
బెజవాడలో తాజాగా లాకప్ డెత్ వెలుగుచూసింది. మద్యం అక్రమ రవాణా కేసులో పోలీసులు ఓ దళిత యువకుడిని అదుపులోకి తీసుకొని విచారించారు. అయితే ఆ యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందడం సంచలనంగా మారింది. విషయం తెలుసుకున్న దళిత సంఘాలు ఆస్పత్రి వద్దకు చేరుకొని పెద్దఎత్తున ఆందోళనకు దిగడంతో ఏపీలో చర్చనీయాంశంగా మారింది.
Also Read: పవన్ జోలికొస్తే ఖబర్ధార్ నారాయణ: సోమువీర్రాజు
బెజవాడలోని కృష్ణలంక పెద్దవారి వీధిలో డి.అజయ్(26) తన తల్లి నాగేశ్వరమ్మతో కలిసి నివసిస్తున్నాడు. అజయ్ కారు డ్రైవర్ కాగా.. అతని తల్లి సమీపంలోని చర్చిలో వాచ్ మెన్ గా పని చేస్తోంది. ఏపీలో మద్యం అక్రమ రవాణాను అరికట్టడంలో భాగంగా స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ ప్రత్యేక నిఘా ఉంచింది. గత నెలరోజుల క్రితం హైదరాబాద్ నుంచి విజయవాడకు అక్రమంగామద్యం సరఫరా అవుతున్నట్లు గుర్తించారు.
చేపల చెరువులో ఆహారం ఉపయోగించే ఫిడ్ లో మద్యం బాటిళ్లు పార్సిల్స్ అవుతున్నట్లు పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. ఈ పారిల్స్ గుప్తా అనే పేరుతో వస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే పార్సిల్ పై ఉన్న నెంబర్ అజయ్ గా పోలీసుల విచారణలో వెల్లడైంది. నాటి నుంచి అజయ్, అతడి స్నేహితుడు సాయికిరణ్ పరారీలో ఉన్నారు. వీరిని పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారు.
అయితే పోలీసులు విచారణ చేస్తుండగా అజయ్ పరిస్థితి విషమించడంతో ఆస్పత్రికి తరలించారు. అజయ్ అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు. పోలీసుల చిత్రహింసలు చేయడం వల్లే అజయ్ చనిపోయాడని బంధువులు, కుటుంబ సభ్యులు ఆరోపించారు. విషయం తెలుసుకున్న దళిత సంఘాలు అక్కడికి చేరుకొని ఆందోళన చేపట్టాయి. అయితే అజయ్ ను పోలీసులు విచారిస్తుండగానే అతడికి ఫిట్స్ వచ్చిందని.. వెంటనే ఆస్పత్రికి తీసుకొచ్చినట్లు పోలీసులు చెబుతున్నారు. అనారోగ్య కారణాలతో అతడు చనిపోయాడని పోలీసులు వాదిస్తున్నారు.
Also Read: రాజధాని నడిబొడ్డున బీజేపీ నేతను కాల్చి చంపిన దుండగులు
ఈక్రమంలో హోం క్వారంటైన్లో ఉన్న ఎస్‌ఈబీ అదనపు ఎస్పీ మేకా సత్తిబాబు రంగంలోకి దిగారు. ఆస్పత్రికి వద్ద ఆందోళన చేస్తున్న దళిత నేతలతో రాత్రి వరకు సంప్రదింపులు చేశారు. అజయ్ అనారోగ్యంతో చనిపోయాడని.. పోలీసులు కొట్టడం వల్లే చనిపోతే పోస్టుమార్టం రిపోర్టు రాగానే బాధ్యులపై చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. దీంతో వారంతా ఆందోళనను విరమించినట్లు తెలుస్తోంది. అజయ్ మృతితో కృష్ణలంకలో విషాదచాయలు నెలకొన్నాయి.