CM KCR Maize Purchase Centers: వరి వేస్తే తెగుళ్లు ముప్పేట దాడి చేస్తున్నాయి. పత్తి సాగు చేస్తే గులాబీ పురుగు నాశనం చేస్తోంది. మిరపను వేస్తే అప్పులే మిగులుతున్నాయి. వేరుశనగ గిట్టుబాటు కావడం లేదు. పెసలు అక్కరకు రావడం లేదు. ఇలా ఏ పంట చూసినా నష్టమే, సాగు కష్టమే. ఈ క్రమంలోనే రాష్ట్రంలో రైతులు మొక్కజొన్న వైపు దృష్టి సారించారు. గత కొన్ని సంవత్సరాలుగా యాసంగి సీజన్లో రికార్డు స్థాయిలో మొక్కజొన్న సాగు చేస్తున్నారు. అయితే రాష్ట్రంలో పౌల్ట్రీ ఫారాలు, గేదెల పెంపకం పెరిగిన నేపథ్యంలో దాణా అవసరం ఎక్కువగా పడుతోంది. ఇందులో భాగంగానే మొక్కజొన్నకు గిరాకీ ఏర్పడుతోంది. అయితే ఇలాంటి క్రమంలో రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం వెనుకంజ వేసింది. అంతేకాదు గత మూడు సంవత్సరాలుగా మొక్కజొన్న సాగును నియంత్రిస్తూ వచ్చింది. దీంతో రైతులు ప్రైవేట్ వ్యాపారులకు అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. అయితే అప్పట్లో మార్కెట్లో మంచి రేటు ఉండటంతో రైతులకు గిట్టుబాటు అయింది. అయితే ఈ ఏడాది కూడా రైతులు రికార్డ్ స్థాయిలోనే మొక్కజొన్న సాగు చేశారు. కొన్నిచోట్ల పంటకాలం పూర్తయింది. మరి కొన్నిచోట్ల పంట కోత దశలో ఉంది. ప్రస్తుతం కురుస్తున్న అకాల వర్షాలు రైతులను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయి. అయితే ఇలాంటి సమయంలో అండగా ఉండాల్సిన ప్రభుత్వం చేతులెత్తేసింది. జరగాల్సిన నష్టం జరిగిపోయిన తర్వాత ఇప్పుడు తీరిగ్గా మేల్కొంది.
ఇప్పుడా ఏర్పాటు చేసేది
రాష్ట్రంలో దాదాపు సగానికంటే ఎక్కువ పంట ప్రైవేట్ వ్యాపారుల చేతుల్లోకి వెళ్లిపోయింది. ప్రభుత్వం ఎలాగో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని రైతులు ప్రైవేట్ వ్యాపారులకు తాము పండించిన మక్కలు అమ్ముకున్నారు. రైతుల వీక్ నెస్ ను క్యాష్ చేసుకున్న వ్యాపారులు తక్కువ ధరకు మక్కలు కొనుగోలు చేశారు. అయితే ప్రస్తుతం ఆయా ప్రాంతాల్లో భారత రాష్ట్ర సమితి నిధులు ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో రైతుల నుంచి ప్రతిఘటన ఎదురవుతోంది. అయితే ఇదే విషయాన్ని ఇటీవల నిర్వహించిన సమావేశంలో కేసీఆర్ దృష్టికి కొంతమంది ఎమ్మెల్యేలు తీసుకెళ్లారు. ఈ క్రమంలో నష్టం జరుగుతోంది అని భావించిన కేసీఆర్ మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలకు పచ్చ జెండా ఊపారు. మార్క్ ఫెడ్ ఆధ్వర్యంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు నిర్వహిస్తామని ఆదేశించారు. రాష్ట్రంలో మరికొద్ది నెలల్లో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది.
ప్రస్తుతం 1700
వాస్తవానికి సీజన్ ప్రారంభంలో మొక్కజొన్న కింటా ధర 2,400 పలికింది. అయితే ప్రస్తుతం అది 1700కు పడిపోయింది. మద్దతు ధర 1962 రూపాయలు ఉండగా, అంతకంటే ధర 300 తగ్గిపోయింది. అయితే కేసీఆర్ నిర్ణయం మేరకు మార్క్ఫెడ్ రాష్ట్ర వ్యాప్తంగా 400 కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. మక్కల సేకరణకు 1800 కోట్లు అవసరమవుతాయని మార్క్ ఫెడ్ ప్రభుత్వానికి అంచనాలు పంపింది. ఈ సీజన్లో రాష్ట్రవ్యాప్తంగా 6.48 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగయింది. 17.38 లక్షల టన్నుల మొక్కజొన్నలు ఉత్పత్తి అవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఇందులో సగానికి మించిన పంటను ప్రైవేట్ వ్యాపారులు కొనుగోలు చేశారు. అయితే మిగతా పంటను ప్రభుత్వం సేకరించాల్సిన నేపథ్యంలో 1800 కోట్లు అంచనా అవుతాయని మార్క్ఫెడ్ అధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపారు..
బడ్జెట్లో గుండు సున్నా
రైతుల సంక్షేమం కోసం ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నామని చెబుతున్న ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్లో పంట ఉత్పత్తుల కొనుగోలు కోసం నిధులు కేటాయించలేదు. మార్కెట్ స్థిరీకరణ నిధి కూడా ఏర్పాటు చేయలేదు. సర్కారు నిర్వాకం వల్ల మార్క్ ఫెడ్ బ్యాంకుల నుంచి రుణం తీసుకొని మొక్కజొన్నల కొనుగోలు చేపట్టనుంది. రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు బ్యాంకు గ్యారంటీ మాత్రమే ఇస్తుంది.
మక్కలతోనూ రాజకీయం
అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ అనే నిదానంతో దేశ రాజకీయాలకు ప్రవేశించిన ముఖ్యమంత్రి కేసీఆర్.. నిర్వహించిన మూడు సభల్లోనూ రైతుల సమస్యలు లేవనెత్తారు. తెలంగాణ మోడల్ గా దేశవ్యాప్తంగా పథకాలు అమలు చేస్తామని ప్రకటిస్తున్నారు. కానీ తెలంగాణలోనే రైతులు పలు సమస్యలు ఎదుర్కొంటున్నారు. మూడు సంవత్సరాలుగా ఒక్క పంట బీమా పథకం కూడా రాష్ట్రంలో అమలు కావడం లేదు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని కొండెక్కించారు. అంతేకాదు ప్రకృతి విపత్తుల వల్ల ప్రతి సంవత్సరం లక్షల ఎకరాల్లో పంటలు నాశనం అవుతున్నాయి. రుణమాఫీ పథకం పూర్తిస్థాయిలో అమలు కావడం లేదు. విత్తనాలు, యంత్రాల రాయితీని ప్రభుత్వం ఎత్తేసింది. దీంతో రైతుల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతుంది.. అయితే దీని నివారణ కోసం కెసిఆర్ మొక్క జొన్నల కొనుగోలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే ప్రచారం జరుగుతోంది.