Dharmana Brothers: శ్రీకాకుళం జిల్లాలో సీఎం జగన్ టూర్ ధర్మాన సోదరుల మధ్య చిచ్చుపెట్టింది. వారి మధ్య ఉన్న విభేదాలకు ముఖ్యమంత్రి పర్యటన మరింత ఆజ్యం పోసింది. సోదరుల అనుచరులు వర్గాలుగా విడిపోయి ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకునేందుకు చాన్స్ ఇచ్చింది. గత కొంతకాలంగా ధర్మాన సోదరుల మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. మంత్రివర్గ విస్తరణతో అది మరింత రాజుకుంది. జగన్ అధికారంలోకి వచ్చిన తరువాతధర్మాన కృష్ణదాస్ కు అవకాశమిచ్చారు. మంత్రివర్గంలోకి తీసుకున్నారు. అయితే అప్పట్లో మంత్రి పదవి ఆశించి భంగపడ్డ ధర్మాన ప్రసాదరావు వ్యూహాత్మకంగా మౌనం పాటించారు. పార్టీకి అంటీ ముట్టనట్టుగా వ్యవహరిస్తూ వచ్చారు. అటు సోదరుడు కృష్ణదాస్ తో సైతం అంతంతమాత్రంగానే సంబంధాలు కొనసాగించారు. అదే సమయంలో కృష్ణదాస్ మంత్రిగా పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. జిల్లాకు చెందిన స్పీకర్ తమ్మినేని సీతారాం, మరో జూనియర్ మంత్రి సీదిరి అప్పలరాజుల దూకుడును కట్టడి చేయలేకపోయారు. ఇంతలో మంత్రివర్గ విస్తరణలో కృష్ణదాస్ పదవి కోల్పోయారు. ధర్మాన ప్రసాదరావు మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు.

అయితే వైసీపీ ఆవిర్భావం నుంచే ధర్మాన సోదరుల మధ్య విభేదాలున్నాయి. అప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వంలో ధర్మాన ప్రసాదరావు మంత్రిగా ఉన్నారు. సోదరుడ్ని కాదని కృష్ణదాస్ ఎమ్మెల్యే పదవిని వదులుకొని మరీ జగన్ వెంట నడిచారు. వైసీపీలో చేరారు. దీంతో నరసన్నపేట అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. వైసీపీ అభ్యర్థిగా కృష్ణదాస్ బరిలో ఉంటే.. కాంగ్రెస్ అభ్యర్థిగా మరో సోదరుడు రామదాసును ధర్మాన ప్రసాదరావు పోటీలో పెట్టారు. ఒకే కుటుంబం నుంచి ఇద్దరు అభ్యర్థులు పోటీలో దిగడంతో పోటీ రసవత్తరంగా మారింది. కానీ వైసీపీ అభ్యర్థిగా పోటీచేసిన కృష్ణదాసే గెలిచారు. అప్పటి నుంచి కుటుంబంలో చీలికలు వచ్చాయి. విభేదాలు కొనసాగుతున్నాయి. అయితే అక్కడికి కొద్దిరోజుల తరువాత.. 2014 ఎన్నికలకు ముందు ధర్మాన ప్రసాదరావు వైసీపీ గూటికి చేరారు. ఆ సమయంలో ధర్మాన కుటుంబమంతా ఒక్కటేనని ప్రకటించుకున్నారు. అయితే ధర్మాన సోదరుల వ్యవహార శైలి నచ్చక మెజార్టీ కేడర్ టీడీపీలో చేరింది. ఫలితంగా కృష్ణదాస్ నరసన్నపేటలో, ధర్మాన ప్రసాదరావు శ్రీకాకుళం నియోజకవర్గంలో ఓటమి చవిచూశారు.
గత ఎన్నికల్లో సోదరులిద్దరూ గెలిచారు. కానీ జగన్ మాత్రం కృష్ణదాస్ కు ఇచ్చిన విలువ ప్రసాదరావుకు ఇవ్వలేదు. పైగా రాజకీయ ప్రత్యర్థి అయిన తమ్మినేని సీతారాం కు స్పీకర్ పదవి ఇచ్చారు. ధర్మాన ప్రసాదరావును ఖాళీగా కూర్చోపెట్టారు. ప్రసాదరావు కూడా వైసీపీలో అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తూ వచ్చారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో కార్యక్రమాలను మాటమాత్రంగానైనా చెప్పకుండా అటు స్పీకర్ తమ్మినేని, ఇటు సోదరుడు కృష్ణదాస్ నిర్వహించేవారు. దాదాపు ప్రసాదరావును ఎంత తొక్కాలో..అంతలా తొక్కేశారు. అయితే ఆ ఇద్దరి నేతలతో పోల్చుకుంటే ధర్మాన ప్రసాదరావు పొలిటికల్ గా పవర్ ఫుల్. జిల్లాలో దాదాపు అన్ని నియోజకవర్గాలపై ప్రభావం చూపగల నేత. అందుకే జగన్ కాస్తా వెనక్కి తగ్గి ధర్మాన ప్రసాదరావును కేబినెట్ లోకి తీసుకున్నారు.

అయితే తన సోదరుడు కృష్ణదాస్ వ్యవహరించిన తీరు ప్రసాదరావుకు మింగుడుపడలేదు. 2004లో నరసన్నపేట సొంత నియోజకవర్గాన్ని సోదరుడు కృష్ణదాస్ కోసం వదులుకున్న ప్రసాదరావు శ్రీకాకుళం అసెంబ్లీ స్తానానికి మారారు. ఒక విధంగా చెప్పాలంటే కృష్ణదాస్ కు రాజకీయ అవకాశం కల్పించారు. కానీ సోదరుడు తన విషయంలో వ్యవహరించిన తీరుపై ప్రసాదరావు తెగ బాధపడుతూ వచ్చేవారు. మంత్రి పదవి దక్కడంతో తిరిగి నరసన్నపేటలో యాక్టివ్ అవ్వదలచుకున్నారు. తద్వారా కృష్ణదాస్ కు దెబ్బతీయ్యాలని భావిస్తున్నారు. తన పాత అనుచరులను చేరదీసే ప్రయత్నాలు ప్రారంభించారు. దీంతో నరసన్నపేట నియోజకవర్గంలో వైసీపీ శ్రేణులు ధర్మాన సోదరుల అనుచరులుగా, వర్గాలుగా విడిపోయారు. సీఎం జగన్ నరసన్నపేట పర్యటన సమయంలో లోకల్ ఎమ్మెల్యేగా కృష్ణదాస్ మంత్రి ప్రసాదరావు వర్గీయులకు ఎక్కడా అవకాశం ఇవ్వలేదు. అటు సీఎం స్వాగత బ్యానర్లలో సైతం మంత్రి ఫొటోలేకుండా జాగ్రత్త పడ్డారు. అయితే మంత్రిని ఉద్దేశపూర్వకంగా అవమానించడానికే ఇటువంటి చర్యలకు దిగారని ప్రసాదరావు వర్గీయులు ఎదురుదాడి చేస్తున్నారు. మొత్తానికైతే లోలోపల ఉన్న విభేదాలు సీఎం జగన్ టూర్ తో బయటపడ్డాయి.