CM Jagan: ఏపీ సీఎం జగన్ ఎన్నికల కధన రంగంలోకి దూకారు. తనతో పాటు మందీ మార్బలాన్ని ప్రయోగిస్తున్నారు. ఏకకాలంలో తనతో పాటు పార్టీ సైన్యాన్ని యుద్ధ రంగంలోకి దించుతున్నారు. ఈ ఆరు నెలల పాటు ప్రజల మధ్య గడిపేలా పార్టీ శ్రేణులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. మంత్రులు, పార్టీ శ్రేణులకు కీలక బాధ్యతలు కట్టబెట్టారు. వై నాట్ 175 అన్న స్లోగన్ తో వైసీపీ నేతలకు కీలక టాస్క్ ఇచ్చారు.
ప్రస్తుతం టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు అవినీతి కేసుల్లో జైల్లో ఉన్నారు. ఆయనకు కోర్టుల్లో ఊరట దక్కడం లేదు. అసలు బయటకు ఎప్పుడు వస్తారో తెలియడం లేదు. ఇటువంటి సమయంలోనే ఎన్నికల శంఖారావాన్ని జగన్ పూరించడం విశేషం. సామాజిక న్యాయ యాత్ర పేరుతో రాష్ట్రంలో మూడు ప్రాంతాల్లో ఏకకాలంలో నేడు బస్సు యాత్రలు ప్రారంభం కానున్నాయి. వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమాన్ని సైతం ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని డిసైడ్ అయ్యారు. మరోవైపు రాజకీయ వ్యూహాలకు సైతం సిద్ధపడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ల కేటాయింపు, పార్టీ అంతర్గత సమస్యలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టనున్నారు.
గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా మంత్రులు, ఎమ్మెల్యేలను ఇప్పటికే ఇంటింటికి పంపించారు. ప్రజల మూడ్ ను తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఆ కార్యక్రమం ప్రాతిపదికగానే నేతలకు టిక్కెట్లు కేటాయించనున్నారు. గత నాలుగున్నర సంవత్సరాలుగా ప్రజలకు సంక్షేమ పథకాలు, మెరుగైన పాలన అందించాం అని జగన్ భావిస్తున్నారు. చేసింది చెప్పుకునేందుకే రాష్ట్రవ్యాప్తంగా బస్సుయాత్రలకు సిద్ధమయ్యారు. ఈనెల 26 నుంచి నవంబర్ 9 వరకు మొదటి విడత బస్సు యాత్రలు జరగనున్నాయి. ఉత్తరాంధ్రకు సంబంధించి ఇచ్చాపురంలో, దక్షిణ కోస్తాకు సంబంధించి తెనాలిలో, రాయలసీమకు సంబంధించి సింగనమలలో యాత్ర ప్రారంభం కానుంది. వీటి కోసం మూడు బస్సులను ఇప్పటికే రెడీ చేశారు. ఆయా ప్రాంతాలకు తరలించారు.
ఈ బస్సు యాత్రలను వైసీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కీలక నాయకులకు బాధ్యతలను కట్టబెట్టింది. ప్రత్యేక టీమ్ ను ఏర్పాటు చేసింది. అందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన నాయకులను స్పీకర్లుగా ఉండేలా నిర్ణయించారు. స్థానిక ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఈ యాత్ర కొనసాగుతుంది. ప్రధానంగా ఈ నాలుగున్నర ఏళ్ల కాలంలో చేసిన సంక్షేమం గురించి ప్రచారం చేయడంతో పాటుగా సామాజిక న్యాయాన్ని ఏ రకంగా అమలు చేస్తున్నారో వివరించనున్నారు. మరోవైపు విపక్షాలు వ్యవహరిస్తున్న తీరుపై సైతం వివరించే ప్రయత్నం చేయనున్నారు. మొత్తానికైతే ఏపీ సీఎం జగన్ విపక్షాలను గట్టిగానే టార్గెట్ చేసుకున్నారు.