https://oktelugu.com/

CM KCR: భూములమ్మి దండుకోవడమే తప్ప.. కెసిఆర్ చేసింది ఏముంది?

గతంలో భూములు అమ్మినప్పుడు, వాటి ద్వారా వచ్చిన సొమ్ముతో మౌలిక వసతుల కల్పనకు హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ ఖర్చు చేసేది. కానీ ప్రస్తుత భారత రాష్ట్ర సమితి ఏలుబడిలో హెచ్ఎండిఏ సర్కారు ఖజానాకు జమ చేస్తోంది.

Written By: , Updated On : September 23, 2023 / 11:39 AM IST
CM KCR

CM KCR

Follow us on

CM KCR: ఔటర్‌ ధారాదత్తం ద్వారా రూ.7,380 కోట్లు వచ్చాయి. భూముల విక్రయంతో రూ.12 వేల కోట్లు లభించాయి. ఆ నిధులన్నీ సర్కారు ఎన్నికల పథకాలకు ఖర్చయ్యాయి. నిజానికి.. ఫ్లై ఓవర్లు, రోడ్లు, స్కై వాక్‌ వంటి మౌలిక వసతులకు వెచ్చించాల్సిన నిధులవి
కానీ, సంస్థను కమీషన్‌ ఏజెన్సీగా మార్చిన సర్కారు.. హెచ్‌ఎండీఏ నిబంధనలకు విరుద్ధంగా నిధుల ఖర్చు చేసింది. గతంలో భారీ ప్రాజెక్టులతో ఇమేజ్‌ పెంచిన సంస్థ..ఇప్పుడు కెసిఆర్ ప్రభుత్వానికి ఎన్నికల అవసరాలు తీర్చే వస్తువుగా మారిపోయింది. ప్రభుత్వం కూడా పట్టించుకోకపోగా.. పదేళ్లుగా బడ్జెట్‌ కేటాయింపులే చేస్తోంది పైసా కూడా విడుదల చేయడం లేదు.

‘ఒక్కటే దెబ్బకు రూ.20 వేల కోట్ల రుణ మాఫీ చేశాం’ అని సీఎం కేసీఆర్‌ ఇటీవల చాలా ఘనంగా చెప్పారు. కానీ, ఆ డబ్బులు ఔటర్‌ రింగ్‌ రోడ్డును మూడు దశాబ్దాలపాటు ప్రైవేటుకు ధారాదత్తం చేసేస్తే వచ్చిన సొమ్మును; హైదరాబాద్‌లో విలువైన స్థలాలను అమ్మేయగా వచ్చిన సొమ్మును కలిపి దాదాపు రూ.20 వేల కోట్లను హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (హెచ్‌ఎండీఏ) సర్కారు ఖజానాకు జమ చేసింది! అలా హెచ్‌ఎండీఏ సొమ్మును సర్కారు తన ‘ఎన్నికల పథకాల’కు వాడుకుంది. హైదరాబాద్‌ మహానగర అభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) అంటే సర్కారుకు ఏటీఎం అయిపోయింది. దాని సొమ్ములను సర్కారు ఎడాపెడా వాడుకుంటున్నది. సర్కారు ఖజానాను నింపడానికే హెచ్‌ఎండీఏను ఏర్పాటు చేసినట్టు కనిపిస్తోంది. తన ఆస్తులను, ప్రభుత్వ భూములను తెగనమ్మి.. వచ్చిన డబ్బును సర్కారు ఖజానాకు జమ చేయడమే హెచ్‌ఎండీఏ లక్ష్యంగా పెట్టుకుంది. కానీ హెచ్‌ఎండీఏ చట్టం మాత్రం ఇందుకు విరుద్ధంగా చట్టం-2008లోని సెక్షన్‌ 40 ప్రకారం హెచ్‌ఎండీఏ సొమ్ములను దాని పరిధిలో మౌలిక సదుపాయాలు కల్పించడానికే వినియోగించాలి. తప్పితే, రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పథకాలకు వినియోగించడానికి వీల్లేదు. కానీ, తెలంగాణ ఏర్పడిన తర్వాత హెచ్‌ఎండీఏ పరిధిలో పెద్దగా మౌలిక సదుపాయాలు కల్పించిన దాఖలాలు లేవు. కానీ దాని సొమ్మును సర్కారు అడ్డగోలుగా వాడేస్తున్నది. అధికారం దక్కించుకునేందుకు, ఎన్నికల పథకాలకు ఉపయోగిస్తోంది. వాస్తవానికి ఔటర్ రింగ్ రోడ్డు ద్వారా హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీకి సంక్రమించిన 7,380 కోట్ల నిధులను ప్రభుత్వ ఖజానాకు బదిలీ చేయాలని ప్రభుత్వం జీవో నెంబర్ 63 జారీ చేసింది. హెచ్ఎండిఏ చట్టంలోని సెక్షన్ 40 కి ఇది పూర్తి విరుద్ధం. హెచ్ఎండిఏ తన ఒప్పందాల ద్వారా సంపాదించిన నిధులను దాని పరిధిలోని అభివృద్ధి పనులకు మాత్రమే వినియోగించాలని చట్టంలో ఉంది. “ఉదయం లేస్తే భారతీయ జనతా పార్టీ నాయకులను, చాయ్ అమ్ముకో దేశాన్ని మోసం చేయకు” అని నీతి వాక్యాలు వల్లించే భారత రాష్ట్ర సమితి నేతలు చట్టానికి వక్ర భాష్యం చెప్పడం ఇక్కడ విశేషం.

