Nadendla Counter: ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ విమర్శలు తారాస్థాయికి చేరుతున్నాయి. అధికార పార్టీ వైసీపీ జనసేన మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను చంద్రబాబు దత్త పుత్రుడిగా చెబుతూ సీఎం జగన్ చేస్తున్న విమర్శల నేపథ్యంలో జగన్ ను సీబీఐ దత్త పుత్రుడిగా పేర్కొనడం గమనార్హం. రాష్ట్రంలో అడుగడుగునా వైసీపీ ఎమ్మెల్యేల తీరు వివాదాస్పదంగా మారుతోంది. జనసేన నేతలపై సీఎం జగన్ చేస్తున్న అరాచకాలకు అడ్డు లేకుండా పోతోందని తెలుస్తోందని ఆరోపిస్తున్నారు.
రాష్ట్రంలో అధికారంలోకి రాకముందు ఇచ్చిన హామీల అమలులో సీఎం జగన్ విఫలమయ్యారని జనసేన నేతలు చెబుతున్నారు. అవేమీ పట్టించుకోకుండా ఇప్పుడు తమ పార్టీపై విమర్శలకు దిగడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్టీల మధ్య అగాధం పెరుగుతోంది. మేనిఫెస్టోలో చెప్పిన అంశాలను పట్టించుకోకుండా ఏవో కొన్నింటిని తెరమీదకు తీసుకొచ్చి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని చెప్పుకోవడం సిగ్గు చేటని జనసేన నేతలు విమర్శిస్తున్నారు.
Also Read: Vijay Devarakonda: విజయ్ దేవరకొండ కోసం పాకిస్తానీ అమ్మాయిగా పూజా హెగ్డే !
కేసులతో నిత్యం సీబీఐ చుట్టూ తిరిగే జగన్ కు పాలించే అర్హత లేదని జనసేన నేతలు మండిపడుతున్నారు. ప్రజలను సక్రమ దారిలో నడిపించే నేతనే అక్రమాలకు పాల్పడటం ఏమిటని అడుగుతున్నారు. అవినీతికి పెద్దపీట వేస్తూ నిత్యం ఏదో ఒక కేసులో సంతకాలు పెడుతూ ప్రజలకు ఏం చేస్తారని ప్రశ్నిస్తున్నారు. జగన్ తన అక్రమ సంపాదనతోనే కేసుల్లో ఇరుక్కున్నట్లు తెలుస్తోందన్నారు. ఇకనైనా ఇతర పార్టీల మీద సెటైర్లు వేయకుండా తన పార్టీని ప్రక్షాళన చేసుకోవాలని జనసేన నేతలు సూచిస్తున్నారు.
ఉద్యోగుల కోసం సీపీఎస్ రద్దు చేస్తామని చెప్పి ఇంతవరకు చేయలేదు. ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు రూ. 7 లక్షలు ఇస్తామని ఇంతవరకు ఇవ్వలేదు. రాష్ట్రాన్ని అప్పుల్లోకి నెట్టి అధికారం కోసం అర్రులు చాస్తున్నారన్నారు. భవిష్యత్ తో శ్రీలంకలో నెలకొన్న పరిణామాలు ఇక్కడ కూడా చోటుచేసుకుంటాయని రాజకీయ నిపుణులు ఇప్పటికే హెచ్చరిస్తున్నారు. దీనిపై వైసీపీ ఏం సమాధానం చెబుతుందో చూడాలని జనసేన నేత నాదెండ్ల మనోహర్ గుర్తు చేస్తున్నారు.
Also Read: TTD JEO Dharma Reddy:టీటీడీ జేఈవో ధర్మారెడ్డి కోసం వైసీపీ సర్కారు ఆరాటం.. అందాకా వెళ్లిందా?