CM Jagan: గత ఎన్నికల్లో జగన్ విజయానికి కుటుంబ సభ్యులు ఎంతగానో సహకరించారు. ముఖ్యంగా వైఎస్ షర్మిల కాలికి బలపం కట్టుకొని తిరిగారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా ప్రచారం చేశారు. బై బై బాబు అంటూ షర్మిల ఇచ్చిన స్లోగన్ ప్రజల్లోకి బలంగా వెళ్ళింది. ఇక ఆమె భర్త బ్రదర్ అనిల్ కుమార్ గురించి చెప్పనక్కర్లేదు. మత ప్రబోధకుడిగా క్రిస్టియన్, దళిత, మైనారిటీ ఓట్లు పడడంలో క్రియాశీలకంగా వ్యవహరించారు. జగన్ గెలవాలని బలంగా పనిచేశారు. చర్చిల్లో కానుకలు ఇచ్చి మరీ ఓట్లు వేయించుకున్నారని ఆయనపై ఒక ఆరోపణ కూడా ఉంది.అయితే ఈసారి బ్రదర్ అనిల్ కుమార్ దూరం కావడం వైసీపీకి లోటే.
అయితే బ్రదర్ అనిల్ కుమార్ కు విరుగుడుగా జగన్ కొత్త వ్యక్తిని తెరపైకి తెచ్చారు. తన మేనత్త అయిన విమలా రెడ్డిని రంగంలోకి దించారు. విశాఖ రుషికొండ సమీపంలో అత్యంత ఖరీదైన స్థలాన్ని పొందిన ఆమె.. కుటుంబంలో వచ్చిన చీలికలో జగన్ పైపు నిలబడ్డారు. వివేకా హత్య విషయంలో ఏదో జరిగిపోయిందని.. దానిని పట్టించుకోవద్దని.. సర్దుకుని ముందుకు వెళ్లాలని ఆమె సలహా ఇస్తున్నట్లు తెలుస్తోంది. అంతటితో ఆగని ఆమె చనిపోయిన తర్వాత వివేకాపై నిందలు కూడా మోపారు. తాజాగా ఆమె తాడేపల్లిలో పాస్టర్లతో సమావేశమయ్యారు. ప్రభుత్వంపై అసంతృప్తి ఉంటే పక్కన పెట్టాలని.. ఎన్నికల్లో వైసిపి కోసం పనిచేయాలని ఆదేశించారు. దీంతో ఆమెను బ్రదర్ అనిల్ కుమార్ స్థానంలో రంగంలోకి దించినట్టేనని తేలిపోయింది.
ఎస్సీ, ఎస్టి రిజర్వుడ్ నియోజకవర్గాల్లో వైసిపి వరుస విజయాలకు బ్రదర్ అనిల్ కుమార్ కారణమన్న విశ్లేషణ ఉంది. వైసీపీ ఆవిర్భావం తర్వాత రెండు ఎన్నికలు జరిగాయి. క్రిస్టియన్, మైనారిటీ, దళితులు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో వరుసగా వైసీపీ గెలుపొందుతూ వస్తోంది.దీనికి బ్రదర్ అనిల్ కుమార్ కారణమని విశ్లేషణలు ఉన్నాయి. గత ఎన్నికల్లో పెద్ద ఎత్తున తాయిలాలు ఆయన ద్వారా మారినట్లు ఆరోపణలు వచ్చాయి. బ్రదర్ అనిల్ కుమార్ భార్య షర్మిల కాంగ్రెస్ పగ్గాలు తీసుకుంటున్న తరుణంలో.. క్రిస్టియన్, మైనారిటీ ఓటు బ్యాంక్ కాంగ్రెస్ వైపు వెళుతుందని జగన్ భయపడుతున్నారు. అందుకే విమలారెడ్డిని రంగంలోకి దించినట్లు తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రచార బాధ్యతలు అప్పగిస్తారని టాక్ నడుస్తోంది. అయితే బ్రదర్ అనిల్ కుమార్ దూకుడుకు ఆమె అడ్డుకట్ట వేయగలరా? లేదా? అన్నది చూడాలి.