ముఖ్యమంత్రిగా పదవీ బాద్యతలు చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి శనివారం వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ఏకకాలంలో 10,641 వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలను ఆన్‌లైన్ వీడియో ద్వారా వీక్షిస్తూ ఆరంభించారు.
మొట్టమొదటిగా కర్నూలు జిల్లా ఆదోని మండలం పాండురంగపురం కేంద్రం ఆర్‌బికెలో లభించే సేవలను పరిశీలించారు. రైతు భరోసా కేంద్రాలతో పాటు సిఎం యాప్‌ను జగన్ ప్రారంభించారు. ఈ యాప్ ద్వారా రైతులకు నగదు చెల్లింపులు జరుగుతాయి. రైతు భరోసా కాల్ సెంటర్ 155251ను ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ ప్రభుత్వం వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా రైతులతో గడపడం ఆనందంగా ఉందని తెలిపారు. అధికారంలోకి వచ్చిన వెంటనే రైతు భరోసా పథకాన్ని తీసుకొచ్చామని గుర్తు చేస్తూ ఈ పథకం కింద 49 లక్షల రైతు కుటుంబాలకు రూ.10వేల కోట్లు ఇచ్చామని చెప్పారు.
పెట్టుబడులు తగ్గాలి, పంటకు గిట్టుబాటు ధర కల్పించాలనే రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేశామని జగన్ తెలిపారు. ఈ కేంద్రాల ద్వారా విత్తనం మొదలు పంట అమ్మకం వరకూ సూచనలు, సలహాలు ఇస్తాయని పేర్కొన్నారు. పంట రుణాలు, ఇన్సూరెన్స్, గిట్టుబాటు ధరలు కల్పించే విధంగా ఆర్‌బికెలు పనిచేస్తాయని వివరించారు.
తాను రాజకీయాల్లోకి వచ్చి 11 ఏళ్ళు పూర్తయిందని, రాష్ట్రంలో తిరగని ప్రదేశమూ, తొక్కని గడపా లేదని చెబుతూ ఈ ప్రయాణంలో ఎన్నో కన్నీళ్లు చూశానని, బాధలు తెలుసుకున్నాని తెలిపారు. గిట్టుబాటు ధర లేక రైతులు పంటలను పొలాల్లోనే వదిలిపెట్టడం చూశానని, అక్కాచెల్లెమ్మల కష్టాలూ చూశానని, విద్యార్థుల కష్టాలూ, ఆస్పత్రుల్లో రోగుల పరిస్థితులు అన్నీ చూశానని, వీటన్నిటికీ సమాధానంగా మేనిఫెస్టో తీసుకొచ్చానని వివరించారు.
అది కూడా రెండే రెండు పేజీల్లో పెట్టామని గుర్తు చేస్తూ తనకు ఓటు వేయని వారికి కూడా మంచి జరగాలని ఆశాభావం వ్యక్తం చేశారు. నవరత్నాలతో ప్రజల జీవితాలు బాగుపడతాయని తాను నమ్మానని చెబుతూ ఏడాది కాలంలోనే 90 శాతం హామీలను నెరవేర్చామని సంతృప్తి వ్యక్తం చేశారు. ఇక నుంచి రైతుల జీవితాల్లో విప్తవాత్మక మార్పు రాబోతోందని భరోసా వ్యక్తం చేశారు.