AP Cabinet Reshuffle: మంత్రివర్గ విస్తరణ గడువు ముంచుకొస్తోంది. మరో 48 గంటల వ్యవధే ఉంది. దీంతో సీఎం జగన్ మంత్రుల జాబితాను వడబోస్తున్నారు. తనకు అత్యంత నమ్మకస్థుడైన సజ్జల రామక్రిష్టారెడ్డితో మాత్రమే చర్చిస్తున్నారు. ఇప్పటికే ఇంటలిజెన్స్ వర్గాల నుంచి నివేదికలు తెప్పించుకున్నారు. ఎవరిని కేబినెట్ తీసుకుంటే.. రాజకీయంగా ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి.. తీసుకోకపోతే వచ్చే సమస్యలు ఏంటి.. ఆయా జిల్లాల వారిగా సామాజిక సమీకరణాలు ఏంటి అన్నదానిపైనే లెక్కలు వేసుకున్నట్టు సమాచారం.

ప్రస్తుతానికి పాలనను పక్కన పడేసి ఈ కసరత్తులోనే మునిగి తేలుతున్నారు. ఆదివారం సాయంత్రానికి తుది జాబితా సిద్ధం చేసే అవకాశం ఉంది. అయితే కొత్తగా కేబినెట్ లో చేరబోయే మంత్రులకు మాత్రం.. ఒక రోజు ముందే సమాచారం అందిస్తారని తెలుస్తోంది. అప్పటి వరకూ అటు తాజా మాజీల్లో, ఇటు అశావహుల్లో ఉత్కంఠ తప్పదు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. దాదాపు 10 మంది వరకు పాత మంత్రులను కొనసాగించే వీలు ఉంది అంటున్నారు. అయితే ఇఫ్పుడు పాత వారిలో ఎవర్ని కొనసాగించాలి అన్నదే పెద్ద సమస్యగా మారింది అంటున్నారు. ఓ పదిమందిని కొనసాగించి.. మిగిలిన వారి తప్పిస్తే.. ఎలాంటి సంకేతాలు వెళ్తాయి.. సామాజిక సమీకరణాల ప్రకారం ఎలాంటి విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కేవలం సమాజిక సమీకరణాలనే ప్రామాణికంగా తీసుకుంటే.. పాలనలో ఏదైనా తేడా జరిగితే మొదటికే వస్తుందనే అనుమానాలు పెరుగుతున్నాయి.
Also Read: Frustration: జగన్ ఫ్రస్టేషన్ పీక్స్.. ‘వెంకీ’ ఆసనం వేయాల్సిందేనా?
సీనియర్లను తప్పిస్తే ఉపద్రవమే
ఇప్పుడున్న సంక్లిష్ట పరిస్థితుల్లో ఎలా ముందుకు వెళ్లాలి అన్నదానిపైనే సీఎం సుదీర్ఘంగా కసరత్తు చేస్తున్నారు. ముందు అనుకున్నట్టు మంత్రులందర్నీ మారిస్తే ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యే ప్రమాదాన్ని జగన్ పసిగట్టారని తెలుస్తోంది. ఉదాహరణకు విజయనగరం జిల్లాకు చెందిన బొత్స సత్యనారాయణను పక్కన పెట్టి.. రాజకీయ ప్రత్యర్థి కోలగట్ల వీరభద్రస్వామికి చాన్స్ ఇస్తే బొత్స తన ప్రతాపాన్ని చూపే అవకాశముంది.
ఇటు విజయనగరం, అటు పార్వతీపురం మన్యం జిల్లాల పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో పట్టుంది. గత మూడేళ్లుగా మంత్రిగా ఉన్నా ఏమంత ప్రయోజనం, స్వేచ్ఛ లేకుండా పోయిందన్న బాధలో బొత్స ఉన్నారు. ఈ సమయంలో కేబినెట్ లో చోటు దక్కకపోతే ఆ ప్రభావం ఉభయ జిల్లాల్లో 12 నియోజకవర్గాల్లో ఓటమికి కంకణం కట్టుకుంటారన్నభయం మాత్రం అధిష్టానంలో ఉంది. సీనియర్ మంత్రులు ఉన్న అన్ని జిల్లాల్లో ఇదే పరిస్థితి. తనను చూసి ఓటు వేస్తారన్న నమ్మకం సీఎం జగన్ లో పట్టు సడలుతోంది. ఈ పరిస్థితుల్లో స్థానిక నాయకత్వాన్ని దూరం చేసుకుంటే పుట్టి మునగడం ఖాయమని తేలడంతో జగన్ పనరాలోచనలో పడినట్టు తెలుస్తోంది.
