CM Jagan- TTD: ఆ ఇద్దరికీ జగన్ పదవుల వల

సాధారణంగా టీటీడీ పాలకమండలి లో సభ్యత్వం అంటే.. జన్మజన్మల అదృష్టంగా భావిస్తుంటారు. రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు, వివిధ రంగాల ప్రముఖులు టీటీడీ బోర్డు సభ్యుడుగా ఉండేందుకు తహతహలాడుతుంటారు.

Written By: Dharma, Updated On : August 15, 2023 12:41 pm

CM Jagan- TTD

Follow us on

CM Jagan- TTD: తిరుమల తిరుపతి దేవస్థానాన్ని సీఎం జగన్ రాజకీయాలకు వాడుకుంటున్నారా? ఏకంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని, సిపిఐ చీఫ్ ను ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నించారా? వారికి టీటీడీ బోర్డు పదవులను ఆఫర్ చేశారా ? ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. అంతటా ఇదే టాక్ నడుస్తోంది. తనపై ఉన్న కేసుల దృష్ట్యా జగన్ ఎంతటి సాహసానికైనా దిగుతారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

సాధారణంగా టీటీడీ పాలకమండలి లో సభ్యత్వం అంటే.. జన్మజన్మల అదృష్టంగా భావిస్తుంటారు. రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు, వివిధ రంగాల ప్రముఖులు టీటీడీ బోర్డు సభ్యుడుగా ఉండేందుకు తహతహలాడుతుంటారు. బోర్డు సభ్యత్వం ఇస్తామంటే మహత్ భాగ్యంగా భావిస్తారు. చాలామంది ఈ పదవులు కోసం పైరవీలు చేస్తుంటారు. అయితే జగన్ ఇక్కడే తన తెలివితేటలను ప్రదర్శించారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పైనే టీటీడీ పదవుల వలను విసిరారు. అంతటితో ఆగకుండా సీబీఐ చీఫ్ నకు సైతం కబురు పంపారు. మీ వాళ్ళు ఎవరైనా ఉన్నారా? టీటీడీ బోర్డు సభ్యులుగా అవకాశం ఇస్తామంటూ జగన్ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. కానీ ఆ ఇద్దరూ తిరస్కరించినట్టు సమాచారం. పెద్దలను ప్రసన్నం చేసుకొని భవిష్యత్తు అవసరాలు తీర్చుకోవాలన్న జగన్ ప్రయత్నం బెడిసి కొట్టింది. గతంలో కూడా గవర్నర్ మేనల్లుడికి టిటిడి పదవి ఇచ్చి జగన్ గౌరవించారు. ఇప్పుడు అదే మాదిరిగా తన పాచిక పారుతుందని భావించారు. కానీ అత్యున్నత స్థాయిలో ఉన్న సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి, సిబిఐ చీఫ్ జగన్ కు ఝలక్ ఇచ్చారు.

ఇటీవల టీటీడీ నూతన పాలక మండలిని నియమించిన సంగతి తెలిసిందే. బాబాయ్ వైవి సుబ్బారెడ్డిని తప్పించి.. మరో బంధువు కరుణాకర్ రెడ్డికి పగ్గాలు అప్పగించారు. ఈ తరుణంలో పాలకమండలి సభ్యులుగా 50 మందితో జుంబో కమిటీ ని ఎంపిక చేశారు. రకరకాల అవసరాల పేరుతో టీటీడీ సభ్యుల సంఖ్యను అమాంతం పెంచేశారు.

జగన్ పై భారీ స్థాయిలో సిబిఐ కేసులు పెండింగ్ లో ఉన్న సంగతి తెలిసిందే. అటు బాబాయ్ వివేకానంద రెడ్డి హత్య కేసు సైతం..
సిబిఐ విచారణను కొనసాగిస్తోంది. ఈ కేసులో రకరకాల రూపాల్లో స్థానిక న్యాయస్థానం నుంచి సుప్రీం కోర్టు వరకు విచారణకు వెళుతున్నాయి. దీంతో జగన్ టీటీడీ పాలకమండలి నియామకాన్ని తనపై ఉన్న కేసుల గురించి ఉపయోగించుకోవాలని చూశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి తో పాటు సిబిఐ చీఫ్ లను ప్రసన్నం చేసేందుకు ప్రయత్నించారు. మీ వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి.. టీటీడీ బోర్డులో సభ్యులుగా నియమిస్తామంటూ.. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చంద్రుచుడ్ కు, సిబిఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ కు కబురు పంపించినట్లు తెలిసింది. కానీ నిర్ణయాత్మక స్థానాల్లో ఉన్న తాము అలాంటి అంశాలకు తావివ్వమని.. నిర్మొహమాటంగా వారు తేల్చేసినట్లు తెలిసింది.

గతంలో ఏపీ గవర్నర్గా వ్యవహరించిన విశ్వ భూషణ్ హరి చందన్ కి సైతం ఇదే మాదిరిగా పదవిని ఆఫర్ చేశారు. భువనేశ్వర్ లోని టీటీడీ స్థానిక సలహా మండలి చైర్మన్ గా ఆయన మేనల్లుడిని నియమించారు. ఇప్పుడు అదే మాదిరిగా వ్యవహరించాలని భావించారు. కానీ ఆ ప్రయత్నం బెడిసి కొట్టింది. అయితే జగన్ చీఫ్ ట్రిక్స్ పై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.