
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పదవీబాధ్యతలు చేపట్టిన తరువాత పెద్దగా ప్రజల్లోకి వెళ్లిన సందర్భాలు లేవు. తొలి ఏడాది పాలనపై దృష్టి పెట్టిన తరువాత కరోనా వైరస్ తో జిల్లాల పర్యటనకు బ్రేక్ పడింది. దీంతో జగన్ తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయానికే పరిమితం అయ్యారు. దాదాపు 20 నెలల నుంచి జగన్ పెద్దగా జిల్లాలలో పర్యటించిన సందర్భాలు లేవు. మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి సైతం జగన్ దూరంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రజల్లోకి వెళ్లేందుకు జగన్ సిద్ధం అవుతున్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పర్యటించేందు రెడీ అవుతున్నారు.
అయితే పాలననకు రెండేళ్లు పూర్తి కావొస్తున్న సందర్భంగా జగన్ జిల్లాల పర్యటన చేయాలని నిర్ణయించారు. అసెంబ్లీ సమావేశాలు ఈ నెలాఖరుతో ముగిసే అవకాశం ఉంది. ఆ తరువాత జగన్ జిల్లాలలో పర్యటించే అవకాశం ఉంది. తన తండ్రి ప్రారంభించాలని అనుకున్న రచ్చబండ కార్యక్రమాన్ని జగన్ ప్రారంభించనున్నారు. అందుకోసమే ముందుగా సమస్యగా ఉన్న రహదారుల అభివృద్ధికి దాదాపు రూ.2వేల కోట్ల నిధులు కేటాయించారు.
జగన్ జిల్లాల పర్యటన నేపథ్యంలో ప్రజలకన్నా నేతలకే ఆసక్తి ఎక్కువగా ఉంది. అనేక జిల్లాల్లో వైసీపీ ఎమ్మెల్యేలు గ్రూపు విభేదాలతో ఇబ్బంది పడుతున్నారు. జిల్లాల పర్యటనకు జగన్ వస్తే… పార్టీలో విభేదాలు పరిష్కారం అవుతాయని ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. అంతేకాకుండా తమ నియోజకవర్గంలో దీర్ఘకాలంగా నెలకొన్న సమస్యలపై కూడా జగన్ స్పందించే అవకాశం ఉండడంతో జిల్లాల నేతలు అందరూ జగన్ పర్యటన కోసం ఎదురుచూస్తున్నారు.
ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి అయ్యాయి. వైసీపీ మెజారిటీ స్థానాల్లో విజయం సాధించింది. దీంతో వారందరిలోనూ జగన్ పర్యటన సరికొత్త జోష్ నింపనుంది. ప్రధానంగా రానున్న మూడేళ్లు సంక్షేమ కార్యక్రమాల అమలుతో పాటు అభివృద్ధి కార్యక్రమాలను వేగం చేయాలని జగన్ నిర్ణయించారు. ప్రధానంగా రచ్చబండ కార్యక్రమం కోసం తొలుత జిల్లా కేంద్రాలు కాకుండా మారుమూల నియోజకవర్గాలను ఎంపిక చేయాలని జగన్ ఆదేశించినట్లు తెలిసింది.
Comments are closed.