AP Employees: ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగుల పరిస్థితి అధ్వానంగా మారుతోంది. నెలనెల వేతనాలు సక్రమంగా అందకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. జీతాలు, పెన్షన్లు సరైన సమయానికి అందకపోవడంతో ఉద్యోగులు అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు తీరుస్తామని హామీ ఇచ్చిన జగన్ తరువాత పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే 27 శాతం మధ్యంతర భృతి ప్రకటించినా పీఆర్సీ పై మాత్రం నోరు ఎత్తడం లేదు. ఫలితంగా ఉద్యోగులకు కష్టాలు తప్పడం లేదు.

దీంతో ఉద్యోగులు ఉద్యోగ సంఘాల నేతలపై ఒత్తిడి పెంచుతున్నారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఉద్యోగ సంఘాలతో సమావేశమై పీఆర్సీపై ఈ నెలాఖరులోగా నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రతి నెల జీతాలు ఒకటో తారీఖునే ఇచ్చేలా చూస్తామని చెప్పారు. దీంతో ఉద్యోగ సంఘాలు శాంతించాయి. సజ్జల హామీ మేరకు ఈ నెలాఖరు వరకు వేచి చూస్తామని పేర్కొన్నాయి.
మరోవైపు సచివాలయ ఉద్యోగులకు గృహవసతి సదుపాయం మరో ఆరు నెలలు పొడిగించాలని ఉద్యోగ సంఘాలు చేసిన వినతికి సీఎం జగన్ అంగీకారం తెలిపారు. ఉద్యోగుల విన్నపానికి సానుకూలంగా స్పందించార. దీంతో మరో ఆరు నెలలు ఉద్యోగులకు ఉచిత వసతి కల్పించేందుకు సుముఖత తెలిపారు. వీరికి నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న రెయిన్ ట్రీ పార్కులో బ్యాచిలర్ అకామిడేషన్ కల్పించారు.
ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా ఉదయం సికింద్రాబాద్ నుంచ విజయవాడకు రైలు సదుపాయం కల్పించారు. తిరిగి సాయంత్రం విజయవాడ నుంచి అదే రైలు సికింద్రాబాద్ కు బయలుదేరుతుంది. దీంతో ఉద్యోగులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఉద్యోగస్తుల సంక్షేమం కోసం చర్యలు తీసుకుంటున్నారు.