CM Jagan: వైఎస్ జగన్.. ఆయన అనుకూల జనాలు సీఎం గురించి ఎలివేషన్లు ఇస్తుంటారు. ఎప్పుడూ రాజకీయమే ఆలోచిస్తారు. అయితే జగన్ ప్రత్యర్థుల ఎత్తుగడలను పసిగట్టలేరని అంటారు. అయితే అందులో నిజమెంతో తెలియదు కానీ, ప్రస్తుతం ఆయన నియోజకవర్గాల ఇన్‌చార్జీ విషయంలో వ్యవమరిస్తున్న తీరు మాత్రం అనుమానాలకు తావిస్తోంది ఎడాపెడా నియోజకవర్గ ఇన్‌చార్జీలను ఇష్టానుసారం మారుస్తున్న తీరుపై సొంత పార్టీల్లోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక ఈ వ్యవహారం జగన్ వ్యతిరేక మీడియాకు కోతికి కొబ్బరిచిప్ప దొరికినట్లు అవుతోంది. బలంగా ఉన్న జగన్ వ్యతిరేక మీడియా గోరంతలను కొండతలు చేసి చూసుతోంది. అదే సమయంలో టీడీపీ, జనసేనలో అంతర్గత వ్యతిరేకతను మాత్రం ఎలివేట్ చేయడం లేదు.
నియోజకవర్గ ఇన్‌చార్జే అభ్యర్థి..
ఏపీలో వైసీసీ నియోజకవర్గ ఇన్‌చార్జి అభ్యర్థి అని జగన్ ఇప్పటికే ప్రకటించారు. ఇలా ఇప్పటికే సగం నియోజకవర్గాల ఇన్‌చార్జీలను మార్చారు. కొందరిని పక్క నియోజకవర్గాలకు బదిలీ చేయగా, ఇంకొందరిని తప్పించారు. కొందరికి ఎంపీ సీట్లు, కొందరు ఎంపీలకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని నిర్ణయించారు. ఇంతరవకు బాగానే ఉంది. అయితే ఇన్‌చార్జిని ప్రకటించిన వారం పది రోజులకే మళ్లీ మార్చడం ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశం అవుతోంది. ఇలా ఇప్పటికే పది మంది వరకు ఇన్‌చార్జీలను మార్చారు.
ఖర్చు పెట్టకున్నాక మార్పు..
నియోజకవర్గ ఇన్‌చార్జిగా పనిచేసుకోమని చెప్పాక నేతలు పోటీకి సద్దమవుతున్నారు. ఇందుకోసం భారీగా ఖర్చు పెడుతున్నారు. క్యాడర్‌ను మచ్చిక చేసుకుంటున్నారు. ఇంతలోనే తాడేపల్లి సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచి పిలుపు వస్తోంది. అన్నీ సెట్ చేసుకున్నాక.. నిన్ను వేరే నియోజకవర్గానికి మారుస్తున్నాం.. అక్కడ పనిచేసుకోండి అని సూచిస్తున్నారు. దీంతో అభ్యర్థులతోపాటు క్యాడర్‌లో అయోమయం కలుగుతోంది. ఒకసారి ఇచ్చిన వారిని మార్చేస్తే వాళ్లు అలగడం, ఇవన్నీ కలిసి ఓ ప్రహసనంగా మారుతున్నాయి. దీంతో ప్రతిపక్ష అనుకూల మీడియా దీనిని హైలేట్ చేస్తోంది.
అన్నీ తెలిసి మొండిగా..
రాజకీయాల్లో ప్రజల అండ ఎంత అవసరమో మీడియా మద్దతు కూడా అంతే ఉండాలి. జగన్ తనకు ప్రజల అండ ఉందని భావిస్తున్నారు. కానీ మీడియా సపోర్టు పెద్దగా లేదు. సొంత మీడియా ఉన్నా.. దానిని ఎవరూ పట్టించుకోవడం లేదు. అయినా జగన్ అస్సలు జాగ్రత్త పడడం లేదు. వెళ్లిపోతే పోండి. ఎవరు ఎలా రాసుకుంటే నాకేంటి అన్నట్లు వ్యవహరిస్తున్నారు. అన్నీ తెలిసి కూడా ఇలా ఇష్టానుసారం అభ్యర్థులను మార్చడం విమర్శలకు తావిస్తోంది. జనంలోనూ గందరగోళం ఏర్పడుతోంది.
క్యాడర్‌లో అయోమయం..
ఇష్టానుసారం ఇన్‌చార్జీలను మారుస్తుండడంతో క్యాడర్ కూడా ఎవరికి మద్దతు తెలుపాలో తెలియక గందరగోళంలో ఉంటోంది. టికెట్లు ఇచ్చే వరకు తమ నియోజవర్గ ఇన్‌చార్జి పోటీ చేస్తాడా లేదా అన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు మంగళగిరి నియోజకవర్గమే మంచి ఉదాహరణ. అక్కడ టీడీపీ నుంచి లోకేష్ పోటీ చేయనున్నారు. ఇక జగన్ గతంలో ఆళ్ల రామకృష్ణారెడ్డిని బరిలో నిలిపి లోకేష్‌ను ఓడించారు. ఇప్పుడు మరో ఇన్‌చార్జిని నియమించారు. సర్వే ఫలితాలు అతనికి అనుకూలంగా లేవని ఇప్పుడు ఓ మహిళను ఇన్‌చార్జిని చేశారు. ఇలా మార్చడంపై స్థానికంగానూ వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
అభ్యర్థులు అంతంత మాత్రమే..
జగన్ ఒక్కటే ఆలోచన చేస్తున్నట్లు కనిపిస్తోంది. జనం తనను చూసే తన పార్టీ అభ్యర్థులను గెలిపిస్తాడన్న ధీమాతో ఉన్నారు. కేసీఆర్ కూడా తెలంగాణలో ఇలాగే వ్యవహరించారు. అభ్యర్థులపై ఎంత వ్యతిరేకత ఉంటే ఏంటి.. తనను చూసి ఓట్లు వేస్తారు అనుకున్నారు. కానీ 2023 ఎన్నికల్లో దెబ్బ తగిలింది. ఇప్పుడు జగన్ కూడా కేసీఆర్ బాటలోనే నడుస్తున్నారు. ఇది మొదటికే మోసం తెస్తుందని పొలిటికల్ ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు.