Homeజాతీయ వార్తలుTelangana BJP: అలకలు , అసంతృప్తులు.. కాంగ్రెస్‌ను మించిపోతున్న తెలంగాణ బీజేపీ!

Telangana BJP: అలకలు , అసంతృప్తులు.. కాంగ్రెస్‌ను మించిపోతున్న తెలంగాణ బీజేపీ!

Telangana BJP: తెలంగాణ బీజేపీ పరిస్థితి పుండు మీద కారం చల్లినట్లుగా తయారైంది. ఇప్పటికే అంతర్గత కలహాలు, అత్మప్రబోధం పేరుతో ప్రెస్‌మీట్లు పెట్టి సొంత నేతలు, పార్టీపైనే నాయకులు విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలో హైకమాండ్‌ చేసిన మార్పులు ఆ పార్టీలో పెద్ద కుదుపు సృష్టించేలా ఉన్నాయి. మార్చిన పదవులపై ఎవరికీ ఆసక్తి ఉండటం లేదు. చివరికి కిషన్‌రెడ్డి కూడా అంత ఉత్సాహంగా లేరు. ఆయన కేంద్ర మంత్రిగా అధికారికంగా రాజీనామా చేయకుండా.. ఢిల్లీలోనే ఉన్నప్పటికీ కేబినెట్‌ భేటీకి గైర్హాజర్‌ అయ్యారు. దీంతో ఆయన అలిగారనిప్రచారం జరిగింది. చివరికి మీడియా ముందుకు రాక తప్పలేదు. తనకు అసంతృప్తేమీ లేదని.. తాను అలగలేదని.. కిషన్‌రెడ్డి స్వయంగా చెప్పుకోవాల్సిన పరిస్థితి. అయితే ఆయన మాటల్లో అసంతృప్తి మాత్రం స్పష్టంగా బయట పడింది.

మూడుసార్లు పనిచేశా..
ఉమ్మడి రాష్ట్రానికి తాను రెండు సార్లు చీఫ్‌గా చేశానని.. తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నానన్నారు. ఇప్పుడు నాలుగోసారి ఆ బాధ్యతలు ఇచ్చారని పేర్కొన్నారు. అంటే.. అంతకంటే పెద్ద పదవికి వెళ్లాల్సిన తనను ఇలా నియంత్రించారన్న అసంతృప్తి స్పష్టంగా కనిపించింది. ఉన్న పళంగా నియామకం అమల్లోకి వస్తుందని జాతీయ అధ్యక్షుడు జేపీ .నడ్డా ఆదేశాలు జారీ చేస్తే.. ప్రధాని వరంగల్‌ సభ తర్వాత చార్జి తీసుకుంటానని కిషన్‌రెడ్డి ప్రకటించారు.

అలకబూనిన బండి..
మరో వైపు బండి సంజయ్‌ కూడా అసంతృప్తికి గురయ్యారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఆయనకు కేంద్ర మంత్రి పదవి ఆఫర్‌ చేశారని.. అయితే తనకు ఏ పదవి వద్దన్నారని.. తెలంగాణలో పార్టీ కోసం పని చేస్తానని చెప్పినట్లుగా తెలుస్తోంది. అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన తర్వాత ఆయన మీడియా ముందుకు రాకపోవడం కూడా ఆయన అలకకు నిదర్శనం. అదే సమయంలో తెలంగాణ బీజేపీలో ఆయనకు మద్దతుగా భారీగా సోషల్‌ మీడియా ఉద్యమం సాగుతోంది. బీఆర్‌ఎస్‌ను ఉక్కిరిబిక్కిరి చేసిన బండి సంజయే సరైన చాయిస్‌ అని అంటున్నారు. మిగిలిన చాలా మంది నేతలు.. కిషన్‌రెడ్డిని స్వాగతించడానికి.. వ్యతిరేకించడానికి ముందుకు రావడం లేదు. అంతా సైలెంట్‌గా ఉంటున్నారు.

ఈటల, రాజగోపాల్‌రెడ్డిపై..
ఇక పార్టీలో కీలక నేతలుగా ఉన్న ఈటల రాజేందర్‌కు కీలక పదవి అప్పగించింది బీజేపీ అధిష్టానం. దీనిపై బండి సంజయ్‌ వర్గం అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. మరోవైపు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్‌ నేత పొంగులేని శ్రీనివాస్‌రెడ్డిని కలిసిన మరుసటి రోజే ఆయనకు కీలక పదవి ఇచ్చింది. జాతీయ కార్యవర్గ సభ్యుడిగా నియమించింది.

సీనియర్ల అలక..
ఇదిలా ఉంటే.. పార్టీ కోసం ఏళ్లుగా కష్టపడుతున్న వారిని అధిష్టానం పట్టించుకోవడం లేదని సీనియర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రఘునందన్‌రావు ఇప్పటికే మీడియా ముఖంగా తన అసంతృప్తికి వ్యక్తం చేశారు. మరోవైపు వివేక్, జితేందర్‌రెడ్డి, విజయశాంతి లాంటి సీనియర్లు కూడా పార్టీలో సంతృప్తిగా లేరని తెలుస్తోంది. పరిస్థితి చూస్తుంటే తెలంగాణ బీజేపీ అంతర్గత కలహాలు, అలకలు, అసంతృప్తిలో కాంగ్రెస్‌ను మించిపోతున్నట్లు నిపిస్తోంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular