
వరంగల్ అర్బన్, గ్రామీణ జిల్లాలకు హన్మకొండ, వరంగల్ జిల్లాలుగా పేరు మార్చనున్నట్లు సీఎం కేసీఆర్ వెల్లడించారు. జిల్లాల పర్యటనలో భాగంగా మూడో రోజు వరంగల్ మల్టీస్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి శంకుస్థాపనతోపాటు పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించారు. హన్మకొండలో రూ.57 కోట్లతో 3 అంతస్తుల సమీకృత కలెక్టరేట్ సముదాయాన్ని సీఎం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కలెక్టరేట్ ను అన్ని హంగులతో నిర్మించినందుకు అభినందనలు తెలిపారు.
తెలంగాణలో హైదరాబాద్ తోపాటు నాలుగు నగరాలు అభివృద్ధి చెందాయని అన్నారు. వరంగల్ నగరంలో దంత వైద్యశాల, కళాశాల ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. అన్నింటికి హైదరాబాద్ మీద ఆధారపడితే ఇబ్బంది అవుతుందని చెప్పారు. ఇతర జిల్లాలు కూడా అభివృద్ధి చెందితే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ప్రపంచంలో అత్యుత్తమ వైద్య విదానం కెనడాలో ఉందని తెలిపారు. కెనడాకు ఓ వైద్య బృందాన్ని పంపనున్నట్లు పేర్కొన్నారు.
జులై 1 నుంచి 10 వరకు పల్లెప్రగతి కార్యక్రమం చేపడుతున్నట్లు సీఎం వెల్లడించారు. పల్లెప్రగతి, పట్టణ ప్రగతి, హరితహారం కలిపి నిర్వహిస్తామన్నారు. స్థానిక సంస్థలకు జులై నిధులు ముందే విడుదల చేస్తామని పేర్కొన్నారు. మరోవైపు ఎంజీఎం ఆస్పత్రిని కూడా పడగొట్టి కొత్త ఆస్పత్రి నిర్మాణం చేపట్టాలని సీఎం నిర్ణయించారు. ఎంజీఎం కొత్త నిర్మాణానికి రూ.2,3 వేల కోట్లు ఖర్చయినా ఫర్వాలేదన్నారు.
వైద్యంతోనే కరోనాను జయించవచ్చని సూచించారు. తనకు కూడా కరోనా సోకిందని గుర్తు చేశారు. కరోనాపై భయపడే విధంగా వార్తలు రాయొద్దని సూచించారు. లాక్ డౌన్ మరిన్ని రోజులు పెడితే ప్రజలకు ఉపాధి పోతుందని అన్నారు. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్నాకే అన్ లాక్ ప్రకటించామన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు సడలింపులు ఇచ్చినా కేసుల సంఖ్య పెరగలేదని పేర్కొన్నారు.