CM Jagan : ఏపీ రాజకీయాల్లో చిత్ర విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. ఎన్నికల సమీపిస్తుండడంతో జంపింగులు ఊపందుకుంటున్నాయి. ఎవరు ఏ పార్టీయో చెప్పడం సాధ్యం కావడం లేదు. సీట్లు దక్కని వారు పక్క పార్టీల వైపు చూస్తున్నారు. ఆశించిన స్థాయి టికెట్ దక్కితే వెంటనే జంప్ అవుతున్నారు. మొన్నటికి మొన్న మంగళగిరి టిక్కెట్ ను జగన్ నిరాకరించడంతో ఆళ్ల రామకృష్ణారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైసిపి ప్రభుత్వ హయాంలో మంగళగిరి అభివృద్ధి జరగలేదని ఆక్షేపించారు. కానీ ఇలా కాంగ్రెస్ లోకి వెళ్లి పది రోజులు గడవక ముందే తిరిగి యూటర్న్ తీసుకున్నారు. వైసీపీలో చేరారు. అయితే ఆళ్ల రామకృష్ణారెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి ఎందుకు వెళ్లారు? తిరిగి వైసిపిలోకి ఎందుకు చేరారు? అన్నది పెద్ద హైడ్రామాగా నిలిచింది. కానీ ఆయన వైసీపీలో తిరిగి చేరిక వెనుక చాలా పెద్ద కథ నడిచినట్లు తెలుస్తోంది.
మంగళగిరి ఇన్చార్జిగా గంజి చిరంజీవిని నియమించారు. ఈయన బీసీ నేత. టిడిపి నుంచి వైసీపీలోకి వచ్చారు. పద్మశాలి వర్గానికి చెందినవారు. మంగళగిరి నియోజకవర్గంలో పద్మశాలి సామాజిక వర్గం అధికం. అయితే అక్కడ ఆశావహులుగా మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల, ఎమ్మెల్సీ హనుమంతరావు ఉన్నారు. గత ఎన్నికల్లో వీరంతా సమన్వయంగా పనిచేయడంతో ఆళ్ల రామకృష్ణారెడ్డి నారా లోకేష్ పై గెలుపొందారు. అయితే ఈసారి లోకేష్ అక్కడ పట్టు బిగిస్తున్నారు. అటు రాజధాని అంశం ఎక్కువగా ఉంది. గత ఎన్నికల నుంచి లోకేష్ ప్రత్యేకంగా దృష్టి సారించడంతో వైసీపీకి అక్కడ గడ్డు పరిస్థితి అని తేలింది. ఆళ్ల రామకృష్ణారెడ్డి అయితే గెలుపు అనుమానమేనని సర్వే నివేదికలు తేల్చాయి. దీంతో జగన్ గంజి చిరంజీవిని ఎంపిక చేశారు. మనస్థాపానికి గురైన రామకృష్ణారెడ్డి షర్మిల నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీలో చేరారు. షర్మిల వెంట నడుస్తానని తేల్చి చెప్పారు. కానీ పది రోజులకే ఆయన వైసీపీలోకి తిరిగి వచ్చారు.
మంగళగిరిలో గంజి చిరంజీవి వెనుకబడ్డారని ప్రచారం జరుగుతోంది. అక్కడ మిగతా వైసీపీ నాయకులు ఆయన వ్యతిరేకిస్తున్నారని టాక్ నడుస్తోంది. మరోవైపు అక్కడ లోకేష్ ప్రభావం పెరగడంతో జగన్ లో ఒక రకమైన ఆందోళన కనిపిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో మంగళగిరిలో లోకేష్ ను ఓడించాలని వైసీపీ కృతనిశ్చయంతో ఉంది. అందుకే కాంగ్రెస్ లోకి వెళ్లి పోయిన సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిని తిరిగి రప్పించినట్లు తెలుస్తోంది. అక్కడ గంజి చిరంజీవిని తప్పించి ఆళ్ల రామకృష్ణారెడ్డికి టికెట్ ఇస్తారని జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే ఆళ్ల రామకృష్ణారెడ్డిని పక్కా వ్యూహంతోనే జగన్ తెప్పించినట్లు సమాచారం. ఆయనను తెప్పించింది మంగళగిరి కోసమే కానీ.. అక్కడ మాత్రం టికెట్ ఇవ్వడం లేదని తెలుస్తోంది.
గుంటూరు ఎంపీ స్థానానికి సంబంధించి గట్టి అభ్యర్థి జగన్ కు కనిపించడం లేదు. అక్కడ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు కుమారుడు వెంకటరమణను అభ్యర్థిగా ఖరారు చేశారు. కానీ ఆయన యాక్టివ్ గా పని చేయడం లేదు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టికెట్ ను ఆశించారు. అయితే జగన్ ఆ నియోజకవర్గాన్ని మంత్రి విడదల రజనీకి కేటాయించారు. దీంతో వెంకటరమణను గుంటూరు ఎంపీ స్థానానికి పంపించారు. అయితే ఈ పార్లమెంట్ స్థానం పరిధిలో టిడిపి బలంగా ఉంది. ఇక్కడ సరైన అభ్యర్థిని తెరపైకి తేవాలని జగన్ భావించారు. ఆళ్ల రామకృష్ణారెడ్డిని తిరిగి వైసీపీలోకి రప్పిస్తే.. అటు మంగళగిరి అసెంబ్లీ స్థానంతో పాటు గుంటూరు పార్లమెంట్ స్థానం దక్కించుకోవచ్చు అని జగన్ ప్లాన్ చేశారు. దాదాపు ఆళ్ల రామకృష్ణారెడ్డి అభ్యర్థిత్వాన్ని జగన్ ఖరారు చేసినట్లు సమాచారం. అయితే ఈ విషయం తెలుసుకున్న ఉమ్మారెడ్డి వెంకటరమణ అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. మొత్తానికైతే ఆళ్ల రామకృష్ణారెడ్డిని జగన్ అలా వాడుకున్నారన్నమాట.