https://oktelugu.com/

CM Jagan- Reddy Community: రెడ్డి సామాజికవర్గం వారికే కొలువులు, పదవులు, క్యాబినెట్ హోదాలు.. జగన్ తీరుపై విమర్శలు

CM Jagan- Reddy Community: వడ్డించే వాడు మనవాడైతే.. కడ పంక్తిలో ఉన్నా కడుపునిండా భోజనం దక్కుతుందన్న సామేత ఉంది. ఏపీలో వైసీపీ సర్కారుకు అచ్చు గుద్దినట్టు సరిపోతోంది. ప్రభుత్వంలో కీలకమైన పదవులతో పాటు ఉన్నతాధికారుల కొలువును తన సొంత సామాజికవర్గీయులకే కట్టబెట్టి జగన్ సామాజిక న్యాయం చేస్తున్నారు. చివరికి పార్టీ బాధ్యతలు కూడా రెడ్డి సామాజికవర్గీయులనే అప్పగించి నిజమైన సామాజిక న్యాయం చేస్తున్నారు. మంత్రి పదవుల్లో కీలకమైన పోర్టు పోలియోలను సైతం రెడ్డీలకే అప్పగించారు. 13 […]

Written By:
  • Dharma
  • , Updated On : June 21, 2022 2:51 pm
    Follow us on

    CM Jagan- Reddy Community: వడ్డించే వాడు మనవాడైతే.. కడ పంక్తిలో ఉన్నా కడుపునిండా భోజనం దక్కుతుందన్న సామేత ఉంది. ఏపీలో వైసీపీ సర్కారుకు అచ్చు గుద్దినట్టు సరిపోతోంది. ప్రభుత్వంలో కీలకమైన పదవులతో పాటు ఉన్నతాధికారుల కొలువును తన సొంత సామాజికవర్గీయులకే కట్టబెట్టి జగన్ సామాజిక న్యాయం చేస్తున్నారు. చివరికి పార్టీ బాధ్యతలు కూడా రెడ్డి సామాజికవర్గీయులనే అప్పగించి నిజమైన సామాజిక న్యాయం చేస్తున్నారు. మంత్రి పదవుల్లో కీలకమైన పోర్టు పోలియోలను సైతం రెడ్డీలకే అప్పగించారు. 13 జిల్లాల రాష్ట్రాన్ని నాలుగు విభాగాలుగా విభజించి పార్టీ బాధ్యతలను సైతం వారి చేతిలో పెట్టేశారు. సలహదారుల్లో కూడా ఆయన సామాజికవర్గీయులే అధికం. సొంత మీడియా సాక్షిలో పనిచేస్తున్న వారిని ఏకంగా సలహాదారులుగా నియమించుకున్నారు. పనిచేస్తున్నది సాక్షిలో అయినా.. వారికి జీతాలిస్తున్నది మాత్రం ఏపీ ప్రభుత్వమే. సలహదారుల జాబితా చాంతాడంత ఉంది. వారు ఎవరికి సలహాలు ఇస్తున్నారో. ఎవరు పాటిస్తున్నారో తెలియం లేదు. లక్షలకు లక్షల జీతాలు ..అంతే మొత్తంలో అలవెన్సులు వారి ఖాతాల్లోకి చేరిపోతున్నాయి. అంతటితో ఆగకుండా అసమ్మదీయులకు కేబినెట్ హోదా కల్పిస్తున్నారు.

    CM Jagan- Reddy Community

    CM Jagan

    తాజాగా ఇద్దరికి..
    తాజాగా ఆర్టీసీ చైర్మన్ మల్లిఖార్జున రెడ్డి, వైస్ చైర్మన్‌ చిన్నప్పరెడ్డిలకు కేబినెట్ హోదా కల్పిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. గత నెల 17న ఇందుకు సంబంధించి ప్రత్యేక జీవో జారీ చేశారు. నిజానికి జీవోలేమీ బయటకు రావడం లేదు. ప్రభుత్వం చాలా గోప్యత పాటిస్తోంది. చివరకు సొంత మీడియాలో కూడా ఏదో మూలన వార్త వేస్తున్నారు. గత మే పదిహేడో తేదీన ఏ జీవోజారీ చేశారు. ఇన్నాళ్లకు అది బయటకు వస్తుంది. సాధారణంగా కేబినెట్ హోదా ఉండేది ఆర్టీసీ చైర్మన్‌కు మాత్రమే . వైస్ చైర్మన్‌లకు డైరక్టర్లకు కూడా కేబినెట్ హోదా ఇవ్వడం కాస్త విచిత్రమే. అయితే .. ప్రభుత్వ పెద్దలకు బాగా కావాల్సిన వాళ్లు కావడంతో.. మంత్రి హోదా ఇచ్చేందుకు ఏ మాత్రం వెనుకాడలేదని తెలుస్తోంది. ఇప్పటికే నామినేటెడ్ పోస్టుల విషయంలో ఏపీ ప్రభుత్వం.. వైసీపీ అధినాయకత్వం తీరుపై తీవ్ర విమర్శలు ఉన్నాయి. పదే పదే ఒకే సామాజికవర్గానికి ప్రాధాన్యం ఇస్తున్నారన్న ఆరోపణలు వచ్చాయి. అయినప్పటికీ వైసీపీ పెద్దలు వెనక్కి తగ్గడం లేదు. ఇప్పటికి కేబినెట్‌లో ఉన్న మంత్రులు కాకుండా బయటకేబినెట్ హోదా ఇచ్చిన వారి సంఖ్యకు లెక్కే లేదు. సలహాదారుల్లో చాలా మందికి కేబినెట్ హోదా ఉంది. వారందరికీ ప్రజాధనం.. ఇతర అలవెన్స్ లు సిబ్బంది కేటాయించడం వల్ల కనీసం నెలకు ఆరేడు లక్షలు ఖర్చు వస్తుందన్న అంచనా ఉంది. వారంతా ఏం చేస్తారో తెలియదు కానీ.. కేబినెట్ హోదాను మాత్రం అనుభవిస్తున్నారు. బుగ్గ కారుతో పాటు ప్రోటోకాల్ ప్రకారం హెదాలను వెలగబెడుతున్నారు.

