విశాఖపట్నం పరిపాలన రాజధానిగా చేసేందుకు సీఎం కార్యాచరణ ప్రారంభించినట్లు తెలుస్తోంది. అమరావతిలోని తాడేపల్లి క్యాంపు కార్యాలయాన్నితరలించేందుకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ముఖ్యమంత్రి జగన్ కార్యాలయం తరలింపుతో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకునేందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ఇందులో భాగంగా పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తోంది. గ్రేటర్ విశాఖ పరిధిలోని జోనల్ కమిషనర్లుగా ఐఏఎస్ అధికారులను నియమిస్తోంది. తాజాగా జిల్లాస్థాయిలో ఐఏఎస్ అధికారుల బదిలీలను చేయడానికి నిర్ణయించింది. విశాఖపట్నం కలెక్టర్ గా గంధం చంద్రుడును నియమించనున్నట్లు తెలిసింది. వచ్చే రెండు రోజుల్లో ఉత్తర్వులు వెలువడనున్నట్లు సమాచారం.
అనంతపురం జిల్లా కలెక్టర్ గా పనిచేసిన గంధం చంద్రుడును ప్రభుత్వం అక్కడి నుంచి బదిలీ చేసి గ్రామ సచివాలయాల విభాగం డైరెక్టర్ గా నియమించింది. కానీ ఆ ఉత్తర్వుల్లో సవరణలు చేసి ఆ పోస్టులో షాన్ మోహన్ ను నియమించేందుకు నిర్ణయించింది. విశాఖపట్నం కలెక్టర్ గా ఉన్న వినయ్ చంద్ ను సీఎం కార్యాలయానికి బదిలీ చేస్తారని ప్రచారం సాగుతోంది.
విశాఖపట్నం మీద అవగాహన ఉన్న ఆయనను సీఎంవో లోకి తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఖాళీగా ఉన్న ఈస్టర్న్ పవర్ డిస్ర్టిబ్యూషన్ కంసోని సీఎండీగా కూడా వినయ్ చంద్ ను బదిలీ చేస్తారని తెలుస్తోంది. ఈపీడీసీఎల్ సీఎండీగా పనిచేసిన నాగలక్ష్మిని అనంతపురం కలెక్టర్ గా నియమించనున్నారు.
విశాఖ కార్పొరేషన్ కమిషనర్ గా ఉన్న గుమ్మళ్ల సృజనను కూడా బదిలీ చేస్తారని ప్రచారం సాగుతోంది. సృజన స్థానంలో మరో అధికారిని నియమిస్తారని చెబుతున్నారు. జీవీఎంసీ పరిధిలోకి కొత్త ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం నియమించే అవకాశాలున్నాయని సమాచారం. ప్రస్తుతం నెలకొన్న పరిణామాలను చూస్తుంటే సీఎం జగన్ యువ ఐఏఎస్ టీమ్ ను ఏర్పాటు చేసుకునేందుకు సమాయత్తమవుతున్నట్లు సమాచారం.