CM Jagan Uttarandhra Tour: ఉత్తరాంధ్రపై జగన్ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారా? పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమితో జాగ్రత్త పడ్డారా? అప్రమత్తం కాకుంటే ఓటమి తప్పదని భయపడుతున్నారా? అందుకే వరుస పర్యటనలు చేస్తున్నారా? శంకుస్థాపనల పేరిట హడావుడి అందుకేనా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇప్పటికే శ్రీకాకుళం జిల్లాలో మూలపేట పోర్టు నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేశారు. అది జరిగి రెండు వారాలు గడవక ముందే ఇప్పుడు విజయనగరం జిల్లా భోగాపురంలో అంతర్జాతీయ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టు నిర్మాణానికి శంకుస్థాపనకు రేపు వస్తున్నారు. అయితే ఈ రెండు ప్రాజెక్టులకు గత టీడీపీ ప్రభుత్వం శంకుస్థాపనలు చేసింది. గత నాలుగేళ్లుగా పట్టించుకోకపోగా.. ఇప్పుడు హడావుడిగా శంకుస్థాపనలు చేస్తున్నారు.
ఎమ్మెల్సీ ఓటమితో…
విశాఖ రాజధాని అని చెప్పినా ఉత్తరాంధ్ర ప్రజలు పెద్దగా నమ్మలేదు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని కట్టబెట్టారు. దీంతో జగన్ లో పునరాలోచన ప్రారంభమైంది. పట్టభద్రులు తమ ఓటర్లు కాదని చెప్పుకొస్తున్నా ఎటువంటి అభివృద్ధి లేకపోవడం వల్లే విద్యావంతులు, యువత పట్టుబట్టి ఓడించిన విషయం జగన్ తెలుసుకున్నారు. అందుకే ఇప్పుడు ఉత్తరాంధ్ర బాట పడుతున్నారు. బుధవారం విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారు. ఎయిర్ పోర్టుతో పాటు పలు ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టనున్నారు. పాతిక వేల మందికి ఉపాధిని ఇచ్చే అదానీ డేటా సెంటర్, టెక్నాలజీ పార్క్, విజయనగరం లోని తారకరమా సాగునీటి ప్రాజెక్ట్ ఇలా చాలా కార్యక్రమాలను ఒకేసారి పెట్టుకుని మరీ ముఖ్యమంత్రి జగన్ ఉత్తరాంధ్రా టూర్ కి వస్తుండడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఆ భయంతోనే..
ఉత్తరాంధ్రకు ఏమీ చేయలేదన్న విపక్షాల ఆరోపణకు చెక్ చెప్పేందుకే కొత్త ఎత్తుగడ అని తెలుస్తోంది. సీఎం పర్యటన పూర్తిగా ఉత్తరాంధ్రాను ఫోకస్ చేయడానికి కూడా వైసీపీ వాడుకుంటోంది. విశాఖ విజయనగరం జంట నగరాలుగా అభివృద్ధి చేస్తామని ఇప్పటికే వైసీపీ నేతలు, మంత్రులు ప్రకటనలు చేస్తున్నారు. ఈ నేపధ్యంలో వైసీపీ మీద టీడీపీ నేతలు ఘాటు విమర్శలు చేస్తున్నారు. గడిచిన ఎన్నికల్లో ఉత్తరాంధ్రలోని 34 నియోజకవర్గాల్లో ..28 చోట్ల వైసీపీ గెలిచింది. టీడీపీ మాత్రం కేవలం ఆరింటితో సరిపెట్టకుంది. అయితే ఈసారి వైసీపీకి ఆ చాన్స్ ఉండదన్న వార్తలు వస్తున్నాయి. ఉత్తరాంధ్రలో సీన్ రివర్స్ అవుతుందన్న ప్రచారం ఉంది. అందుకే ఉత్తరాంధ్రపై ఫోకస్ పెట్టకుంటే పుట్టి మునగడం ఖాయని జగన్ లోలోపల బయపడుతున్నట్టు తెలుస్తోంది.
జగన్ వెంటే చంద్రబాబు..
అయితే అభివృద్ధి పనుల శంకుస్థాపన పేరిట జగన్ హడావుడి చేస్తుండగా.. దానికి చెక్ చెప్పేందుకు చంద్రబాబు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఉత్తరాంధ్రలో పర్యటనకు డిసైడ్ అయ్యారు.జగన్ ఇలా వచ్చి వెళ్లగానే వారం వ్యవధిలో చంద్రబాబు ఉత్తరాంధ్రా టూర్ కి ప్లాన్ చేస్తునారు. ఈ నెల 10, 11 తేదీలలో ఆయన శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల పర్యటనలు పెట్టుకున్నారని పార్టీ వర్గాల నుంచి తెలుస్తోంది. అదే విధంగా ఈ నెల 17న ఆయన విశాఖ జిల్లా టూర్ కి మరోసారి రానున్నారు.అంటే ఒకే నెలలో రెండు సార్లు చంద్రబాబు ఉత్తరాంధ్రా జిల్లాల పర్యటనలకు వస్తున్నారని తెలుస్తోంది. జగన్ పర్యటనను వచ్చే పొలిటికల్ మైలేజిని పూర్వపక్షం చేయడానికి టీడీపీని బలోపేతం చేయడానికి బాబు చేస్తున్న టూర్లుగా వీటిని చూస్తున్నారు. అయితే ఉత్తరాంధ్రలో మాత్రం పొలిటికల్ హీట్ ను పెంచేస్తున్నారు.