ విష‌యంలో ప్ర‌త్య‌క్షంగానో, ప‌రోక్షంగానో కౌంట‌ర్లు, ఎన్ కౌంట‌ర్లు కూడా జ‌రిగాయి. దీంతో.. వీరి మ‌ధ్య వైరం ముదురుతూ వ‌చ్చింది.అంతేకాకుండా.. నువ్వా? నేనా? అన్నట్టుగా.. ఏపీలో ఈ రెండు పార్టీలు మాత్రం బ‌లంగా ఉండడంతో.. వీరి గొడ అనివార్యం అయ్యింది. అయితే.. ఇలాంటి ప‌రిస్థితుల్లో చంద్ర‌బాబు ఆస‌క్తిక‌ర ప్ర‌తిపాద‌న చేశారు. తాను జ‌గ‌న్ వెన‌క ఉంటాన‌ని స్ప‌ష్టం చేశారు.

విభ‌జ‌న త‌ర్వాత రాష్ట్రానికి ఎన్ని ఇబ్బందులు వ‌చ్చాయో తెలిసిందే. లోటు బ‌డ్జెట్ మొద‌లు.. రాజ‌ధాని ఏర్పాటు దాకా ఎన్నో స‌మ‌స్య‌లు వ‌చ్చి ప‌డ్డాయి. ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు న్యాయంగా చేయాల్సిన ప‌నుల‌ జాబితాను రూపొందిస్తూ ఏకంగా.. పార్ల‌మెంటులోనే చ‌ట్టం చేశారు. ఈ చ‌ట్టానికి కూడా దిక్కులేకుండా పోయింది. ప్ర‌త్యేక హోదా మొద‌లు.. ఎన్నో అంశాలు అందులో ఉన్నాయి. రాష్ట్రం విడిపోయి ఎనిమిదేళ్లు దాటినా.. వాటి అమ‌లు ఊసేలేదు. చ‌ట్ట ప్ర‌కారం హ‌క్కుగా రావాల్సిన వీటిని అడిగేందుకు కూడా రాష్ట్రంలోని పార్టీలు భ‌య‌ప‌డుతున్నాయ‌నే చ‌ర్చ ఎంతో కాలంగా ప్ర‌జ‌ల్లో సాగుతోంది. భ‌విష్య‌త్ రాజ‌కీయాల‌ను దృష్టిలో పెట్టుకొని ఇటు వైసీపీ, అటు టీడీపీ రాష్ట్ర ప్ర‌యోజనాల‌ను గాలికి వ‌దిలేస్తున్నాయ‌నే అభిప్రాయం ప్ర‌జ‌ల్లో బ‌ల‌ప‌డుతోంది.

అయితే.. న్యాయంగా ఇవ్వాల్సిన వాటిని ఇవ్వ‌క‌పోగా.. ఉన్న‌వాటిని అమ్మేసే కార్య‌క్ర‌మం మొద‌లు పెట్టింది కేంద్రం. విశాఖ స్టీల్ ను ప్రైవేటు వాళ్ల‌కు అమ్మేయ‌డానికి సిద్ధ‌ప‌డిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌త్య‌క్షంగా ప‌రోక్షంగా ల‌క్ష కుటుంబాలు ఆధార‌ప‌డిన ఈ ఫ్యాక్ట‌రీని అమ్మేస్తున్నా.. వైసీపీ, టీడీపీ స‌రిగా స్పందించ‌ట్లేదు. దీనిపై రాష్ట్ర ప్ర‌జ‌లు మండిప‌డుతున్నారు. అయితే.. ఇలాంటి ప‌రిస్థితుల్లో ఉన్న‌ట్టుండి చంద్ర‌బాబు జ‌గ‌న్ కు ఓ ప్ర‌తిపాద‌న చేశారు. విశాఖ స్టీల్ ప్రైవేటీక‌ర‌ణ‌ను ఆపాల్సింది జ‌గ‌నే అని అన్నారు. అంతేకాదు.. ఈ విష‌యంలో ఆయ‌న‌తో క‌లిసి పోరాటం చేయ‌డానికి తాను సిద్దంగా ఉన్నాన‌ని కూడా ప్ర‌క‌టించారు.

ముఖ్య‌మంత్రిగా ముందు న‌డిస్తే.. వెంట వ‌చ్చేందుకు తాను సిద్ధంగా ఉన్నాన‌ని ప‌రోక్షంగా చెప్పారు బాబు. అయితే.. ఇది రాజ‌కీయంగా వ్యూహం అన్న‌ది అంద‌రికీ అర్థ‌మ‌వుతూనే ఉంది. జ‌గ‌న్ కేంద్రంతో స‌ఖ్య‌త‌గా మెలుగుతున్న సంగ‌తి తెలిసిందే. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి బీజేపీని త‌న‌వైపు తిప్పుకోవాల‌ని చంద్ర‌బాబు భావిస్తున్నార‌నే టాక్ ఉంది. ఈ కార‌ణంగానే.. ఏ విష‌యంలోనూ కేంద్రాన్ని ప‌ల్లెత్తు మాట అన‌ట్లేదు. ఇప్పుడు విశాఖ స్టీల్ విష‌యంలో జ‌గ‌న్ ను ఇరుకున పెట్ట‌డం ద్వారా.. ఏదో ఒక బోనులో ప‌డ‌తాడ‌ని భావిస్తున్న‌ట్టున్నారు.

అటు కేంద్రాన్ని నిల‌దీస్తే.. దోస్తీ చెడిపోతుంద‌ని, మౌనంగా ఉంటే.. రాష్ట్ర ప్ర‌జ‌ల దృష్టిలో విల‌న్ గా మిగిలిపోతాడ‌ని బాబు స్కెచ్ వేసిన‌ట్టు చెబుతున్నారు. అయితే.. దీన్ని జ‌గ‌న్ త‌న‌కు అనుకూలంగా మ‌లుచుకుంటే బాబు ప‌రిస్థితి ఏంట‌నే ప్ర‌శ్న కూడా ఉంది. ముఖ్య‌మంత్రిగా అఖిల ప‌క్షం వేసి, ముందు న‌డిచి అంద‌రినీ తీసుకెళ్తారు. అప్పుడు కేంద్రం చెప్పాల్సింది చెబుతుంది. పార్ల‌మెంటు సాక్షిగానే ప్రైవేటు ప‌రం చేస్తున్నామ‌ని ప్ర‌క‌టించిన కేంద్రానికి.. నాలుగు పార్టీల నాయ‌కుల ముందు చెప్ప‌డం పెద్ద క‌ష్టం అవుతుందా? మ‌రి, ఈ కోణాన్ని జ‌గ‌న్ వాడితే.. బాబు ప‌రిస్థితి ఏంట‌న్న‌ది చ‌ర్చ‌.