CM Jagan : ఏపీ సీఎం జగన్ రూటు మార్చారు. ఒక్క బటన్ నొక్కుడుతోనే జయించలేనని గుర్తించారు. సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి చేస్తేనే నెగ్గగలమని ఎట్టకేలకు ఒక స్థిర నిర్ణయానికి వచ్చారు. పథకాలు తీసుకోవడమే కాదు.. ప్రగతి గురించి ఆలోచించే ప్రజలు ఉన్నారని గుర్తెరిగారు. ఈ ఏడాదిలో తాను మారి చూపకుంటే ప్రజలే తనను మార్చేస్తారని గమనించారు. అందుకే ఇప్పుడు అభివృద్ధి అంటూ రంకెలు వేయడం ప్రారంభించారు. వరసబెట్టి ఆయన శంకుస్థాపనలు చేస్తూ వస్తున్నారు. గత నెలలో శ్రీకాకుళంలోని మూలపేట పోర్టుకు శంకుస్థాపన చేసిన జగన్ ఇపుడు భోగాపురం వద్ద గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టుకు శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో జగన్ తన మాటతీరును కూడా మార్చుకున్నారు. అభివృద్ధి అంటూ కొత్తపల్లవి అందుకున్నారు.
కౌంటర్ అటాక్..
మొన్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి,పార్టీలో ధిక్కార స్వరాలు, చుట్టుముడుతున్న కేసులతో ఇక జగన్ పని అయిపోయిందంటూ కామెంట్స్ వినిపించాయి. అయితే దానికి జగన్ కౌంటర్ ఇవ్వడం ప్రారంభించారు. ఎయిర్ పోర్టు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన అనంతరం కీలక వ్యాఖ్యలు చేశారు. అవి పొలిటికల్ గా హీటెక్కించే విధంగా ఉన్నాయి. ప్రాజెక్టు నిర్మాణానికి జీఎమ్మార్ సంస్థ మూడేళ్లు పడుతోందని చెప్పిందని.. కానీ దానిని రెండున్నరేళ్లలో పూర్తిచేయాలని కోరినట్టు గుర్తుచేశారు. 2026లో ఈ ప్రాజెక్ట్ తొలి దశ పూర్తి అవుతుందని…రోజున తానే మళ్ళీ ముఖ్యమంత్రిగా ఇదే భోగాపురం వచ్చి ప్రారంభిస్తాను అని చెప్పడం విశేషం. మరో ఏడాదిలో ఏపీలో సార్వత్రిక ఎన్నికలు రాబోతున్నాయి. 2024 మే నెలలో ఏపీలో ఎన్నికలు ఉంటాయి. అంటే గట్టిగా ఏడాది ఉంది.ఇక 2026 అంటే ఇప్పటికి మూడేళ్ళు ఉంది. అంటే జగన్ భోగాపురం ఎయిర్ పోర్టు పూర్తి అయిన తరువాత ప్రారంభిస్తాను అని అంటున్నారు అంటే 2024లో తానే మళ్లీ గెలిచి అధికారంలో ఉంటాను అని గట్టిగానే చెప్పారన్న మాట.
విపక్షాలపై ఫైర్..
విపక్షాలు పనిగట్టుకొని ప్రచారం చేస్తున్నాయని అంటూ.. వాటికి సవాల్ విసిరారు. తనకు ప్రజల ఆశీర్వాదం దేవుడి చల్లని దీవెనలు ఉన్నాయని చెబుతున్నారు. ఎల్లో మీడియాను నమ్ముకొని చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని.. నాలుగేళ్లలో తాను చేసిన అభివృద్ధి ప్రతి ఇంట్లో కనిపిస్తోందన్నారు. అందుకే తాను ధైర్యంగా ఓట్లు అడగగలుగుతున్నానని చెప్పారు. నాలుగు దశాబ్దాల రాజకీయం చేసిన చంద్రబాబు నాలా ఉండగలరా అని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని చంద్రబాబు అండ్ కో అడ్డంగా దోచుకుందని ఆరోపించారు. తాను బటన్ నొక్కి ప్రజల అకౌంట్లోకి డబ్బులు వేస్తుంటే.. నాడు నిలువు దోపిడీకి పాల్పడ్డారని చెప్పారు.
ఆ అపవాదుతో..
ఏపీలో గత నాలుగేళ్లుగా అభివృద్ధి లేదు. ఇంటా బయటా ఇప్పుడు ఇదే చర్చనీయాంశంగా మారింది. పొరుగు రాష్ట్రాల ప్రముఖులు వచ్చినప్పుడు ఇదే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఏపీలో అభివృద్ధి లేదన్న అపవాదు విస్తరిస్తోంది. అది ప్రభుత్వానికి మైనస్ గా మారింది. దీంతో అధికార పార్టీ కలవరం చెందుతోంది. మొన్నటికి మొన్న రజనీకాంత్ చంద్రబాబును పొగిడారు. ఏపీ ప్రభుత్వానికి కానీ.. జగన్ కు కానీ అస్సలు ఏమీ అనలేదు. చంద్రబాబు అభివృద్ధి బాగాచేశారని చెప్పడంతో వైసీపీ బ్యాచ్ రగలిపోయింది. రాజుగారి మొదటి భార్య బాగుంది అంటే రెండో భార్య బాగాలేదన్న అర్ధం వచ్చేలా మాట్లాడారంటూ రజనీకాంత్ ను వెంటాడి వేటాడి దూషణల పర్వానికి దిగారు. మున్ముందు ఇలాంటి విమర్శలు వస్తాయని తెలుసు కనుక జగన్ కూడా జాగ్రత్తపడ్డారు. అభివృద్ధి నినాదాన్ని అందుకున్నారున్న మాట.