ఆంధ్రప్రదేశ్ మఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన జగన్ ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా బలమైన ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ నుంచి అనేక సవాళ్లను ఛేదించుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ప్రభుత్వంపై ప్రతిపక్షాలతో పాటు ప్రజల నుంచి వ్యతిరేకత రాకుండా ఉండడానికి సీఎంగా జగన్ ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇందు కోసం జగన్ పెద్దన్న పాత్ర వహించక తప్పడం లేదు. ప్రభుత్వ పాలన సక్రమంగా సాగాలంటే ముఖ్యమంత్రి ఒక్కరే పనిచేస్తే సరిపోదు. అందుకు టీం మొత్తం కరెక్ట్ గా ఉండాలి. అందుకు జగన్ కొన్ని కఠిన నిర్ణయాలే తీసుకుంటున్నారు. ప్రజా శ్రేయస్సు కోసం సొంత పార్టీ ఎమ్మెల్యేలైనా సరే బాధత్య విస్మరిస్తే కఠిన చర్యలు తప్పవన్నట్లు పనిచేస్తున్నారు.
2019లో 151 ఎమ్మెల్యేలతో తిరుగులేని విజయాన్ని అందుకున్న జగన్ ఆ తరువాత అనేక అడ్డంకులు ఎదుర్కొంటున్నాడు. ముఖ్యంగా ప్రజలు ఫలానా సమస్యతో బాధపడుతున్నారని తెలుసుకోగానే అందుకు సరైన పథకాలను ప్రవేశపెడుతూ వారి బాగోగుల వైపు వెళ్తున్నాడు. అయితే ఇక్కడ ప్రజా కార్యక్రమాలు సక్రమంగా నిర్వహించడానికి సీఎం కఠినంగా వ్యవహరించక తప్పడం లేదు. అందులో సొంత పార్టీ ప్రజాప్రతినిధులైనా సరే సీరియస్ యాక్షన్ తీసుకోవాడనికి వెనుకాడడం లేదట.
ఇప్పటికే జగన్ మంత్రులను, ఎమ్మెల్యేలను నమ్మకుండా ఇంటెలిజెన్స్ ద్వారా ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెప్పించుకుంటున్నాడట. ప్రభుత్వ పథకాలు ప్రజలకు నేరుగా అందించడానికి దేశంలో ఎక్కడా లేని విధంగా వలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీంతో కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు వలంటీర్లు తమను పట్టించుకోవడం లేదని లోలోపన విమర్శలు చేస్తున్నా.. వాటికి ఏమాత్రం బెదరకుండా తాను అనుకున్నది చేసేస్తున్నాడు.
ఇదిలా ఉండగా త్వరలో జగన్ పార్టీ సీనియర్లతో ఓ కమిటీని వేయనున్నాడట. ఈ కమిటీ ఎమ్మెల్యేల పనితీరును అధ్యయనం చేస్తూ ఎప్పటికప్పుడు సమాచారాన్ని చేరవేరుస్తుందట. వారి పనితీరులో ఏమాత్రం తేడా ఉన్నా వారికి మరో అవకాశం ఇస్తారట. అయితే అప్పటికీ తీరు మారకపోతే మాత్రం గట్టి చర్యలు తీసుకునే అవకాశం ఉందని చర్చించుకుంటున్నారు. ఎందుకంటే కొందరి ప్రజాప్రతినిధుల వల్ల ప్రభుత్వానికి, పార్టీకి చెడ్డపేరు రాకుండా ముందే జాగ్రత్త పడుతున్నారు. మరి ఈ కమిటీ నివేదిక ద్వారా ఎంతమంది ఎమ్మెల్యేల జాతకాలు బయటపడుతాయోనని అనుకుంటున్నారు. ఏదీ ఏమైనా జగన్ ప్రభుత్వాన్ని సక్రమంగా సాగించడానికి వినూత్న పద్ధతుల ద్వారా ముందుకు సాగుతున్నారని అనుకుంటున్నారు.