CM Jagan: ఏపీలో పెద్ద ఎత్తున అభ్యర్థులను మార్చుతూ జగన్ సంచలనాలకు తెర లేపుతున్నారు. వీలైనంత త్వరగా రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్థులను మార్చి ప్రకటించాలని భావిస్తున్నారు. ప్రజల్లో వ్యతిరేకత ఉన్న వారిని పక్కన పెడుతున్నారు. తప్పదు అన్నవారికి స్థానచలనం కల్పిస్తున్నారు. అయితే సరికొత్త ప్రయోగాన్ని సంధిస్తున్నారు. మంత్రులను ఎంపీలుగా.. ఎంపీలను ఎమ్మెల్యేల అభ్యర్థులుగా మార్చేందుకు కసరత్తు చేస్తున్నారు. సీట్లు దక్కని వారికి పిలిపించిమాట్లాడుతున్నారు. ప్రత్యామ్నాయ అవకాశాల గురించి చెప్పుకొస్తున్నారు. విన్నవారు పార్టీలో కొనసాగేలా ఏర్పాటు చేస్తున్నారు. బయటకు వెళ్తున్న వారికి అభ్యంతరాలు వ్యక్తం చేయడం లేదు. మొత్తానికైతే అభ్యర్థులను మార్చి విజయం అందుకోవాలని నిశ్చయంతో జగన్ ఉన్నారు.
జనవరి నుంచి పింఛన్ మొత్తాన్ని 3 వేలకు పెంచనున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని భావిస్తున్నారు. అదే వేదికల నుంచి అభ్యర్థుల మార్పు విషయాన్ని ప్రకటించడానికి కసరత్తు చేస్తున్నారు. రాయలసీమలో ఈసారి పెను మార్పులకు నాంది పలికారు. కడప ఎంపీ అవినాష్ రెడ్డి ని ఈసారి జమ్మలమడుగు అసెంబ్లీ నుంచి పోటీ చేయిస్తారని తెలుస్తోంది. కడప ఎంపీగా వైయస్ కుటుంబం నుంచి ఓ వైద్యుడిని బరిలో దించుతారని సమాచారం. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి పోటీపై స్పష్టత రావాల్సి ఉంది. ఒంగోలు ఎమ్మెల్యేగా తిరిగి బాలినేని పోటీ చేస్తారని ప్రచారం జరుగుతుంది. మాజీ క్రికెటర్ అంబటి రాయుడు ను గుంటూరు ఎంపీగా పోటీ చేయిస్తారని టాక్ నడుస్తోంది. ఎమ్మిగనూరు టిక్కెట్లు సిట్టింగ్ ఎమ్మెల్యే కేశవరెడ్డికి తప్పించి బుట్టా రేణుకకు ఇస్తారని తెలుస్తోంది. కర్నూలు ఎంపీగా ఒక మంత్రి పేరు ఖాయమైనట్లు సమాచారం.
హిందూపురం ఎంపీగా కొత్త అభ్యర్థిని బరిలో దించుతారని తెలుస్తోంది. సిట్టింగ్ ఎంపీ గోరంట్ల మాధవ్ విషయంలోఎటువంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. ఆయన స్థానంలో కర్ణాటక నేత బళ్లారి శ్రీరాములు సోదరిని పోటీ చేయిస్తారని తెలుస్తోంది. తీవ్ర తర్జనభర్జన నడుమ మైలవరం నుంచి తిరిగి వసంత కృష్ణ ప్రసాద్ ని పోటీ చేయిస్తారని టాప్ నడుస్తోంది. విజయవాడ, ఏలూరు ఎంపీ అభ్యర్థిగా బీసీ వర్గాలకు అవకాశం ఇచ్చేందుకు జగన్ మొగ్గు చూపుతున్నారు. ఆర్థికంగా బలమైన అభ్యర్థులను రంగంలోకి దిస్తే ఆ రెండు స్థానాలను కైవసం చేసుకునే ఛాన్స్ ఉందని భావిస్తున్నారు.
ఇప్పటికే 11 మంది అభ్యర్థులను మార్చారు. ఆ జాబితా 80 మంది వరకు ఉంటుందని ప్రచారం జరుగుతోంది. అయితే 30 మందిని మాత్రం తప్పకుండా మార్చుతారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఎంపీలు 11 మందిని ఎమ్మెల్యేలుగా పోటీ చేయిస్తారని తెలుస్తోంది. కాకినాడ ఎంపీ వంగా గీతను పిఠాపురం నుంచి, రాజంపేట ఎంపీ మిధున్ రెడ్డిని పీలేరు నుంచి అసెంబ్లీకి పోటీ చేయిస్తారని సమాచారం. మిధున్ రెడ్డి మాత్రం తాను ఎంపీ గానే ఉండేందుకు ఇష్టపడుతున్నారు. అయితే జగన్ ఆలోచన వేరేలా ఉంది. మిదున్ స్థానంలో ఆయన తండ్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని పోటీ చేయిస్తారని తెలుస్తోంది. రాజమండ్రి ఎంపీ మార్గాన్ని భరత్ ను రాజమండ్రి అర్బన్ నుంచి ఖరారు చేశారు. మొత్తానికైతే అభ్యర్థుల మార్పు విషయంలో జగన్ ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. పెన్షన్ పెంపు కార్యక్రమాల్లో భాగంగా ఖరారు చేసిన అభ్యర్థుల పేర్లు ప్రకటించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.