Kolusu Parthasarathy: మాజీ మంత్రి కొలుసు పార్థసారథికి సీఎం జగన్ షాక్ ఇచ్చారు. అందరూ ఊహిస్తున్నట్టే ఆయనకు టిక్కెట్ లభించలేదు. పెనమలూరు నియోజకవర్గ ఇన్చార్జిగా మంత్రి జోగి రమేష్ ను నియమించారు. కొలుసు పార్థసారథి పార్టీ నుంచి వీటడం ఖాయంగా తేలింది. అయితే మిగతా నేతలకు విరుద్ధంగా పార్థసారథి విషయంలో వైసిపి హై కమాండ్ హైరానా పడుతోంది. జగన్ కు అత్యంత సన్నిహితులైన ఆళ్ల రామకృష్ణారెడ్డి, కాపు రామచంద్రారెడ్డి పార్టీని వీడినా పెద్దగా పట్టించుకోలేదు. కానీ పార్థసారథి విషయంలో మాత్రం వీలైనంత వరకు పార్టీలో కొనసాగేలా చూడాలని కీలక నేతలకు బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం.
కొలుసు పార్థసారథి సీనియర్ బీసీ నాయకుడు. యాదవ సామాజిక వర్గానికి చెందినవారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి క్యాబినెట్లో మంత్రిగా పనిచేశారు. 2014 ఎన్నికల సమయంలో పార్థసారథి వైసీపీలోకి వచ్చారు. 2017 లో వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని హైదరాబాద్ నుంచి విజయవాడకు మార్చినప్పుడు స్థలం ఇచ్చింది కూడా పార్థసారథే. అప్పుడు ఆయనకు అద్దె కూడా ఇవ్వలేదని.. కార్యాలయ నిర్వహణ ఖర్చులను సారథే భరించేవారని ఇప్పటికీ చెబుతుంటారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్థసారథి అనుకున్నంత సంతృప్తిగా లేరు. జగన్ క్యాబినెట్లో చోటు ఇవ్వకపోవడంతో బాధపడ్డారు. ఇప్పుడు టిక్కెట్ ఇవ్వకపోవడంతో తన దారి తాను చూసుకోవాలని నిర్ణయించుకున్నారు.
పార్థసారధి ఈనెల 18న చంద్రబాబు సమక్షంలో టిడిపిలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసుకున్నట్లు సమాచారం. టిడిపిలో చేరితే పెనమలూరు టికెట్ సారధికి దక్కే అవకాశం ఉంది. ఈ మేరకు ఆయనకు చంద్రబాబు హామీ ఇచ్చినట్లు సమాచారం. ఇప్పటికే వైసీపీ జోగి రమేష్ ను ఇంచార్జిగా నియమించడంతో బలమైన అభ్యర్థి టిడిపికి అవసరం. అందుకే అక్కడ టిడిపి ఆశావహుడుగా ఉన్న బోడె ప్రసాద్ ను తప్పించి పార్థసారధికి టికెట్ ఇస్తారని తెలుస్తోంది. అయితే పార్థసారథి యాదవ సామాజిక వర్గానికి చెందినవారు కావడంతో వైసిపి లో ఒక రకమైన ఆందోళన కనిపిస్తోంది. ఆయన కానీ పార్టీని వీడితే ఆ ప్రభావం ఒక్క పెనమలూరు లోనే కాదు. పామర్రు, మచిలీపట్నం, గుడివాడ, ఏలూరు ప్రాంతాల్లో పడే ప్రమాదం ఉంది. అందుకే కీలక నేతలు వీలైనంతవరకు పార్థసారధిని టిడిపిలోకి వెళ్లకుండా కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నారు.