Maa association : మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల వేళ ఎంత రచ్చ జరిగిందో తెలిసిందే.’మా’ చరిత్రలోనే ఎన్నడూ లేనంత రసాభాస నడిచింది. ఎన్నికల్లో నిలబడ్డ అభ్యర్థుల్లా కాకుండా.. పంచాయితీకి వచ్చిన ప్రత్యర్థుల్లా వ్యవహరించారు. ప్రత్యక్షంగా తన్నుకోవడం మినహా.. అన్నీ చేశారు. అయితే.. ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా మా మంటలు చల్లారలేదు. ఎవరో ఒకరు పెట్రోల్ పోస్తూనే ఉన్నారు. తాజాగా.. మాజీ అధ్యక్షుడు నరేశ్ మళ్లీ ప్రకాష్ రాజ్, నాగబాబును కెలికారు.

మా ఎన్నికల్లో ప్రధానంగా రచ్చ చేసింది నలుగురే. వారిలో ఇద్దరు అభ్యర్థులు కాగా.. మరో ఇద్దరు నరేశ్, నాగబాబు. మీడియా సమావేశాలు, వీడియోల ద్వారా ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ మా నూతన కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన మోహన్ బాబు నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. నరేశ్ కూడా అదే తీరున మాట్లాడారు.
ఇటీవల ప్రకాశ్ రాజ్ మాట్లాడుతూ.. ప్రతినెలా రిపోర్ట్ కార్డ్ అడుగుతామని అన్నారు. మా అసోసియేషన్ మసక బారిందని నాగ బాబు అన్నారు. ఈ వ్యాఖ్యలకు కౌంటర్ గా మాట్లాడుతూ.. ఈ కమిటీ అవకాశాలకు ప్రాధాన్యం ఇస్తుందని, ఎవరికీ రిపోర్ట్ ఇవ్వాల్సిన అవసరం లేని వ్యాఖ్యానించారు. వెబ్ సైట్లో వివరాలు ఉంటాయని, చూసుకోవచ్చని చెప్పారు.
ఇక, మా అసోసియేషన్ ఎవరి సొత్తూ కాదని అన్నారు. మంచు కమిటీ మంచి కమిటీ అన్న నరేశ్.. ఈ కమిటీ అద్బుతాలు చేస్తుందని చెప్పుకొచ్చారు. ఇక, మా భవిష్యత్ కోసం ఆరేళ్లు కష్టపడి పని చేశానని చెప్పుకున్న నరేశ్.. విష్ణుకు, మా సంస్థకు అన్నయ్యగా ఉంటానని ప్రకటించుకున్నారు.
మొత్తానికి.. ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా రచ్చ చల్లారట్లేదు. ప్రమాణ స్వీకారానికి చిరంజీవిని పిలవలేదు. అటు ప్రకాశ్ రాజ్ ప్యానల్ నుంచి గెలిచినవారు ఎవరూ రాలేదు. ఇటు.. మాటల తూటాలు పేలుతూనే ఉన్నాయి. ప్రకాశ్ రాజ్ ప్రోగ్రెస్స్ రిపోర్ట్ అడుగుతానని చెప్పారు. దీంతో.. మా రచ్చకు ఇప్పట్లో శుభం కార్డు పడదా? అనే సందేహం వ్యక్తమవుతోంది.