CM KCR: ‘‘ప్రతీ దళిత కుటుంబానికి మూడెకరాలు ఎలా సాధ్యం అవుతుంది.. అన్ని కుటుంబాలకు భూమి ఇచ్చేందుకు మనవద్ద అన్ని వనరులు ఎక్కవిడి.. రూరల్ ప్రాంతంలోభూమి ఉన్నా జనాభా ఎక్కువ ఉంటారు.. అర్బన్ ప్రాంతంలో తీవ్రమైన భూమి కొరత ఉంది. ప్రభుత్వ పథకాలకే భూమి లభించని క్రమంలో ప్రతీ దళిత కుటుంబానికి మూడు ఎకరాలభూమి ఎలా సాధ్యం అవుతుంది.. అసలు మూడు ఎకరాల భూమి ఇస్తానని నేను ఎన్నాడూ చెప్పలేదు..’’ అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల అసెంబ్లీలో చేసిన కామెంట్లు వివాదాస్పదంగా మారుతున్నాయి. సోషల్ మీడియాలో అప్పుడు ఇచ్చిన హామీకి సంబంధించిన వీడియోతో పాటు ప్రస్తుతం సీఎం మాట్లాడిన మాటలను ట్రోల్ చేస్తూ.. నెటిజన్లు ముఖ్యమంత్రిపై మండిపడుతున్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) ఆచితూచి మాట్లాడే వ్యక్తి.. తిమ్మిని బమ్మి.. బమ్మిని తిమ్మి చేసేంత మాటకారి. ఎంతటి తెలివైన వ్యక్తిని కూడా చివరికి బోల్తా కొట్టించేంత మాటకారి తనం అతడికి ఉంటుంది. 2014 ఎన్నికల సమయంలో ఇంటికో ఉద్యోగం ఇస్తామని అది సాధ్యం అవుతుందని.. ఆ పనిని తాను చేసి తీరుతానని అన్న ముఖ్యమంత్రి కేసీఆర్ కొద్దిరోజులకే మాట మార్చారు.. అసలు ఆ మాట తాను అననే లేదని.. అది సాధ్యం ఎలా అవుతుందని ఇదే అసెంబ్లీ వేదికగా.. ప్రతిక్షాలపై మండిపడ్డారు. అప్పట్లో ఈ వ్యాఖ్యలు చాలా సంచలనంగా మారగా.. మరోసారి ముఖ్యమంత్రి మూడెకరాల భూ పంపిణీపై చేసిన వ్యాఖ్యాలు వివాదాస్పదంగా మారాయి.
దళితులకు మూడు ఎకరాల భూమిని తాము ఇస్తామని ఎన్నాడూ హామీ ఇవ్వలేదని.. మేనిఫెస్టోలోనూ పెట్టలేదని.. నిండు సభలో మాట్లాడారు. దళితులకు మూడెకరాలు అనేది మొదటి సారి అధికారంలోకి వచ్చేందుకు ఎన్నికల ప్రచారంలో భాగంగా మేనిఫెస్టోలో పెట్టిన హామీ అదీ.. 2014లో దళితులంతా కలిసి ఏకపక్షంగా ఆయనకు మద్దతు పలకడానికి ఈ హామీ కీలకం. తరువాత ఆ హామీని అమలు చేసేందుకు చాలానే ప్రయత్నం చేశారు. కొంత మందికి భూమి సైతం ఇచ్చారు. ఎంత ఖర్చయినా.. భూ పంపిణీని ఆపేది లేదని పలుమార్లు ప్రకటించేశారు. మొదటిసారి అధికారంలో ఉన్న సమయంలో అది సాధ్యం కాలేదు.. 2018లో ఎన్నికల ప్రచారంలో భాగంగా మరోసారి మూడెకరాల భూ పంపిణీ అంశాన్ని మేనిఫెస్టోలో పెట్టారు. అయినప్పటికీ.. తాను హామీ ఇవ్వలేదని చెబుతున్న మాటలు ఇప్పుడు వివాదాస్పదంగా మారుతున్నాయి. సోషల్ మీడియాలో పలువురు టీఆర్ఎస్ కు సంబంధించిన మేనిఫెస్టోను ప్రదర్శనకు పెడుతున్నారు.
సీఎం కేసీఆర్ చేసిన ప్రకటన క్లిప్పింగులు కూడా షేర్ చేస్తున్నారు. 2018లో ముందస్తు ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో కాపీలో ఉన్న షెడ్యూలు కులాల సంక్షేమం కోసం అనే పేజీలో దళితులకు మూడెకరాల భూమి ఇస్తున్నామని హామీ ఉందని చెబుతున్నారు. సీఎం కేసీఆర్ సైతం అసెంబ్లీలో అలా ఎందుకు చెప్పారా అని టీఆర్ఎస్ నాయకులే అంతర్మథనంలో పడ్డారు. దళితులకు మూడెకరాల భూమి అనేది అందరికీ తెలిసిందే.. రాష్ట్రంలో ఇప్పటికే ఈ పథకాన్ని ప్రారంభించారు. కొందరికి భూమి పంపిణీ సైతం చేశారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు ప్రజల్లో తప్పుడు సంకేతాలకు దారి తీస్తుందని టీఆర్ఎస్ నాయకులు, వివిధపార్టీల వాళ్లు, రాజయకీ విశ్లేషకులు చెబుతున్నారు.