Telangana Congress: ఈసారి ఎలాగైనా బీఆర్‌ఎస్‌ను గద్దె దించాలన్న లక్ష్యంతో కాంగ్రెస్ ఢిల్లీ నుంచి గల్లీ వరకు వర్కవుట్ చేస్తోంది. కేసీఆర్ వ్యూహాలకు, ప్రతి వ్యూహాలు రచిస్తోంది. గులాబీ బాస్ సంక్షేమాన్ని తలదన్నేలా సంక్షేమ వరాలతో మేనిఫెస్టో రూపొందిస్తోంది. అభ్యర్థుల ఎంపిక విషయంలోనూ ఆచితూచి అడుగులు వేస్తోంది. పక్క ప్లాన్‌తో ఈ ఎన్నికల్లో గెలవాలని కాంగ్రెస్ భావిస్తోంది. అయితే ఇక్కడి వరకు అంతా బాగానే ఉన్నా.. గత ఎన్నికల సమయంలో చేసిన పొరపాటునే.. ఈసారీ చేసింది టీకాంగ్రెస్. అదే రైతుబంధు ఆపేయాలని ఈసీకి ఫిర్యాదు చేయడం.
2018 ఎన్నికల సమయంలో ప్రారంభం..
తెలంగాణ ముఖ్యమంత్రి 2018లో ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. అంతకంటే ముందే రైతులకు పెట్టుబడి ఇవ్వాలని రైతుబంధు, రైతుబీమా పథకాలను ప్రకటించారు. రైతుల ఖాతాల్లో ఎకరాకు రూ.4 వేల చొప్పున రెండు పంటలకు రూ.8 వేలు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. తర్వాత నెలకే ప్రభత్వాన్ని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. అయితే..రైతల వివరాల సేకరణ, బ్యాంకు ఖాతాలు, ఆధార్ లింక్, తదితర కారణాలతో రైతుబంధు పంపిణీ సమయానికి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది. అప్పటికి ఎన్నికలకు సిద్ధం కాని కాంగ్రెస్.. రైతుబంధు డబ్బుల చెక్కులు ఇవ్వడం వలన ఓటర్లను ప్రభావితం చేస్తుందని, దీనిని నిలిపివేయాలని కాంగ్రెస్ ప్రతినిధులు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. దీంతో స్పందించిన ఈసీ, పెట్టుబడి సాయం రైతుల ఖతాల్లో జమ చేయాలని ఆదేశించింది. దీని ప్రభావం ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌పై పడిందన్న అభిప్రాయం ఉంది.
మళ్లీ అదే తప్పు..
తాజాగా అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ వచ్చింది. ఈసారి అధికార బీఆర్‌ఎస్‌పై వ్యతిరేకత ఉంది. దీనిని తమకు అనుకూలంగా మలుచుకుంటున్న కాంగ్రెస్ పార్టీ, ఈసారి కేసీఆర్‌ను గద్దె దించుతామన్న ధీమాతో ఉంది. అయితే, 2018లో చేసిన పొరపాటునే టీకాంగ్రెస్ నేతలు మరోసారి చేశారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైనందు, యాసంగి పంటలకు సంబంధించిన రైతుబంధు సాయం చెల్లింపులు నిలిపివేయాలని మళ్లీ ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. బుధవారం ఢిల్లీ వెళ్లిన కాంగ్రెస్ ప్రతినిధులు సీఈసీతో సమావేశమయ్యారు. ఎన్నికల వేళ డబ్బులు పంచడం ద్వారా ఓటర్లు ప్రభావితం అవుతారని, రైతుబంధు స్కీం అలాంటిదే అయినందున ఎన్నికల నిబంధనల ప్రకారం దానిని నిలిపివేయాలని ఫిర్యాదు చేశారు. స్పందించిన ఈసీ, తెలంగాణ అధికారుల నుంచి వివరాలు తెప్పించుకుని చర్యలు తీసుకుంటామని తెలిసింది.
మొత్తంగా ఎన్నికల వేళ.. రైతులను ప్రభావితం చేయాలని కేసీఆర్ భావిస్తుంటే, అదే రైతులకు ఆర్థికసాయం అందకుండా కాంగ్రెస్ అడ్డుకుంటోంది. దీని ప్రభావం ఎన్నికల్లో ఎలా ఉంటుందో చూడాలి.