    Also Read: Mallemaala Entertainments: వాడుతున్న ‘మల్లె’ దండ.. వీడుతున్న నట పుష్పాలు

    కింది స్థాయిలో కూడా…
    రాష్ట్రస్థాయి కొలువుల మాట అటుంచితే.. చివరకు జిల్లా స్థాయి అధికారులు, రెవెన్యూ డివిజన్ ఆఫీసర్లు, పోలీస్ అధికారులు సైతం రెడ్డి సామాజికవర్గీయులే అధికం. నెల్లూరు నుంచి శ్రీకాకుళం వరకూ, అటు చిత్తూరు నుంచి అనంతపురం వరకూ రెడ్డి సామాజికవర్గానికి చెందిన వారినే నియమించారు. ఇదంతా వచ్చే ఎన్నికల్లో గట్టెక్కేందుకేనన్న విమర్శలు వచ్చినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. వివిధ సామాజికవర్గ కార్పొరేషన్ల కు పాలకవర్గాలను నియమించినా వారికి విధులు, నిధులు లేవు. అయితే ఆదాయం వచ్చే కీలక కార్పొరేషన్లకు మాత్రం సొంత సామాజికవర్గానికి చెందిన వారినే నియమించారన్న అపవాదు సీఎం జగన్ పై ఉంది. మరోవైపు రెడ్డి సామాజికవర్గానికి చెందిన ప్రజాప్రతినిధుల నియోజకవర్గాలకు, జిల్లాలకు నిధుల కేటాయింపులు కూడా అధికంగా ఉన్నాయి. ఇది వైసీపీలో కూడా చర్చనీయాంశమవుతోంది. తమ పట్ల వివక్ష చూపుతున్నారన్న వాదన ఉంది. కానీ అధిష్టాన పెద్దలు ఇవేవీ పట్టించుకోవడం లేదు.

    CM Jagan- Reddy Community

    Jagan

    సీనియర్లు కీనుక..
    అటు ప్రభుత్వంలో, ఇటు పార్టీలో కీలక పదవులు సీఎం సొంత సామాజికవర్గీయులకే అగ్రతాంబూలం వేయడంపై సీనియర్లు కీనుక వహిస్తున్నారు. ఉత్తరాంధ్ర బాధ్యతలను విజయసాయిరెడ్డిని తప్పించి వైవీ సుబ్బారెడ్డికి అప్పగించారు. అందుకు తగ్గ అర్హులం మేము కాదా అంటూ సీనియర్లు అయిన బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు వంటి వారు అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు. ఇటీవల చంద్రబాబు కూడా దీనిపైనే కామెంట్స్ చేశారు. విజయసాయిరెడ్డి పోతే వైవీసుబ్బారెడ్డి వచ్చారు. జగన్ భలే సామాజిక న్యాయం చేస్తున్నారంటూ చంద్రబాబు హాట్ కామెంట్స్ చేశారు. దానికి తగ్గట్టుగానే జగన్ వ్యవహార శైలి ఉందని వైసీపీ సీనియర్లు సైతం అభిప్రాయపడుతున్నారు. పార్టీని బలోపేతం చేసింది మేము.

    పార్టీ అభ్యర్థులను గెలిపించుకుంటుంది మేము. కొత్తగా రెడ్డి సామాజికవర్గం వారి పెత్తనం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే గన్నవరం నియోజకవర్గంలో టీడీపీని కాదని వైసీపీలో చేరిన ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ ను అక్కడి రెడ్డి నాయకులు చుక్కలు చూపిస్తున్నారు. కడప నుంచి వచ్చిన మీ పెత్తనం ఏమిటని వంశీ కౌంటర్ ఇస్తున్నారు. అంతటి తో ఆగకుండా తాను జగన్ కు నమ్మి వచ్చానని తేడా జరిగితే మాత్రం ఊరుకునేది లేదని హెచ్చరికలు సైతం చేశారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపారాలతో రెడ్డి సామాజికవర్గం వారు విస్తరిస్తున్నారు. ఈ పరిణామాలు వైసీపీతో పాటు ఇతర పార్టీలకు చెందిన నాయకులకు సైతం రుచించడం లేదు. ఇలాగే కొనసాగితే గత ఎన్నికల్లో టీడీపీ పై ఉపయెగించిన కమ్మ సామాజికవర్గం అస్త్రం తిరిగి సీఎం జగన్ కు తగలడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

    Also Read:Maharashtra Political Crisis: శివసేనలో చీలిక.. సంక్షోభంలో ‘మహా’ సర్కార్‌..

    Tags