CM Jagan and Roja Tongue Slip : తెలుగు రాష్ట్రాల్లో మంచి భాష పటిమ ఉన్న నేతలను వెలికి తీస్తే ముగ్గురో నలుగురో కనిపిస్తారు. అందులో తెలుగు లిటరేచర్ చదివిన కేసీఆర్ ఒక్క అక్షరం కూడా పొల్లు పోకుండా తెలుగును తేటతెలుగుగా మాట్లాడగలరు.. తెలంగాణలో తిట్టిపోయగలరు. ఇక ఆ తర్వాత కేటీఆర్, కవిత, హరీష్ లు కూడా బాగానే మాట్లాడుతారు.
ప్రతిపక్షంలో చూసుకుంటే రేవంత్ రెడ్డి మాటల తూటాలు పేల్చడంలో దిట్ట. ఇక తెలంగాణలో జగ్గారెడ్డి లాంటి వారు కూడా బాగానే మాట్లాడుతారు.
ఎటు తిరిగే ఏపీలోనే ఇలా మాట్లాడే నేతలు భూతద్దం పెట్టి వెతికినా కనిపించరు. అదే సమస్య. చంద్రబాబు ‘తెలియజేసుకుంటున్నాను..’.. ‘తమ్ముళ్లూ’ అంటూ దీర్ఘాలు తీస్తూ నొక్కి వక్కాణిస్తుంటారు.
ఇక సీఎం జగన్ కూడా వైఎస్ఆర్ లాగా అంత భీకరంగా మాట్లాడలేరు. సొంతంగా మీడియా ముందర చెప్పలేరు. ఏదైనా బుక్ లో రాసుకొని చదవి చెప్పడం ఆయనకు అలవాటు. బహిరంగ సభల్లో ఆవేదన భరితంగా చెప్తారు కానీ.. ఏదైనా టాపిక్ పై మాత్రం ఆయన అనర్గళంగా మాట్లాడకపోవడం మైనస్.
తాజాగా తిరుపతిలో జగన్ పర్యటించి విద్యాదీవెన డబ్బులను లబ్ధి దారులకు పంచారు. ఈ క్రమంలోనే జగన్ ప్రసంగంలో పలు మాటలను తూలారు. ఆయన టంగ్ స్లిప్ అయ్యారు. తెలుగు పదాలను సరిగ్గా పలకలేక దొరికిపోయారు. ఆ వీడియోలను కట్ చేసిన ప్రతిపక్షాలు, నెటిజన్లు సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు. ఇక ఇదే సభలో మాట్లాడిన రోజా కూడా ఇలానే ‘అవినీతికి తోడుగా జగనన్న అంటూ’ మాట జారింది. దీంతో దీనిపై నెటిజన్లు ఆడుకుంటున్నారు. ఈ నేతలకు జర తెలుగు నేర్పించండయ్యా అంటూ సెటైర్ల వర్షం కురిపిస్తున్నారు.