YCP Group Clashes Lakkireddypalle: ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ నేతల మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి. సొంత పార్టీలోనే విభేదాలు చెలరేగుతున్నాయి. దీంతో గ్రూపులుగా విడిపోయి బాహాబాహీకి దిగుతున్నారు. వైసీపీ నేతలు పోలీసుల ముందే రెండు వర్గాలుగా విడిపోయి రాళ్ల దాడులకు దిగడం చర్చనీయాంశం అయింది. అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లిలో చోటుచేసుకున్న ఈ తతంగంతో స్థానికంగా ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి.
లక్కిరెడ్డిపల్లిలో 1.05 ఎకరాల భూమిని 2019లో చిన్నమండెం మండల జెడ్పీటీసీ మాజీ సభ్యురాలు మేఘన బావ, వైసీపీ నాయకుడు శ్రీనివాసులు రెడ్డి కొనుగోలు చేశాడు. 2022లో పూర్వపు యజమానుల నుంచి వైసీపీ నేతలు ఎంపీపీ సుదర్శన్ రెడ్డి అనుచరులు నరసింహరాజు, సభాపతి నాయుడు కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఒకే భూమిని ఇద్దరు రిజిస్ట్రేషన్ చేయించుకోవడంతో గొడవ మొదలైంది.
Also Read: KKR vs SRH IPL 2022: సన్ రైజర్స్ పని గోవిందా?
స్థలం తమదంటే తమదని వాగ్వాదాలు రేగాయి. ఈ నేపథ్యంలో నరసింహరాజు, సభాపతి నాయుడు భూమిని చదును చేయించి ప్లాట్లుగా మార్చడంతో శ్రీనివాసులు రెడ్డి కోర్టును ఆశ్రయించి అతడికి అనుకూలంగా ఆర్డర్ తెచ్చుకున్నాడు. దీంతో శనివారం శ్రీనివాసులు రెడ్డి తన అనుచరులతో స్థలంలో పనులు చేస్తుండగా ఎంపీపీ వర్గీయులు వచ్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని రెండు వర్గాలను సముదాయించే ప్రయత్నం చేశారు. కానీ వారి ముందే రెండు వర్గాలు బాహాబాహీకి దిగడం ఆందోళన కలిగించింది.
ఇంతలో ఆందోళన తారాస్థాయికి చేరి రాళ్లతో దాడులు చేసుకునే వరకు వెళ్లింది. దీంతో జరిగిన ఘర్షణలో ఏడుగురు గాయపడ్డారు. తక్షణమే రాయచోటి డీఎస్పీ శ్రీధర్, సీఐ రాజు రెండు వర్గాలను చెదరగొట్టారు. ఘర్షణలో పోలీసుల వాహనం ధ్వంసమైంది. శ్రీనివాసులు రెడ్డి రివాల్వర్ తేవడంతో పోలీసుల వారించి స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో రెండు వర్గాలపై కేసులు నమోదు చేసినట్లు సీఐ రాజు తెలిపారు.
Also Read:AP Senior Leaders: ఆ సీనియర్ నాయకులకు ఏమైంది?..వారి సైలెంట్ వెనుక కారణాలేంటి?