సంఖ్యా బలమే అసలు భయం
వాస్తవానికి 151 మందికిగాను దాదాపు 100 మందిపై తీవ్ర ప్రజా వ్యతిరేకత ఉంది. సర్వేల్లో, నివేదికల్లో ఇది తేటతెల్లమవుతోంది. అక్కడ పరిస్థితిని చక్కదిద్దడం సీఎం జగన్ ముందున్న కర్తవ్యం. కానీ అది వదిలి మంత్రివర్గ విస్తరణ తేనె తుట్టను కదిల్చి అందులో జగన్ చిక్కుకున్నారు. ఇప్పటికే అన్ని జిల్లాల నుంచి నివేదికలు రావడంతో.. ఎమ్మెల్యేల పరిస్థతి చూసి బెంబేలెత్తిపోయారు. మరోవైపు సీనియర్ల హెచ్చరికలు, అలకపాన్నులు చూసి తెగ ఆందోళనకు గురయ్యారు. సంఖ్యా బలంగా 151 మంది ఎమ్మెల్యేలను చూసి మురిసిపోయిన అధినేత.. ఎక్కడ ఆ సంఖ్య తగ్గుముఖం పడుతుందోనన్న బాధ వారిని వెంటాడుతోంది. తన సొంత పార్టీలో పరిణామాలతో ప్రస్టేషన్ కు గురవుతున్న సీఎం విపక్ష నాయకులపై నోరు పారేసుకుంటున్నారు. వారి మరణాన్ని సైతం కోరుకుంటున్నారు.

ఎందుకొచ్చింది గొడవ.. ఆ సీనియర్ మంత్రులను కొనసాగిస్తే పార్టీలో కాస్తా రిలక్షేషన్ దక్కుతుందన్న నిర్ణయానికి వచ్చేశారు. అయితే ఎవర్ని కొనసాగించి.. ఎవర్ని పక్కన పెడతామన్నదే ఇప్పుడు చర్చ. అందుకే పార్టీలో ఏ2గా ఉన్న విజయసాయిరెడ్డి, సమీప బంధువులు ఎవర్నీ కాదని సజ్జల రామక్రిష్టారెడ్డితోనే చర్చిస్తున్నారు. అలకపాన్పు ఎక్కిన సీనియర్లతో మాట్లాడే బాధ్యతలను ఆయనకే అప్పగిస్తున్నారు. కొత్త మంత్రులు ఎవరనేదానిపై కేవలం వైసీపీ వర్గాలే కాదు.. విపక్షాలు సైతం ఆశగా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. అయితే ఈ సారి కొత్తవారికి బాగానే ఛాన్స్ ఇస్తారని టాక్ వినిపిస్తోంది. పాత మంత్రుల్లో ఎవరెవరిని కొనసాగించాలి.. కొనసాగించడం వల్ల పార్టీకి.. ప్రభుత్వానికి ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి.. ఎక్కువ మంది పాతవారిని కొనసాగిస్తే.. కొత్తగా పదవులు ఆశిస్తున్న వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. అప్పుడు వారు నిరాశకు గురయ్యే అవకాశాలు ఎంత వరకు ఉన్నాయి. ఇలా ప్రతి అంశాన్ని పూర్తిగా పరిశీలిస్తున్న సీఎం జగన్ ఆచీతూచి నిర్ణయానికి వస్తున్నారు. ఆశావాహుల నుంచి వస్తున్న అభ్యర్థనలు, ప్రచారంలో ఉన్న పేర్లపై వస్తున్న అభ్యంతరాలపై లోతుగా చర్చిస్తున్నారు.