ఖమ్మం టీఆర్ఎస్ లో ఉన్న గ్రూపు గొడవలు రాష్ట్రంలో బహుశా ఎక్కడా కనిపించకపోవచ్చు. ఎవరికి వారు బలమైన గ్రూపులను మెయింటెయిన్ చేస్తుంటారు. సాధారణ సమయాల్లో నివురుగప్పిన నిప్పులా ఉండే రాజకీయాలు.. ఎన్నికలు వచ్చినప్పుడల్లా భగ్గున మండుతుంటాయి. ఇప్పుడు కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో మరోసారి కారులో మంటలు చెలరేగుతున్నాయి.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తుమ్మల నాగేశ్వరరావు, నామా నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, అజయ్ గ్రూపులు బలంగా ఉన్నాయి. రోడ్లు భవనాల శాఖ మంత్రిగా ఉన్నన్ని రోజులు హవా కొనసాగించారు తుమ్మల. గత ఎన్నికల్లో ఓడిపోవడంతో ఆయన ప్రాభవం తగ్గిపోయింది.
జిల్లా మొత్తంలో టీఆర్ఎస్ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యేగా ఉన్నారు పువ్వాడ అజయ్. దీంతో.. అనివార్యంగా ఆయనకు మంత్రి పదవి దక్కింది. ఇక, అప్పటి నుంచి వీళ్లందరిపైనా ఆధిపత్యం చెలాయించడానికి అజయ్ ప్రయత్నిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.
కేటీఆర్ అజయ్ స్నేహితులు అన్న సంగతి అందరికీ తెలిసిందే. ఆ కోటాలోనే మంత్రి పదవి దక్కిందంటారు చాలా మంది. ఆయన అండ చూసుకొని జిల్లాలో పెత్తనం చేస్తున్నారని అంటున్నారు మిగిలిన గ్రూపుల్లోని నేతలు!
ఇప్పుడు.. కార్పొరేషన్ ఎన్నికల్లో అన్నీతానై వ్యవహరిస్తూ.. మిగిలిన నేతలకు మెంటలెక్కిస్తున్నట్టు ప్రచారం సాగుతోంది. తనను చూసి ఓటు వేయాలని ఓటర్లకు పిలుపునిస్తున్నాడట మంత్రి. దీంతో.. సీనియర్లకు చిర్రెత్తుకొస్తోంది. టీఆర్ఎస్ లో ఎవరు ఓటు అడిగినా.. కేసీఆర్ ను చూపించి అడగాలి తప్ప, తనను చూసి వేయమని అజయ్ అడగమేంటని ప్రశ్నిస్తున్నారు. అంటే.. కేసీఆర్ కన్నా పెద్దవాడయ్యాడా? అని అడుగుతున్నారు.
ఇక, టిక్కెట్లు కూడా మెజారిటీగా అజయ్ సన్నిహితులకే ఇప్పించుకున్నాడనే విమర్శలు కూడా ఉన్నాయి. తమ వర్గాలకు ప్రాధాన్యం దక్కకుండా చేశాడనే గుస్సా మీదున్న నేతలకు.. అజయ్ చేస్తున్న ప్రచారం పుండుమీద కారం చల్లినట్టుగా ఉందంటున్నారు. మరి, ఈ వ్యవహారం ఎందాక వెళ్తుందో చూడాలి అంటున్నాయి గులాబీ శ్రేణులు.