గతంలో హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఉండేది. 2008లో దానిని హైదరాబాద్ మెట్రో పాలిటన్ డెవలప్మెంట్ అథారిటీగా మార్చారు. పేరులో మార్పులు చేసినప్పటికీ ఇందులో ఉన్న ప్రధాన లక్ష్యం ఒకటే హైదరాబాద్ శివారు ప్రాంతాలను అభివృద్ధి చేయడం. అంతేకాకుండా దాని పరిధిలో ఉన్న సంస్థలను పర్యవేక్షించడం.. గతంలో కూడా హుడా భూములను విక్రయించింది. భూములను విక్రయించగా వచ్చిన సొమ్ముతో హైదరాబాద్ మహానగరంలో 8 కీలక ఫ్లై ఓవర్లు నిర్మించింది. అంతేకాదు ఔటర్ రింగ్ రోడ్డు, పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ వే లాంటి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసింది. శంషాబాద్ విమానాశ్రయానికి ప్రణాళిక కూడా ఇచ్చింది. హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ పటంలో ఉండే విధంగా చర్యలు తీసుకుంది. కానీ స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అధారిటీ అభివృద్ధి ఆగిపోయింది. దీనికి ఒక పైసా నిధులు విడుదల చేయని ప్రభుత్వం.. దీని పరిధిలో ఉన్న భూములను మాత్రం రేపటి పరిస్థితి ఏంటి అనే ఆలోచన లేకుండా అడ్డగోలుగా అమ్మేస్తోంది.

గతంలో భూములు అమ్మినప్పుడు, వాటి ద్వారా వచ్చిన సొమ్ముతో మౌలిక వసతుల కల్పనకు హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ ఖర్చు చేసేది. కానీ ప్రస్తుత భారత రాష్ట్ర సమితి ఏలుబడిలో హెచ్ఎండిఏ సర్కారు ఖజానాకు జమ చేస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రభుత్వానికి రియల్ ఎస్టేట్ ఏజెన్సీగా హెచ్ఎండిఏ మారిపోయింది. కోకాపేట, తొర్రుర్, బహదూర్ పల్లి, తుర్గ యాంజాల్, బుద్వేల్, బాచుపల్లి, మేడిపల్లి, మోకిల్ల ల్లో లేఅవుట్లు వేసి ప్లాట్లను భారీ ఎత్తున విక్రయించింది. గతానికంటే భిన్నంగా వచ్చిన ఆ సొమ్ములను సర్కారు ఖజానాకు జమ చేసింది. పోచారంలో ఉమ్మడి రాష్ట్రంలో నిర్మించిన రాజీవ్ స్వగృహ అపార్ట్మెంట్ల లాట్లతో సహా జిల్లాలో ఉన్న ఇళ్ళు, ఓపెన్ ప్లాట్లను సైతం హెచ్ఎండీఏ విక్రయించి దాదాపు 12 వేల కోట్లకు పైగా సొమ్మును ప్రభుత్వ ఖజానాకు జమ చేసింది.

స్వరాష్ట్రం ఏర్పాటైనప్పటి నుంచి హెచ్ఎండిఏ కు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో వివిధ ప్రాజెక్టుల నిమిత్తం నిధులను కేటాయించిన దాఖలాలు లేవు. ఔటర్ రింగ్ రోడ్డు యాన్యుటి చెల్లింపుల కోసం ప్రతిపాదనలు చేసినప్పటికీ.. అరకొరగానే నిధులు కేటాయించింది. కానీ ఇంతవరకు ఒక రూపాయి కూడా మంజూరు చేయలేదు. ఔటర్ రింగ్ రోడ్డు నిర్మించిన కాంట్రాక్టర్లకు యాన్యుటి చెల్లింపుల కింద 338.52 కోట్లను హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ చేయాల్సి ఉండగా.. హెచ్ఎండిఏ చెల్లిస్తోంది. ఇక ఔటర్ రుణాల చెల్లింపు కోసం ఆశించిన మేర నిధులను రాష్ట్ర బడ్జెట్లో కేటాయించడం లేదు. 2020_21 లో 20 లక్షలు ఇస్తే.. ఇంతకుముందు పది లక్షల ఇచ్చారు. 2021_22 ఆర్థిక సంవత్సర బడ్జెట్లో 472.10 కోట్లను కేటాయించారు. కానీ ఒక్క పైసా కూడా విడుదల చేయలేదు. 2022_23 లో 200 కోట్లను కేటాయించినప్పటికీ ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు. హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో ఇప్పటివరకు చేపట్టిన పార్కుల అభివృద్ధి, బాలా నగర్ ఫ్లై ఓవర్ నిర్మాణం, ఉప్పల్ స్కైవాక్ ప్రాజెక్టులు స్వయంగా సమకూర్చుకున్న నిధులతో నిర్మించింది. మెట్రో రైలును రాయదుర్గం నుంచి ఎయిర్ పోర్ట్ వరకు విస్తరించే ప్రాజెక్టుకు అవసరమయ్యే 625 కోట్ల నిధులను కూడా హెచ్ఎండిఏ సమకూర్చుకుంది. హెచ్ఎండిఏ అభివృద్ధికి ప్రభుత్వం నిధులు ఇవ్వకపోగా.. దానిని తన ఎన్నికల పథకాలకు ఉపయోగించుకునే ఏజెన్సీగా మార్చేసింది.