CM Jagan Mahayagnam : జగన్ మహాయజ్ఞాల వెనుక కథేంటి?

వ్యక్తిగతంగా యాగాలు నిర్వహిస్తే విమర్శలు చుట్టుముట్టే అవకాశముండడంతో ప్రభుత్వపరంగా యాగాలు చేయడానికి నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.

Written By: Dharma, Updated On : May 3, 2023 1:09 pm
Follow us on

CM Jagan Mahayagnam : యాగాలపై ఏపీ సీఎం జగన్ కు అపారమైన నమ్మకం. గత ఎన్నికల్లో ఈ యాగాలే తనను గెలిపించాయని ఆయన బలంగా నమ్ముతున్నారు. అప్పటి నుంచే ఆయన యాగ నిర్వాహకుడు, విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపనందేంద్రస్వామికి భక్తుడిగా మారిపోయారు. తొలుత తెలంగాణ సీఎం కేసీఆర్ స్వరూపానందేంద్రస్వామిని జగన్ కు పరిచయం చేశారు. ఆయన చేసిన యాగాలతోనే తాను తెలంగాణలో అధికారానికి చేరువయ్యానని చెప్పడంతో అక్కడ నుంచి జగన్ కూడా సంప్రదించడం మొదలుపెట్టారు. గత ఎన్నికలకు ముందు స్వరూపానందేంద్రస్వామి ఆధ్వర్యంలో యాగాలు చేశారు. అధికారంలోకి రావడంతో ఆయన నమ్మకం మరింత పెరిగింది. అందుకే ఎటువంటి కార్యక్రమాలైన స్వరూపానందేంద్రస్వామి ఆశీస్సులతో మొదలుపెట్టడం ఆనవాయితీగా మార్చుకున్నారు.

గత ఎన్నికలకు ముందు..
అయితే సరిగ్గా ఎన్నికలకు ముందు ఈసారి అటువంటి యాగాలకే ప్లాన్ చేశారు. అయితే గతంలో విపక్షంలో ఉండడంతో ప్రైవేటు కార్యక్రమం అయ్యింది. అయితే ఈసారి మాత్రం ఏకంగా ప్రభుత్వం తరుపున నిర్వహించాలని డిసైడయ్యారు. విజయవాడలో ఏర్పాటుచేయడానికి నిర్ణయించారు.  దీనికి ఏర్పాట్లన్నీ చురుగ్గా సాగుతున్నాయి.  రాష్ట్రం సర్వతోముఖాభివృద్దిని సాధించాలనే లక్ష్యంతో ఈ యాగాన్ని నిర్వహిస్తున్నట్టు తెలిపారు.  దేవాదాయ శాఖకు నిర్వహణ బాధ్యతలు అప్పగించారు.  రాష్ట్రంలో ఈ తరహా మహా యాగాన్ని నిర్వహించ తలపెట్టడం ఇదే తొలిసారి.

ఆరు రోజుల పాటు..
యాగానికి అష్టోత్తర శతకుండ చండీ రుద్ర రాజశ్యామల సుదర్శన సహిత శ్రీలక్ష్మీ మహా యజ్ఞంగా పేరు పెట్టారు. ఇప్పటికే విశాఖ శ్రీశారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి, ఉత్తరాధికారి స్వాత్మ్యానందేంద్ర స్వామి వారికి ఆహ్వానాలు పంపారు. చాలా మంది పీఠాధిపతులకు సైతం ఆహ్వానించారు. 500 మంది రుత్వికులు ఆరు రోజుల పాటు పూజాది కార్యక్రమాలు నిర్వహించనున్నారు. విజయవాడలోని ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియంలో ఈ నెల 12 న కార్యక్రమం ప్రారంభమవుతుంది. 17తో ముగియనుంది. ఇప్పటికే దేవాదాయ శాఖ ఏర్పాట్లు ప్రారంభించింది.

చివరి రోజు సీఎం దంపతులు..
చివరి రోజు యాగంలో సీఎం  జగన్, భారతి దంపతులు పాల్గొనున్నారు. ఇటీవల కొన్ని పరిణామాల నేపథ్యంలోనే యాగం చేయాలని స్వామిజీలు సూచించినట్టు తెలుస్తోంది. అయితే వ్యక్తిగతంగా యాగాలు నిర్వహిస్తే విమర్శలు చుట్టుముట్టే అవకాశముండడంతో ప్రభుత్వపరంగా యాగాలు చేయడానికి నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. కాగా ఏర్పాట్లను దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ఏర్పాట్లను పరిశీలించారు. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధిని కాంక్షిస్తూ వైఎస్ జగన్ ఈ మహా యజ్ఞాన్ని నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ నాలుగు సంవత్సరాల పాటు ప్రకృతి తమ ప్రభుత్వాన్ని సహకరించిందని, సకాలంలో పుష్కలంగా వర్షాలు పడటమే దీనికి నిదర్శనమని అన్నారు. ఈ ఏడాది కూడా సమృద్ధిగా వర్షాలు కురువాలని ఆకాంక్షిస్తూ యాగాలను జరిపిస్తున్నట్టు తెలిపారు.