Twin Towers Telangana: ఇప్పటికే 111 జీవో ఎత్తివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఫలితంగా గ్రీన్ జోన్ లో కార్పొరేట్ గద్దలు పారిపోయేందుకు అవకాశం ఏర్పడింది. వాస్తవానికి ఈ ప్రాంతంలో గండిపేట, హిమాయత్ సాగర్ జలాశయాలు ఉన్నాయి. ఇది హైదరాబాద్ మహానగరానికి తాగునీటిని అందిస్తాయి. ఈ జలాశయాలకు, ఇక్కడి పర్యావరణానికి ముప్పు వాటిల్లకూడదు అనే ఉద్దేశంతో అప్పటి ప్రభుత్వం 111 జీవో పేరుతో రక్షణ చత్రాన్ని ఏర్పాటు చేసింది. అయితే అసలే ఆర్థిక కష్టాల్లో సతమతమవుతున్న కేసీఆర్ ప్రభుత్వం ఒక్క కలం పోటు తో ఈ జీవో ను ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది. ఫలితంగా గ్రీన్ జోన్ కాంక్రీట్ జంగిల్ అయ్యేందుకు ఆస్కారం ఏర్పడింది.. దీన్ని మర్చిపోకముందే కేసీఆర్ ప్రభుత్వం మరో “భూ” పందేరానికి తెరలేపింది.
హెచ్వోడీ కార్యాలయాలు అందుకేనా?
కెసిఆర్ ప్రభుత్వం భూ దాహానికి ప్రభుత్వ విభాగాధిపతుల కార్యాలయాలు బలయ్యే సంకేతాలు కనిపిస్తున్నాయి. హెచ్వోడీలకు ట్విన్ టవర్స్ నిర్మిస్తామని ప్రభుత్వం చెబుతోంది. అయితే అన్ని శాఖలను ఒకచోటకు చేర్చి.. ఆ శాఖలకు సంబంధించి ఇన్నాళ్ళుగా ఉన్న భూములను ప్రభుత్వం సేకరించబోతోంది.. అనంతరం వాటిని గంపగుత్తగా అమ్మేయబోతోందని తెలుస్తోంది.. రెండు రోజుల క్రితం ముఖ్యమంత్రి కేసీఆర్ సచివాలయ సమీపంలో అన్ని శాఖల హెచ్ ఓ డి లకు ట్విన్ టవర్స్ నిర్మిస్తామని ప్రకటించారు. ఉన్నతాధికారులను స్థలాలు అందించాలని ఆదేశించారు..
లోగుట్టు వేరే..
ఈ టవర్స్ నిర్మాణం వెనుక అసలు ఉద్దేశం వేరే ఉన్నది ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈ టవర్స్ పేరుతో అన్ని శాఖల అధిపతులను ఒక చోటకు చేర్చి.. అనంతరం వారి కార్యాలయాలు ఉన్న భూములను ప్రభుత్వం తన ఆధీనులకు తీసుకుబోతుందని సమాచారం. హెచ్ వో డీ లు మొత్తం తక్షణమే ఆయా కార్యాలయాల భూముల వివరాలు పంపాలని ఆదేశాలు కూడా వెళ్లినట్టు తెలుస్తోంది. సచివాలయ ఉన్నతాధికారుల ఆదేశం మేరకు ముఖ్య కార్యదర్శిలు తమ శాఖల పరిధిలోని విభాగాధిపతుల కార్యాలయాల భూ విస్తీర్ణ వివరాలను సేకరించినట్టు సమాచారం. ఇప్పటికే హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ స్థలాలు, రాజీవ్ స్వగృహ ఇళ్ళు, చివరికి అసైన్డ్ భూములను కూడా అమ్మేస్తున్న ప్రభుత్వం.. తాజాగా ఆ జాబితాలోకి హెచ్ వో డీ భూములను కూడా చేర్చింది.
కోట్ల విలువైన భూమి
హైదరాబాద్ ప్రాంతంలోని పలు ప్రభుత్వ భూములను వేలం వేస్తూ సర్కారు ఆదాయం గడిస్తోంది. హైదరాబాద్ పరిసర జిల్లాల్లోనే కాకుండా ఇతర జిల్లాల్లోని ప్రభుత్వ భూములను అమ్మేస్తోంది. చివరికి నగరంలోని అత్యంత విలువైన ప్రభుత్వ భూములపై కూడా కన్నేసింది. అయితే వాటిని ఇప్పటికిప్పుడు లాగేసుకుంటే ఆందోళనలు, ఉద్యమాలు తలెత్తుతాయి. అందుకే వాటిని తన ఆధీనంలో తెచ్చుకునేందుకు ప్రభుత్వం ట్విన్ టవర్స్ పేరుతో సరికొత్త ప్రణాళికతో ముందుకొచ్చింది. వాటి పేరుతో నిర్మాణం చేపట్టి, విభాగాధిపతులను అక్కడికి పంపి, అయా శాఖలకు సంబంధించిన భూములను మొత్తం లాగేసుకోవాలనేది ప్రభుత్వ ప్రణాళిక అని అధికార వర్గాలు చెబుతున్నాయి. వాటిని బహిరంగ మార్కెట్లో అమ్మేయడం ద్వారా ఆదాయం పెంచుకోవాలనేది సర్కార్ ప్లాన్ అని ఆ వర్గాలు వివరిస్తున్నాయి. అంతేకాదు ఇందులో స్వామి కార్యం, స్వ కార్యం కూడా ఉంటాయని వారు అభిప్రాయపడుతున్నారు.
రెండు లక్షల దాకా
ప్రస్తుతం నగరంలోని ప్రభుత్వ శాఖలు మొత్తం ప్రధాన రహదారి మార్గాల వెంట ఉన్నాయి. కొన్ని కార్యాలయాలు ప్రైమ్ ఏరియాలో ఉన్నాయి..ఆ ప్రాంతాల్లో భూముల విలువ ఎక్కడ చూసినా గజం కనిష్టంగా రెండు లక్షల దాకా పలుకుతున్నది. అందుకే ప్రభుత్వ పెద్దల కన్ను మీ ఇంటిపై పడిందని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇక తెలంగాణ రాష్ట్రంలోని పరిపాలనకు సంబంధించి 32 విభాగాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా హైదరాబాదులోనే ఉన్నాయి. సొంత స్థలాలు, భవనాలు వీటికి ఉన్నాయి. ఈ కార్యాలయాలు కూడా ఏళ్ల తరబడి ఇందులోనే కొనసాగుతున్నాయి. కొన్ని విభాగాల్లోనే హెచ్ఓడి కార్యాలయాలు ఎకరాల్లో విస్తరించి ఉన్నాయి. ఉదాహరణకు హైదరాబాద్ నడిబొడ్డున, శాసనసభ, సచివాలయానికి అత్యంత సమీపంలో ఉంటే పాఠశాల విద్య డైరెక్టరేట్, ఇంటర్ సాంకేతిక విద్య కమిషనరేట్, ఎన్ సీ ఈ ఆర్ టీ విభాగాధిపతులందరికీ 7.1 0 ఎకరాల స్థలంలో ఈ కార్యాలయాలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో గజం మూడు లక్షల వరకు పలుకుతోంది. అలాగే కోఠీ లోని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ క్యాంపస్ మొత్తం 15 స్థలంలో ఉంది. ఇందులో డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్, ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్, టీ ఎస్ ఎం ఐ డీ సీ కార్యాలయాలు ఉన్నాయి. ఇక్కడ గజం విలువ రెండు లక్షల పైనే ఉంటుంది. అలాగే నారాయణగూడలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ హెచ్వోడి కార్యాలయం మూడున్నర ఎకరాల స్థలంలో ఉంది. వైద్యశాఖకు చెందిన స్టేట్ హెల్త్ ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్ కార్యాలయం సంజీవరెడ్డి నగర్ లో ఐదు ఎకరాల్లో ఉంది. వెంగళరావు నగర్ లోని డ్రగ్ కంట్రోల్ కార్యాలయానికి రెండు ఎకరాల స్థలం ఉంది. సికింద్రాబాద్లోని గాంధీ ఆసుపత్రికి ఎదురుగా ఉన్న ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీస్ కార్యాలయం అర ఎకరం విస్తీర్ణంలో ఉంది. ఇక బాగ్ లింగంపల్లిలోనే ఏపీ నర్సస్ అండ్ మిడ్ వైఫ్ కౌన్సిల్ కు ఏడు గుంటల స్థలం ఉంది.ఇవి మొత్తం కలిపితే 26.7 ఎకరాలు ఉంది. ఈ కార్యాలయాలు మొత్తం ఖాళీ ఖాళీ చేస్తే, ఆ భూమిని బహిరంగ మార్కెట్లో విక్రయిస్తే సుమారు రెండువేల కోట్ల దాకా ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక ఒక వైద్య ఆరోగ్యశాఖ నుంచే 2000 కోట్ల ఆదాయం వస్తే.. మిగతా 31 శాఖలకు చెందిన భూములను అమ్మితే ఎన్ని వేల కోట్ల ఆదాయం వస్తుందో అంచనా వేసుకోవచ్చు.
అప్పుల కుప్ప
ఇక బంగారు తెలంగాణ అని కెసిఆర్ పదేపదే చెబుతున్నప్పటికీ.. ప్రతినెల అప్పు చేయనిదే ప్రభుత్వాన్ని నడపలేని స్థితికి రాష్ట్రం చేరుకుంది. వచ్చే ఆదాయం లేకపోవడంతో ఉన్న వనరులను అమ్మేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇప్పటికే అవుటర్ రింగ్ రోడ్డును 30 ఏళ్లపాటు లీజుకు ఇచ్చింది. ఇది కూడా సరిపోకపోవడంతో ట్విన్ టవర్స్ పేరుతో ప్రభుత్వ శాఖల ఆధిపతులకు చెందిన భూములను అమ్మేందుకు సర్కారు ప్రయత్నిస్తోంది. ఇక ఇటీవల ఒక హెచ్ ఓ డి నూతన సచివాలయాన్ని సందర్శించారు. ఎక్కడ సెక్రటరీ గదులను చూసి వాటికన్నా తమ కార్యాలయమే విశాలంగా ఉందని అభిప్రాయపడ్డారు. ఇప్పటికి కూడా కొందరు సెక్రటరీలు తమ ఛాంబర్స్ పై అసంతృప్తితో ఆయా శాఖల పరిధిలోని హెచ్వోడి కార్యాలయాలకు వెళ్లి పనిచేస్తున్నారు. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ట్విన్ టవర్స్ పరిస్థితి కూడా ఉంటే ఎలా అనే ప్రశ్నలు అధికారుల్లో వ్యక్తం అవుతున్నాయి.
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Cm kcr has decided on another project green signal for the construction of twin towers near the secretariat
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com